Share News

జడ్పీ పీఠం.. ఎవరికి యోగం?

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:40 PM

అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు అందుకునేదెవరు..? జిల్లా పరిషత్‌ (జడ్పీ) చైర్మన్‌ పీఠం దక్కేదెవరికి..? పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న సీనియారిటీకి అవకాశం దక్కుతుందా..?

జడ్పీ పీఠం.. ఎవరికి యోగం?

అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి..?

పరిశీలనలో ఉలిగయ్య, షేక్‌ సాధిక, మిద్దె గీతాకుమారి, శంకరమ్మ

రేసులో హొళగుంద జడ్పీటీసీ గోవింద గౌడ్‌

అధిష్ఠానానికి చేరిన ఆశావహుల జాబితా

కర్నూలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు అందుకునేదెవరు..? జిల్లా పరిషత్‌ (జడ్పీ) చైర్మన్‌ పీఠం దక్కేదెవరికి..? పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న సీనియారిటీకి అవకాశం దక్కుతుందా..? కొత్తగా రాజకీయాల్లోకి వాళ్లకు అదృష్టం వరిస్తుందా..? సామాజికవర్గాల సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారా..? అధినేత, యువనేతల ఆశీస్సులే కొలమానమవుతాయా..? కర్నూలు టీడీపీ శ్రేణులు, ప్రజల్లో ఇదే హాట్‌ టాపిక్‌. ఏ ఇద్దరు కలసినా జడ్పీ చైర్మన్‌ ఎవరు..? అంటూ చర్చించుకుంటున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించడంతో చైర్మన్‌ పీఠంపై ఆశావహుల సంఖ్య పెరిగింది. పలువురు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులను కలుస్తూ చైర్మన్‌ పీఠం కోసం తమ పేరు అదిష్టానం దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నారు. ముఖ్యనేతల సిఫార్సులు.. అధిష్టానం వద్ద పలుకుబడి.. సామాజిక సమీకరణాలు.. ఇలా ఎవరికి వారు తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అంతిమంగా అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌ ఆశీస్సులు ఉన్నవారికే పదవి దక్కే అవకాశం ఉంది. వారి ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

జిల్లా పరిషత్‌ (జడ్పీ)లో మొత్తం 26 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ 18, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. క్రిష్ణగిరి జడ్పీటీసీ సభ్యుడు మర్రి శ్రీరాములు టీడీపీ మద్దతులో, హొళగుంద జడ్పీటీసీ సభ్యుడు ఈడిగ గోవింద గౌడ్‌ టీడీపీ రెబల్‌గా పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలో కూటమి జడ్పీటీసీల బలం 21 అవుతుంది. వైసీపీ ఐదు స్థానాలతో సరిపుచ్చుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నియోజకవర్గాల వారీగా పత్తికొండలో 5, ఆలూరులో 4, కోడుమూరులో 3, ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యంలో రెండేసి చొప్పున, ఆదోనిలో ఒక స్థానంలో విజయం సాధించాయి. టీడీపీ రెబల్‌తో కలిపితే కూటమి 21 స్థానాలతో జడ్పీ పీఠంపై స్పష్టమైన పట్టు సాధించింది. దీంతో చైర్మన్‌ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జి పి.శ్రీనివారసరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మలు జడ్పీ చైర్మన్‌ పీఠం కోసం ఐదుగురు ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను అధిష్ఠానం పరిశీలన కోసం పంపినట్లు సమాచారం.

ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం

జడ్పీ చైర్మన్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు చేసినప్పటి నుంచి చైర్మన్‌ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కౌతాళం జడ్పీటీసీ చుడి ఉలిగయ్య. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఉలిగయ్య ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇంటర్‌ వరకు చదువుకున్నారు. ఆయన భార్య చౌడేశ్వరి కౌతాళం ఎంపీపీగా పని చేశారు. 2009 వరకు ఆదోని నియోజకవర్గంలో, ఆ తరువాత మంత్రాలయం నియోజకవర్గంలోకి కౌతాళం మారింది. గత ఎన్నికల్లో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. పార్టీ చేసిన సేవలు, రాజకీయ అనుభవం, సామాజికవర్గ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే తనకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ముఖ్యనేతలను కలసి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అధినేత, యువనేత ఆశీస్సుల కోసం విజయవాడకు వెళ్లినట్లు సమాచారం.

తుగ్గలి జడ్పీటీసీగా ఎంపికైన మిద్దె గీతాకుమారి పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) చేసిన ఈమె స్వగ్రామం జొన్నగిరి. భర్త మిద్దె వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు మిద్దె రవికుమార్‌ మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీవై టికెట్‌పై పత్తికొండ నుంచి మిద్దె వెంకటేశ్వర్లు పోటీ చేయాలని అనుకున్నా.. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు జోక్యంతో ఆ పార్టీని వీడి టీడీపీ కోసం పని చేశారు. రాజకీయాల్లో ఉంటూనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పటికే యువనేత నారా లోకేశ్‌ పరిశీలన కోసం ఆమె పేరు వెళ్లినట్లు సమాచారం.

