విద్యుత్ తీగలే టార్గెట్
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:55 PM
పొలాల వద్ద విద్యుత్ తీగలను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళలో కరెంటు వైర్లను కట్ చేసి తస్కరిస్తున్నారు.
కరువు పరిస్థితుల్లో భరించలేని నష్టం
పొలాల వద్ద వైర్లను వదలని వైనం
లబోదిబోమంటున్న రైతాంగం
కోడుమూరు రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పొలాల వద్ద విద్యుత్ తీగలను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళలో కరెంటు వైర్లను కట్ చేసి తస్కరిస్తున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలు సరిగా పండక నష్టాలు మూట గట్టుకుంటున్నామని, దొంగలు పొలాల వద్ద వ్యవసాయ మోటార్లపై పడి విద్యుత్ తీగలను తీసుకెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వర్కూరులో జీడీపీ కెనాల్ పక్కన నారాయణ, వెంకటేశ్, సత్యమ్మ అనే రైతుల విద్యుత్ మోటార్ల వైర్లను దుండగులు కట్ చేశారు. బుధవారం ఉదయం పొలానికి తడి పెట్టడానికి వెళ్లిన రైతులు మోటారు నుంచి స్టార్టర్ వరకు విద్యుత్ వైరు లేకపోవడం చూసి లబోదిబోమన్నారు. ఒక్కో రైతు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పైగా ఖర్చు చేసి వైరు కొనుగోలు చేసి ఉల్లి, మిరప పంటలకు తడి అందించుకున్నారు. దుండగులు ఎమ్మిగనూరు రహదారి ఆనుకుని కమ్మరి శ్రీనివాసులు అనే రైతు పొలంలో సుమారు ఐదు విద్యుత్ స్తంభాల మధ్య విద్యుత్ కేబుల్ వైరును కట్ చేశారు. ఇదే గ్రామంలో ఈనెల 2న పులకుర్తి రహదారి వెంట సుమారు 20కి పైగా బోరుబావుల వద్ద విద్యుత తీగలను దుండగులు కట్ చేసి తస్కరించారు.
కాపర్ వైరుకు డిమాండ్
విద్యుత్ వైరు లోపల ఉండే రాగితీగకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతన్నట్లు తెలుస్తోంది. దుండగులు తస్కరించిన తీగను కాల్చి లోపల ఉన్న కాపర్ వైరును అమ్ముకుంటున్నట్లు సమాచారం.
ధర వింటే షాక్..
మార్కెట్లో బోరుబావులకు సంబంధించిన విద్యుత్ తీగ ధర వింటే షాక్ కొట్టినంత పని అవుతుంది. నాణ్యమైన తీగ మీటరు ధర రూ.150 పలుకుతోంది. స్టార్టర్ నుంచి మోటారు వరకు కొనుగోలు చేయాలంటే రూ.వేల ఖర్చు పెట్టుకోవాల్సిందే.