Share News

తప్పు చేస్తే వదిలేది లేదు!

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:18 PM

చిన్నపాటి గొడవలు, మనస్పర్తలతో జరిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే.. ఆర్థికంగా, శారీకంగా, మానసికంగా మనిషిని కృంగదీ స్తున్న అందర్‌.. బహార్‌ (లోనా బయట) పేకాట జూదం నిర్మూ లనపై ప్రత్యేక దృష్టి పెట్టాను. పూర్తిగా నివారిస్తే పల్లెల్లో ప్రశాంతతను కాపాడవచ్చని గుర్తించాం.

తప్పు చేస్తే వదిలేది లేదు!
రాయలసీమ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌

ఖాకీలపైనా కఠిన చర్యలు

ఆవేశం కాదు.. ఆలోచన ముఖ్యం

పగలు, ప్రతీకారాలు లేని రాయలసీమే లక్ష్యం

చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

రాయలసీమ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌

కర్నూలు-ఆంధ్రజ్యోతి, జూలై 18: చిన్నపాటి గొడవలు, మనస్పర్తలతో జరిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే.. ఆర్థికంగా, శారీకంగా, మానసికంగా మనిషిని కృంగదీ స్తున్న అందర్‌.. బహార్‌ (లోనా బయట) పేకాట జూదం నిర్మూ లనపై ప్రత్యేక దృష్టి పెట్టాను. పూర్తిగా నివారిస్తే పల్లెల్లో ప్రశాంతతను కాపాడవచ్చని గుర్తించాం. మూలలను అన్వేషిస్తే.. పోలీస్‌ శాఖలో కొందరు అధికారుల పాత్ర కూడా ఉండటం విస్మయానికి గురి చేసింది. తప్పు చేసిన ఇద్దరు సీఐలపై రేంజ్‌ బహిష్కరణ వేటు వేసి గట్టి హెచ్చరికలు పంపాం. కొంతవరకు అదుపులోకి వచ్చింది. యువతర దేశ భవిషత్తు పునాదులు.. వారి లక్ష్యం చదువు.. ఉద్యోగ సాధనే కావాలి. మద్యం, గంజాయి మత్తు, జూదం వంటి జోలికి వెళ్లకండి. కన్నవాళ్ల ఆశాజ్యోతులుగా వెలగాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. రాయలసీమ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ బాధ్యతలు చేపట్టి ఆదివారంతో సరిగ్గా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి స్పెషల్‌ ఇంటర్వ్యూ...

వైద్య విద్యను పూర్తి చేసుకున్న డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ 2009లో ఐపీఎ్‌సగా ఎంపికై ఏపీ కేడర్‌లోనే జాయిన్‌ అయ్యారు. ఈ 17 ఏళ్ల కాలంలో ఆయన రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేశారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులను లెక్కచేయకుండా సున్నితంగా వాటిని తిరస్కరిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. కోయ ప్రవీణ్‌ 17 ఏళ్ల కాలంలో రెండేళ్ల పాటు ఒకే చోట ఎక్కడా పనిచేయలేదు. విజయవాడ, విశాఖ రూరల్‌, ప్రకాశం, ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌, ఏపీఎస్పీ, ఓడరేవు, రైల్వేలలో ఎస్పీగా, కమాండెంట్‌గా పనిచేశారు. గ్రేహౌండ్స్‌ ఏపీ పరిధిలో విశాఖలో డీఐజీగా పనిచేస్తూ సరిగ్గా రెండేళ్ల క్రితం కర్నూలు రేంజ్‌కు బదిలీపై వచ్చారు.

( కర్నూలు-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రజ్యోతి: రాయలసీమ రేంజ్‌ (కర్నూలు) డీఐజీగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఎలా ఫీల్‌ అవుతున్నారు?

డీఐజీ: నాకు డీఐజీగా 2023 జవనరిలో పదోన్నతి వచ్చింది. గ్రేహౌండ్స్‌ డీఐజీగా నా తొలి పోస్టింగ్‌. 2024 జూలై 19న రాయలసీమ రేంజ్‌ (కర్నూలు) డీఐజీగా బాధ్యతలు చేపట్టాను. ఎక్కడా కూడా నేను రెండేళ్లు పూర్తిగా పని చేయలేదు. ఇక్కడ రెండేళ్లు పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉంది. రాయల సీమ జిల్లాల్లో నాకు ఇది తొలి పోస్టింగ్‌. అందరి సహకారంతో ప్రశాంతమైన రాయలసీమ కోసం కృషి చేస్తున్నా.

