Share News

కార్మికులను విస్మరిస్తే మనుగడ లేదు

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:30 PM

కార్మికులను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు.

కార్మికులను విస్మరిస్తే మనుగడ లేదు
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

ట్రంప్‌ అంటే మోదీకి భయం

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

ఆలూరు రూరల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కార్మికులను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. శనివారం ఆలూరులో ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభల సందర్భంగా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడు తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతున్నదని విమర్శించారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరి స్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ 12 ఏళ్ల పాలనలో దేశ సంపదను ఒకే కార్పొరేట్‌ సంస్థకు రూ.10 లక్షల కోట్లు కేటాయించారని ఆరోపించారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ అదాని, అంబా నీలకు అనుకూలంగా వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు. దేశ సంపద 3 శాతం సంపన్నుల చేతిలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని శాసించే స్థాయికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ లోబడిపోయారని ఆరోపించారు. దేశంలో 140 కోట్ల జనాభా ఉందని, అధికార ప్రభుత్వాలను ప్రశ్నించే దమ్ము కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. వ్యవసాయ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, పనికి తగ్గ వేతనం ఇవ్వడంలేదని, ఇటువంటి ప్రభుత్వాలను ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని ప్రజా సంఘాలను కూడగట్టుకుని వచ్చే నెల 12 నుంచి పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రావులపల్లి రవీంద్ర, వెంకట సుబ్బయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి మునెప్ప, సీపీఐ రాష్ట్ర నాయకులు రామాంజినేయులు, భీమ లింగప్ప, జగన్నాథం, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 11:30 PM