Share News

సుంకేసుల డ్యాంలో నీరు లేదు

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:38 PM

సుంకేసుల డ్యాంలో నీరు నిల్వ లేనందున కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసే అవకాశం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

సుంకేసుల డ్యాంలో నీరు లేదు
అధికారులతో మంత్రి టీజీ భరత్‌

నిమజ్జనానికి ప్రజలు సహకరించాలి

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌ , సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సుంకేసుల డ్యాంలో నీరు నిల్వ లేనందున కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసే అవకాశం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శనివారం తన నివాసంలో వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారులు, వినాయక నిమజ్జన కమిటీ ప్రతి నిధులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కర్నూలులో నీటి పరిస్థితులు అనుకూలంగా లేనందున, ఈ ఏడాది వినాయక నిమజ్జనానికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మట్టి వినాయక విగ్రహాల(రెండు అడుగులు)ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిన్న విగ్రహాలను ఇళ్ల వద్దనే నిమజ్జనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈఏడాది పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే పెద్ద విగ్రహాలను తీసుకొచ్చిన వారు, ఆర్డర్‌ ఇచ్చినవారు ఆందోళన చెందొద్దు అని అన్నారు. వాటిని ఒకచోట భద్రంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే ఏడాది వాటితో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేలా అవకాశం కల్పిస్తామని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకొని అధికారులకు, ఉత్సవ కమిటీలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాగు నీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు.

Updated Date - Sep 05 , 2026 | 11:38 PM