గుడిలో దొంగలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:55 PM
మండలంలోని ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో దొంగలు పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున నలుగురు గుర్తుతెలియని దుండగులు ఆలయం వద్దకు చేరుకున్నారు.
కాల్వబుగ్గ ఆలయంలో చోరీ
రూ.20లక్షల విలువైన 9.5 కిలోల వెండి అపహరణ
ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఓర్వకల్లు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో దొంగలు పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున నలుగురు గుర్తుతెలియని దుండగులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా ఆటోను పార్కింగ్ చేసి కోనేరు వైపు నుంచి వచ్చి కట్టర్ సహాయంతో తాళాలను కట్ చేశారు. ఇద్దరు లోపలికి ప్రవేశించి హుండీ తాళాలు పగులకొట్టారు. అందులో ఏమీ లేకపోవడంతో గర్భగుడిలోకి చొరబడి స్వామివారి దారాపాత్ర, నాగాభరణం, అమ్మవారి పీఠం, సింహం వెండి తొడుగులను అపహరించుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. నలుగురు దుండగులు ముఖానికి మాస్కులు, చేతికి గ్లౌజులు వేసుకున్నారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మినారాయణ శర్మ పూజ కోసం వచ్చారు. తాళాలు పగులకొట్టినట్లు గుర్తించి ఈవిషయాన్ని ఈవో మద్దిలేటికి సమాచారం ఇచ్చారు. ఈవో వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కర్నూలు రూరల్, కోడుమూరు, త్రీటౌన్, తాలుకా సీఐలు చంద్రబాబు నాయుడు, తేజమూర్తి, శేషయ్య, మోహన్ కిషోర్, ఓర్వకల్లు, నాగులాపురం, నాల్గవ పట్ణణ ఎస్‌ఐలు సునీల్ కుమార్, అఖిల్, చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది తనిఖీలు చేసి పరిశీలించారు. సీసీ కెమెరా దృశ్యాలను పర్యవేక్షించారు. క్లూజ్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.
జాతీయ రహదారి ముఖద్వారం నుంచి..
డాగ్ స్క్వాడ్ జాతీయ రహదారి ముఖద్వారం నుంచి చిన్న, పెద్ద కోనేరుల మీదుగా వచ్చి ఆలయంలోకి చేరుకుంది. అక్కడి నుంచి చిన్న కోనేరు, పెద్దకోనేరు మీదుగా ముఖద్వారం వరకు వెళ్లి నిలిచిపోయింది. నలుగురు గుర్తు తెలియని దుండగలు ఆటోలో వచ్చి కోనేరుల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడి అదే మార్గాన బయటకెళ్లి ఆటోలో వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు వెలుగుచూశాయి. గుర్తు తెలియని దుండగులు పట్టుకునేందుకు క్లూజ్ టీమ్‌లను ఏర్పాటుచేశామని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.
తొమ్మిది నెలల వ్యవధిలోనే..
గత ఏడాది జూలై 12న ఐదు హుండీలు దొంగతనానికి గురైన సంఘటన మరువక ముందే మళ్లీ చోరీ జరగడం చర్చనీయాంశమైంది. కేవలం 9నెలల వ్యవధిలోనే రెండో సారి ఆలయంలో దొంగతనం జరగడం ఆలయ భద్రతపై దేవాదాయ శాఖ అధికారులకు ఎంత మాత్రం శ్రద్ద ఉందో తెలుస్తుందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు దొంగతనానికి గురి కావడంతో మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో మద్దిలేటి, చైర్మన్ నారాయణ, ధర్మకర్త దేవేంద్ర, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.