దేవనకొండ జడ్పీటీసీగా విజయం సాధించిన షేక్‌ సాధిక అనూహ్యంగా జడ్పీ చైర్మన్‌ రేసులో తెరపైకి వచ్చారు. విశ్వభారతి మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దేవనకొండ జడ్పీటీసీ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించడంతో, 22 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఈమె పుట్టినిల్లు గోనెగండ్ల ఎమ్మిగనూరు నియోజకవర్గంలో, మెట్టినిల్లు ఈదులదేవరబండ ఆలూరు నియోజకవర్గంలో ఉంది. ఆమె మామ సుభాన్‌ టీడీపీ సీనియర్‌ నాయకుడు. తండ్రి ఇస్మాయిల్‌ ఆర్‌ఎంపీగా సేవలందిస్తునానరు. ఆమెను జడ్పీ చైర్మన్‌ పీఠంపై కూర్చుబెట్టాలని వియ్యంకులు ఇద్దరు కూడా తమకున్న రాజకీయ పలుకుబడితో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆదోని జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన కురవ శంకరమ్మ కూడా జడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్నారు. ఆమె స్వగ్రామం ఆదోని మండలం నారాయణపురం. ఆమె కుమారుడు రఘు టీడీపీలో కీలకంగా కొనసాగుతున్నారు. ఆదోనిలో వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ఆమె సోదరుడు మాన్వి దేవేంద్రప్ప ఏపీ కురవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో జడ్పీటీసీగా, ఆదోని మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా పని చేశారు. కురవ సామాజికవర్గం కోటాలో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

హొళగుంద జడ్పీటీసీ టీడీపీ టికెట్‌ ఆశించిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఈడిగ గోవిందగౌడ్‌ టికెట్‌ రాకపోవడంతో రెబల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి చేసి విజయం సాధించారు. ఆయనను పార్టీ సస్పెండ్‌ చేసింది. అయితే జడ్పీటీసీగా గెలిచిన తరువాత ఆ పార్టీ ముఖ్య నాయకులను కలసి తన సస్పెండ్‌ ఎత్తివేయాలని, ఏ అవకాశం ఉన్నా జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి తన పేరును పరిశీలించాలని విన్నవించినట్లు సమాచారం. ఈయన దరఖాస్తునూ అధిష్ఠానం పరిశీలనకు పంపినట్లు సమాచారం.

సీనియార్టీనా.. యువ నాయకత్వమా?

జడ్పీ చైర్మన్‌ పీఠం ఆశిస్తున్న వారిలో అధిష్ఠానం సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తుందా..? యువనాయకత్వానికి పట్టం కడుడుతుందా..? అన్న చర్చ తెరపైకి వచ్చింది. యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ బాగా చదువుకున్న యువనాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు పేర్కొన్నారు. అదే నిజమైతే దేవనకొండ, తుగ్గలి జడ్పీటీసీ సభ్యులు షేక్‌ సాధిక, మిద్దె గీతాకుమారిలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తే కౌతాళం జడ్పీటీసీ సభ్యుడు చుడి ఉలిగయ్యకు ఛాన్స్‌ ఉండవచ్చని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొనడం కొసమెరుపు. అయితే అధిష్ఠానం పరిశీలనకు వెళ్లిన ఐదుగురి పేర్లనే పరిశీలనలోకి తీసుకుంటారా..? కొత్తగా మరొకరు తెరపైకి వస్తారా..? అనే చర్చ కూడా జరుగుతోంది. 12న ప్రత్యేక జడ్పీ సమావేశం ఏర్పాటు చేసి జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.

గెలుపు ఆనందం ఆవిరై...

ఆలూరు-4 ఎంపీటీసీ ఆకస్మిక మృతి

ఆలూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలూరు-4 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున పోటీ చేసిన బోయ లక్ష్మి(50) ఆకస్మికంగా కన్నుమూశారు. శనివారం వెలువడిన ఫలితాల్లో అనంతరం అందరితో ఆనందాన్ని పంచుకున్న ఆమెకు ఇంటికి వెళ్లగానే ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. హైబీపీ రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో మండలంలోనే అత్యధికంగా 716 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. బోయ లక్ష్మి ఆకస్మిక మృతిపై ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, ఎంపీపీ అభ్యర్థి సాయిరాం, జడ్పీటీసీ కొమ్ము రామాంజనేయులు, టీడీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె కుమారుడు అంజిని ఓదార్చారు. బోయ లక్ష్మి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని వైకుంఠం జ్యోతి భరోసానిచ్చారు.

Updated Date - Nov 09 , 2026 | 11:40 PM