ఆంధ్రజ్యోతి: శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి వ్యూహాలు అమలు చేశారు?

డీఐజీ: శాంతి భద్రతల అమలు బాధ్యత పూర్తిగా ఎస్పీలపైనే ఉంటుంది. గతంలో ఎస్పీగా పనిచేసిన సమయంలో నేను అమలు చేసిన వ్యూహాలు, నేర్చుకున్న పాఠాల వల్ల ఎస్పీలకు సలహాలు.. సూచనలు ఇస్తూ వచ్చాను. సీమ పల్లెల్లో చిన్నచిన్న విషయాలకే ఘర్షణలకు దిగి ప్రాణాలు తీసుకుం టున్నారని గుర్తించాను. ముఖ్యంగా అందర్‌.. బహార్‌ (లోనా.. బయట) పేకాట జూదం గోడవలు, ఘర్షణలకు కారణం అవుతుందని గుర్తించాను. భూతంలా వెంటాడుతున్న ఈ జూదం ఎలాగైనా కట్టడి చేయాలని దానిపై దృష్టి పెట్టాను. పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాను. వారిలో అవగాహన కల్పించాను. పేకాటలో పరోక్షంగానైనా పాత్ర ఉం దని గుర్తించాను. అందుకే ఇద్దరు సీఐలను రేంజ్‌ బహిష్కరణ చేయించా. దీంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది.

ఆంధ్రజ్యోతి: మట్కా, పేకాట, గంజాయి నిర్మూలనకు తీసుకున్న చర్యలు?

డీఐజీ: కడప, అన్నమయ్య జిల్లాల్లో గంజాయి కేసులు ఎక్కువగా వచ్చాయి. మదనపల్లె ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంది. ఆ జిల్లాల్లో యువత కూడా గాంజా వ్యసనానికి లోనై ఉజ్వల భవితను చేతులారా నాశనం చేసుకుంటున్నారని గుర్తించాం. నేను తొలినాళ్లలో ఎస్పీగా పని చేసిన సమయంలో ఎలా కట్టడి చేశామో.. ఆ అనుభవాలను ఎస్పీలతో పంచుకున్నాను. వారికి సరైన సూచనలు (గైడ్‌) చేసి.. ప్రత్యేక టీంలు పెట్టి కట్టడి చేశాం. ఎక్కడైనా రహస్యంగా గంజాయి విక్రయాలు చేసినా, సేవిస్తున్నట్లు మా దృష్టికి తీసుకి వస్తే తక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఆయా జిల్లాల ఎస్పీల ఆధర్యంలో ఈగల్‌ టీంలు యువతకు సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది.

ఆంధ్రజ్యోతి:చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో 12 మంది మరణించారు. దీనిపై విచారణ ఎలా సాగించారు?

డీఐజీ: ఆ ఘటన చాలా విషాదకరం. అలాంటి ఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు. ఈ ప్రమాదం జరిగిన క్షణాల్లోనే సీఎం చంద్రబాబు అప్రమత్తం అయ్యారు. పోలీస్‌, రెవెన్యూ, వైద్యం.. ఇలా అన్ని శాఖలను సమన్వయం చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, డీజీపీలను ఘటన స్థలానికి పంపించారు. కేవలం 48 గంటల్లో మృతులు, వారి బంధువుల డీఎన్‌ఏ సేకరించి, పరీక్షలు పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయడం ఒక రికార్డు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా రోడ్డు ప్రమాదలపై ప్రతీవారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. లోపాలను సరిదిద్దడం, డ్రైవర్లకు అవాహన కల్పించడం, చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే పోలీసు శాఖను చేస్తూ రోడ్డు ప్రమాదలు కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎస్పీల ఆధ్వర్యంలో మా పోలీస్‌ యంత్రాంగం ఈ విషయంలో అద్భుతంగా పని చేస్తుందనే చెప్పాలి.

ఆంధ్రజ్యోతి: వివిధ సమస్యలతో న్యాయం కోసం ఎందరో బాధితులు తమరి వద్దకు వస్తున్నారు. వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు?

