టైం లేదు సర్
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:35 PM
‘హలో సర్.. బీఎల్‌వోనూ మాట్లాడుతున్నాను. సర్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్ కోసం మీ ఇంటికొచ్చాను. ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు.
నగరంలో దొరకని ఓటర్ల అడ్రస్‌లు
జిల్లాలో 75.56 శాతం డిజిటలైజేషన్ పూర్తి
కర్నూలు నియోజకవర్గంలో 64.03 శాతమే
అడ్రస్‌లు దొరకక బీఎల్‌వోల అవస్థలు
మిగిలింది నాలుగు రోజులే
డిజిటలైజేషన్ చేయాల్సిన ఓట్లు 5,09,930
నేడు, రేపు కర్నూలులో ప్రత్యేక క్యాంపులు
‘హలో సర్.. బీఎల్‌వోనూ మాట్లాడుతున్నాను. సర్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్ కోసం మీ ఇంటికొచ్చాను. ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. మీరెక్కడున్నారు..? మీకు వీలైతే 2024లో ఓటు వేసిన కాలనీలో ఉన్న సచివాలయం వద్దకు వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్‌ను భర్తీ చేసి ఇచ్చి వెళ్లగలరా..? టైం లేదు సర్.. ప్లీజ్ అర్థం చేసుకోండి..’ అడ్రసులు వెతుక్కోవడానికి బీఎల్‌వోలు పడుతున్న అవస్థలు ఇవి.
ముఖ్యంగా నగర, పట్టణ బీఎల్‌వోలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ గడువు 14వ తేది సాయంత్రం ముగుస్తుంది. అంటే మిగిలిన గడువు కేవలం నాలుగు రోజులే. ఇంకా 5,09,930 ఓటర్లను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇది సాధ్యమేనా..? 90-95 శాతం సర్ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలను పరుగులు పెట్టిస్తున్నారు. కర్నూలు నగరంలో సర్ ప్రక్రియ వెనుకబడడంతో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నేడు, రేపు రెండు రోజులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు.
కర్నూలు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం జూన్ 12న ప్రారంభమైంది. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,203 పోలింగ్ స్టేషన్లు పరిధిలో 20,86,119 ఓటర్లు ఉన్నారు. వీరిందరిని సర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ చేయాలని లక్ష్యం. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు 15,76,189 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను స్వీరించి డిజిటలైజేషన్ పూర్తి చేశారు. అంటే.. 75.56 శాతం పురోగతి సాధించారు. పట్టణ, నగర ఓటర్లతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రి య వేగంగా జరుగుతోంది. నగరంలో బీఎల్‌వోలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయినా.. ఓటర్ల అడ్రస్‌లు సేకరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రికార్డుల్లో మాత్రం 99 శాతానికి పైగా ఈఎఫ్ ఫారాలు పంపిణీ చేశామని చెబు తున్నా, క్షేత్రస్థాయిలో అడ్రస్‌లు దొరకక ఓటర్లకు ఇవ్వడం లేదు. వారి ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే, మీరు డయల్ చేసిన నంబరు తాత్కాలికంగా పని చేయడం లేదు అని, మనుగడలో లేదని వాయిస్ రికార్డు సమాధానం వస్తోంది. కొందరు ఫోన్ రిసీవ్ చేసుకున్నా.. ‘ఇప్పుడు మేము అందుబా టులో లేం.. వీలు చూసుకుని వస్తాం..’ అని సమాధానం చెబుతు న్నారు. దీంతో కర్నూలు నగరంలో వంద శాతం సర్ ప్రక్రియ పూర్తి చేయడం కష్టమని ఈఆర్‌వోలే అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.
గ్రామీణులే ఉత్తమం
నగర, పట్టణ ఓటర్లతో పోలిస్తే గ్రామీణ ఓటర్లే మేలని అంటున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,74,622 మంది ఓటర్లు ఉంటే 1,75,830 మంది ఓటర్లే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. అంటే.. 64.03 శాతం మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. రోజుకు 10-12 వేల ఓటర్లకు మించి డిజిటలైజేషన్ చేయలేకపోతున్నారు. పాణ్యం, ఆదోనిలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. ఇక్కడ 70.07, 71.28 శాతం పూర్తయింది. అయితే పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగిన పత్తికొండ నియోజకవర్గంలో 82.36 శాతం, కోడుమూరులో 81.45 శాతం, ఆలూరులో 80.30 శాతం సర్ పూర్తి చేశారు. ఎమ్మిగనూరులో 79.67, మంత్రాలయంలో 79.45 శాతం పూర్తి చేశారు. నగరంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. 75 శాతం కూడా దాటే అవకాశం లేదు. అదే జరిగితే 68,655 మంది ఓటర్ల ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బుధవారం (8వ తేది) నాటికి జిల్లాలో నియోజకవర్గాల వారిగా ఓటర్లు, ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, డిజిటలైజేషన్ వివరాలు
నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్/ శాతం
సంఖ్య/ పేరు ఆన్‌లైన్ చేసింది
137-కర్నూలు 2,74,622 1,75,830 64.03
138-పాణ్యం 3,35,015 2,34,748 70.07
142-పత్తికొండ 2,26,970 1,86,938 82.36
143-కోడుమూరు 2,51,496 2,04,837 81.45
144-ఎమ్మిగనూరు 2,53,206 2,01,732 79.67
145-మంత్రాలయం 2,12,841 1,69,092 79.45
146-ఆదోని 2,67,980 1,91,026 71.28
147-ఆలూరు 2,63,989 2,11,986 80.30
మొత్తం 20,86,119 15,76,189 75.56
రెండు రోజులు ప్రత్యేక క్యాంపులు
కర్నూలు నగరంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వంద శాతం చేసేందుకు కృషి చేస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఓటరు నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించి డిజిట లైజేషన్ చేసేందుకు చర్యలు చేపట్టాం. నేడు, రేపు రెండు రోజులు ప్రత్యేక క్యాంపులు పెట్టాం. 2024 ఎన్నికల్లో ఓటు వేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తే అక్కడ బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, అవసరమైన సహాయకులు ఉంటారు. అక్కడే ఈఎఫ్ ఫామ్ భర్తీ డిజిటలైజేషన్ చేస్తారు. ఓటర్లు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసు కోవాలి.
- చల్లా ఓబులేసు, కమిషనర్, కర్నూలు