రెచ్చిపోయిన దొంగలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:20 AM
నగరంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయలక్ష్మినగర్‌లో చోరీ చేశారు. మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతులు చెందిన ఇంట్లో ఈ చోరీ జరిగింది. మద్దిలేటి ఓ ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.
కర్నూలు, నంద్యాల, ఆదోనిలో చోరీలు
బంగారు ఆభరణాల అపహరణ
14 తులాల బంగారు ఆభరణాలు..
కర్నూలు క్రైం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): నగరంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయలక్ష్మినగర్‌లో చోరీ చేశారు. మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతులు చెందిన ఇంట్లో ఈ చోరీ జరిగింది. మద్దిలేటి ఓ ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం విధుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆయన భార్య లక్ష్మీదేవి కూతురుతో కలిసి 12 గంటల ప్రాంతంలో బ్యాంకుకు వెళ్లింది. తిరిగి 1 గంట ప్రాంతంలో ఇంటికి వచ్చి చూస్తే ఇంటి గేటు తెరిచి ఉంది. ప్రధాన ద్వారం గడియ పగలకొట్టి ఉండటంతో ఆందోళనకు గురైన ఆమె గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్లింది. గేటు శబ్దం విని లోపల ఉన్న దొంగలు అప్రమత్తమయ్యారు. ప్రధాన ద్వారం వద్ద తలుపుకు గడియ పెట్టుకుని బీరువాలో ఉన్న నగలు ఓ బ్యాగులో వేసుకుని తలుపు వెనుకాల నిల్చున్నారు. లక్ష్మీదేవి గట్టిగా కేకలు వేస్తూ తలుపులు తీయగా.. దొంగలు చటుక్కున తలుపు తెరిచి ఈమెను తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు. అప్పటికీ వీరిద్దరు ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినా వారిని కింద తోసేసి సమీపంలో ఉన్న ఓ ద్విచక్రవాహనం ఎక్కి పరారయ్యారు. ఈఘటనలో లక్ష్మీదేవికి స్వల్పగాయలయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాలలో రెండు చోరీలు
నంద్యాల క్రైం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం చోరీకి పాల్పడ్డారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని బంగారు అంగళ్ల బజారులోని అన్సర్ జ్యూవెల్లర్స్ షాపులో స్ర్తీ పురుషులు ఇద్దరు నగలు కొనేందుకు వెళ్లారు. నగలు చూసిన అనంతరం మళ్లీ వస్తామని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా సుమారు రూ.80వేల ఖరీదు చేసే ఐదు గ్రాముల బంగారుల డాలర్‌ను చోరీ చేశారు. దీనిపై నగల వ్యాపారి అన్సర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీ విషయం సీసీ పుటేజీలో నమోదు అయింది. అలాగే మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటాచలం కాలనీలో బషీర్ అనే వ్యక్తికి చెందిన యాక్సిస్ స్కూటీ నం.1254ని ఈనెల 24వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఉదయాన్నే వాహనం కనిపించకపోవడంతో బషీర్ గురువారం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదోనిలో ఆరున్నర
తులాల బంగారం, వెండి, నగదు అపహరణ
ఆదోని, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి భారీగా నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వరుస దొంగతనాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన జాన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం వేర్వేరు కార్యక్రమాలకు వెళ్లారు. జాన్ పిల్లలు హొళగుంద జాతరకు వెళ్లగా, జాన్ ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు సాయంత్రం సమయంలో ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా, ఇంటి తలపులు తెరిచి ఉండడాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా సామగ్రి మొత్తం చిందరవందరగా పడి ఉంది. బీరువాలో భద్రపరిచిన విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న బీరువాలో ఉంచిన ఆరున్నర తులాల బంగారు ఆభరనాలు, రూ.2 లక్షలు నగదుతో పాటు 150 గ్రామాలు బరువున్న వెండి అమ్మవారి విగ్రహం చోరీకి గురైందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.