Share News

40 ఏళ్ల పాటు తాగునీటి సమస్య తలెత్తకూడదు

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:15 AM

పట్టణంలో మరో నలబై ఏళ్లపాటు తాగునీటి సమస్య లేకుండా జీడీపీ పైపులైన్లు ఉండాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సూచించారు.

40 ఏళ్ల పాటు తాగునీటి సమస్య తలెత్తకూడదు
అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వర రెడ్డి

జీడీపీ పైపులైన్‌ పనులపై అధికారులతో సమీక్ష

ఎమ్మిగనూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలో మరో నలబై ఏళ్లపాటు తాగునీటి సమస్య లేకుండా జీడీపీ పైపులైన్లు ఉండాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చాంబర్‌లో గురువారం ఎమ్మెల్యే బీవీ చైర్‌పర్సన్‌ మాచాని సునీతతో కలిసి జీడీపీ పైప్‌లైన్‌ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిల్‌ కమిషనర్‌ గంగిరెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలో 96 కి.మీ. మేర పైప్‌లైన్‌ వేయాల్సి ఉంటుందని చెప్పారు. మైనార్టీ కాలనీలో 40లైన్లు తాగునీటి పైప్‌లైన్లు, ఎద్దుల మార్కెట్‌ దగ్గర ఉన్న శక్తినగర్‌లో పైప్‌లైన్‌ వేయాలని సూచించారు. పైపులైన్‌ వేసిన రెండు మూడు రోజుల్లో రోడ్డుకు ప్యాచ్‌ వర్క్‌ పూర్తి కావాలని జీడీపీ పైపులైన్‌ పథకం కాంట్రాక్టు ప్రతినిధిని ఆదేశించారు. పైపులైన్‌ పూర్తి అయిన తరువాతనే పట్టణంలో సీసీ రోడ్లు వేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే పట్టణంలో పార్కుల అభివృద్ధి, కూడళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణంలో గ్రీనరీ, బ్యూటిఫికేషన్‌ పనులు సంతృప్తికరంగా లేవని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. కూరగాయల మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ, చైర్‌పర్సన్‌ మాచాని సునీత, వైస్‌ చైర్మన్‌ తురేగల్‌ నజీర్‌, డీఈ నీరజ, రాజునాయక్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశ్‌, కౌన్సిలర్లు మురారి పద్మావతి,నాయకులు మరారి రాజశేఖర్‌, డీలర్‌ రామకృష్ణ, కృష్ణ, మున్సిపల్‌ సిబ్బంది మైనార్టీ కాలనీ, శక్తినగర్‌, గోనెగండ్ల సర్కిల్‌ ప్రాంతాల్లో పర్యటించారు.

Updated Date - Nov 27 , 2026 | 12:15 AM