Share News

పల్లె పీఠాలపై పసుపు జెండా

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:17 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

పల్లె పీఠాలపై పసుపు జెండా

తొలి విడత 148 పంచాయతీల్లో ఎన్నికలు

13 సర్పంచ్‌ స్థానాలు, 501 వార్డు స్థానాలు ఏకగ్రీవం

135 సర్పంచ్‌, 1,005 వార్డు స్థానాలకు పోలింగ్‌

ఓటు హక్కు వినియోగించుకున్న 2.51 లక్షల ఓటర్లు

76.6 శాతం పోలింగ్‌ నమోదు

88 సర్పంచ్‌ స్థానాల్లో కూటమి మద్దతుదారుల విజయకేతనం

52 స్థానాల్లో వైసీపీ మద్దతుదారుల విజయం

కర్నూలు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నగర, పురపాలిక ఎన్నికల్లో క్లీన్‌స్వీ్‌ప చేసిన కూటమి.. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. గురువారం పల్లెనాడిని పట్టే గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లోనూ సత్తా చాటి పల్లె పీఠాలపై కూటమి జెండా ఎగురవేసింది. ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్లలో ఎనిమిది మండలాల్లో 148 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే.. 13 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, 135 సర్పంచ్‌, 1,005 వార్డులకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగింది. మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. మెజార్టీ స్థానాల్లో కూటమి మద్దతుదారులు విజయభేరి మోగించారు. పంచాయతీ పీఠాలపై స్పష్టమైన ఆధిక్యత సాధించారు. ఆదోని, ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు జైత్రయాత్ర సాగించారు. కూటమి 91 సర్పంచి స్థానాలు సొంతం చేసుకుంది. వైసీపీ మద్దతుదారులు 52 సర్పంచి పీఠాలు దక్కించుకున్నారు. జిల్లా ఎన్నికల ఆధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌లు పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సరళిని పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల ఆధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌లు పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సరళిని పర్యవేక్షించారు.

జిల్లాలో 484 గ్రామ పంచాయతీల్లో 484 సర్పంచ్‌ స్థానాలు, 5,100 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. అందులో భాగంగా తొలి విడత ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆదోని-1, ఆదోని-2, ఆలూరు, హోళగుంద, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి మండలాల్లో 148 గ్రామ పంచాయతీల్లో 148 సర్పంచ్‌ స్థానాలు, 1,520 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 13 సర్పంచ్‌, 501 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, 14 వార్డులకు నామినేషన్లు రాలేదు. గురువారం 135 సర్పంచ్‌ స్థానాలు, 1,005 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 3,27,791 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 1,303 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 4,748 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఆదోని మండలం మండిగిరిలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వర్గీయులు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సంఘటన మినహా తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్‌ సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పోలింగ్‌ను స్వయంగా పర్యవేక్షించారు.

2.51 లక్షల మంది ఓటేశారు

తొలి విడత ఎన్నికల జరిగిన మండలాల్లో 3,27,791 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా పకడ్బందీగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించు కోవడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 1,303 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో భారీ పోలీస్‌ బందోబస్తు, నిఘా ఉంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగానే ఓటర్లు బారులు దీరారు. ఆ తర్వాత పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోయాయి. పోలింగ్‌ ముగిసే చివరి రెండు గంటల్లో పోలింగ్‌ ఊపందుకుంది. ఉదయం 9గంటలకు 97,468 మంది ఓటర్లు (29.7 శాతం) ఓటు వేస్తే, 11గంటలకు 1,92,205 మంది ఓటర్లు (58.6 శాతం) ఓటు వేశారు. పోలింగ్‌ ముగిసిన ఒంటి గంటకు 2,51,077 మంది ఓటర్లు (76.6 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిషత్‌ ఎన్నికలతో పోలిస్తే.. పల్లెసీమల్లో పట్టుండే పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది.

తొలి విడత ఎన్నికల జరిగిన గ్రామ పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల హవా స్పష్టంగా కనబడింది. 13 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, 135 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 89, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి కలిపి కూటమి 91 సర్పంచ్‌ స్థానాల్లో జైత్రయాత్ర సాగించారు. వైసీపీ 52 పంచాయతీ సర్పంచ్‌లు, ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు. వారిలో ఇద్దరు టీడీపీ రెబల్స్‌ ఉన్నారు.

ఆలూరు నియోజకవర్గంలో 108 పంచాయతీలు ఉంటే, 12 సర్పంచ్‌ పీఠాలు ఏకగ్రీవమయ్యాయి. 96 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 64, బీజేపీ ఒకటి కలిపి కూటమి మద్దతుదారులు 65సర్పంచ్‌ పీఠాలు దక్కించుకుంది. వైసీపీ మద్దతుదా రులు 36 సర్పంచ్‌లు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. అయితే.. ప్రధానంగా పట్టు ఉండే నియోజకవర్గం, మండల కేంద్రాలుగా ఉండే మేజరు పంచాయతీలు ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, దేవనకొండ, చిప్పగిరి సర్పంచ్‌ స్థానాలు వైసీపీ దక్కించుకోవడం రాజకీయంగా చర్చగా మారింది.

ఆదోని నియోజకవర్గం పరిధిలో 40 పంచాయతీలు ఉన్నాయి. ఒక సర్పంచ్‌ పీఠం ఏకగ్రీవం కాగా, 39 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం సర్పంచ్‌ స్థానాల్లో టీడీపీ 22, జనసేన ఒకటి కలిపి కూటమి మద్దతుదారులు 23 సర్పంచ్‌ స్థానాలు దక్కించుకుంటే వైసీపీ మద్దతుదారులు 16 సర్పంచ్‌ స్థానాల్లో విజయం సాధించారు. కీలకమైన పెద్దతుంబళంలో స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు. మేజర్‌ పంచాయతీ మండిగిరి సర్పంచ్‌ పీఠం కోసం టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు మద్దతు ఇచ్చిన అభ్యర్థుల మధ్యే పోటీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కె.శ్రీదేవి గెలుపొందారు.

మండలాల వారీగా ఏకగ్రీవాలతో కలిపి

సర్పంచులుగా విజయం సాధించిన వివిధ పార్టీల మద్దతుదారలు

మండలం పంచాయతీలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ ఇతరులు

ఆదోని-1 21 11 -- -- 11 10 --

ఆదోని-2 19 11 1 -- 12 6 1

ఆలూరు 16 10 -- 1 11 5 --

చిప్పగిరి 13 8 -- -- 8 5 --

దేవనకొండ 26 13 -- -- 13 11 2

హాలహర్వి 15 11 -- -- 11 4 --

ఆస్పరి 21 12 -- -- 14 7 --

హొళగుంద 17 10 -- -- 11 4 2

మొత్తం 148 89 1 1 91 52 5

పంచాయతీల్లో మొత్తం ఓటర్లు, పోలైన ఓట్లు వివరాలు

మండలం పంచాయతీలు మొత్తం పోలైనవి శాతం

ఆదోని-1 21 40,519 30,673 75.7

ఆదోని-2 18 47,522 36,785 77.4

హోళగుంద 15 37,612 27,492 73.1

ఆలూరు 14 42,400 32,061 75.5

ఆస్పరి 20 50,625 39,502 77.7

చిప్పగిరి 13 24,955 19,902 79.8

దేవనకొండ 23 52,517 41,620 79.3

హాలహర్వి 11 31,441 23,042 73.3

మొత్తం 135 3,27,791 2,51,077 76.6

Updated Date - Nov 27 , 2026 | 12:17 AM