Share News

వారి త్యాగం..స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:40 PM

స్వాతంత్య్రం కోసం పని చేసిన మహనీయుల త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకమని, త్యాగధనుల పోరాటాలతోనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

వారి త్యాగం..స్ఫూర్తిదాయకం

దేశభక్తుల ఆశయాలతో జిల్లాను ప్రగతి పథంలో నిలుపుదాం

సీఎం నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం

స్వాతంత్య్ర దినం వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం కోసం పని చేసిన మహనీయుల త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకమని, త్యాగధనుల పోరాటాలతోనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో అలుపెరుగని పోరాటాలు చేసిన త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. శనివారం 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలోని జిల్లా పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జేసీ నూరుల్‌ ఖమర్‌ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి టీజీ భరత్‌ తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉమ్మడి జిల్లాకు చెందిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ముత్తుకూరు గౌడప్ప, కర్నూలు ఆఖరు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌, మహాదాత బుడ్డా వెంగళరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, సర్దార్‌ నాగప్ప, వడ్డే ఓబన్న వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. వారిని అనుసరిస్తూ జిల్లా ప్రగతికి కృషి చేద్దామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏడాదికి 15 శాతం వృద్ధి సాధన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ప్లాన్‌ను అమలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా స్థూల దేశీయోత్పత్తి రూ.63,206 కోట్లు, తలసరి ఆదాయం రూ.2,31,534గా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని అన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తున్న కలెక్టర్‌ ఎ. సిరి, శాంతి భద్రతలకు కృషి చేస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జేసీ నూరుల్‌ ఖమర్‌లకు, న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయం అందిస్తున్న న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను పలుకరించి, వారిని శాలువలు, పూల దండలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను పరిశీలించారు. కర్నూలు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ అరకితభావంతో పనిచేయాలి

కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు.

Updated Date - Aug 15 , 2026 | 11:40 PM