డీఐజీ: నా వద్దకు ఎక్కువ శాతం భూ వివాద సమస్యలు, ఆర్థికంగా మోసపోయిన బాధితులే వస్తున్నారు. న్యాయం కోసం వచ్చిన బాధితుల ఆవేదన అర్థం చేసుకుని భరోసా ఇవ్వాలి. వచ్చిన సమస్య తీవ్రతను బట్టి సంబంధిత డీఎస్పీ, సీఐలకు రెఫర్‌ చేసి, అది పరిష్కారమయ్యే వరకు డీఐజీ కార్యాలయం ఫాలో చేస్తుంటాం.

ఆంధ్రజ్యోతి: డీఐజీగా రెండేళ్లలో సీమ జిల్లాల్లో గుర్తించిన ప్రధాన అంశాలు?

డీఐజీ: సీమ ప్రజల్లో ఆవేశం ఎక్కువే. ఏదైనా అర్థమయ్యేలా చెబితే తప్పును సరిదిద్దుకుంటారు. బయటకు మాటతీరు కఠినంగా ఉన్నా.. లోపల మాత్రం మంచి మనుషులే. చిన్నచిన్న విషయాలకు ఘర్షణలకు దిగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. ఈ విషయంలో ప్రజల్లో మార్పు రావాలి. మనిషి ప్రాణం ఎంతో విలువైనది. చిన్నచిన్న విషయాలకే ప్రాణం తీసుకునే స్థాయికి వెళ్లడం మంచిది కాదు. అందరూ ఆలోచించాల్సి అంశం ఇది. ముఖ్యంగా యువత ఏ దారిలో వెళ్తుందో తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి. స్వార్థ రాజకీయాలకు యువత బలికాకూడదు. శతృత్వతాన్ని ప్రేరేపిస్తే శత్రువులే మిగులుతారు. అదే ప్రేమను పంచితే ప్రేమే వస్తుంది. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తే, రాయలసీమ ప్రశాంతతకు కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

ఆంధ్రజ్యోతి: పోలీస్‌ సంక్షేమానికి చేస్తున్న కృషి ఏమిటి?

డీఐజీ: విధి నిర్వహణలో పోలీసులపై పలు ఆరోపణలు వస్తాయి. అందులో వాస్తవమెంత? అన్నది గుర్తించాలి. నిజంగా సమాజానికి, ప్రజలకు తీవ్రమైన నష్టం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తే తప్పక చర్యలు తీసుకోవాల్సిందే. చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు వేయడం సరైనది కాదని నా అభిప్రాయం. కానిస్టేబుళ్లకు ఆర్థికంగా నష్టం జరగకుండా చూస్తాను. అదే క్రమంలో వారి సంక్షేమం కోసం నా వంతుగా కృషి చేస్తున్నాను.

ఆంధ్రజ్యోతి: యువతకు మీరిచ్చే సందేశం?

డీఐజీ: జీవితం ఎంతో విలువైనది. విద్యార్థి, యువత ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్‌ చేయాలనే క్రమంలో పెడదారి పడుతున్నారు. యువత ఎంజాయ్‌ చేయాల్సిందే.. కాదనను. ఆ ముసుగులో మద్యం, గంజాయి వంటి మత్తుకు బానిసలై ఉజ్వల భవిషత్తును నాశనం చేసుకోవడం ఎంత వరకు సబబు. నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉన్నారని గ్రహించాలి. యువతకు చదువు, ఉద్యోగ సాధన.. లక్ష్యాలు కావాలి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని, ఆర్థికంగా స్థిరపడిన తరువాత అప్పుడు ఎంజాయ్‌ చేయాలి. అది చూసి కన్నవాళ్లు, బంధువులు, మిత్రులు సంతోషిస్తారు. పాఠశాల నుంచి కళాశాలలో అడుగు పెట్టిన విద్యార్థి ఆరేళ్లు కష్టపడితే. అరవై ఏళ్లు సుఖపడుతారు. విద్యార్థిగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్‌ చేస్తామని పెడదారి పడితే.. అరవై ఏళ్లు కష్టపడాల్సి వస్తుంది. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి.. చదువు, ఉద్యోగ సాధనపైనే దృష్టిని కేంద్రీకరించాలి.

Updated Date - Jul 18 , 2026 | 11:18 PM