సీతారాముల కల్యాణ వైభోగం
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:41 PM
‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ అంటూ ఆధ్యాత్మిక, సంప్రదాయక స్ఫూర్తితో శుక్రవారం జిల్లాలోని రామాలయాలు విరాజిల్లాయి.
కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ
భక్తులతో కిక్కిరిసిన పుణ్యక్షేత్రాలు
కర్నూలు కల్చరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ అంటూ ఆధ్యాత్మిక, సంప్రదాయక స్ఫూర్తితో శుక్రవారం జిల్లాలోని రామాలయాలు విరాజిల్లాయి. శ్రీరామనవమి సందర్భంగా వీధి వీధినా సీతా రాముల కల్యాణ వేడుకలకు ఆబాలగోపాలంగా తరలి వచ్చారు. చలువ పందిళ్ల కింద కూర్చొని సీతమ్మతల్లి, రామచంద్రమూర్తుల కల్యాణ ఘట్టాన్ని ఆద్యంతం వీక్షించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఒకవైపు తీవ్ర గ్రీష్మతాపం ఉన్నా లెక్క చేయకుండా భక్తులు సీతారాముల కల్యాణ వేడుకలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలకు వేలాదిగా హాజరయ్యారు. భక్తిప్రపత్తులతో కల్యాణ రామునికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. జిల్లాలోని వివిధ పుణ్యక్షేత్రాల్లో, గృహాల్లో శ్రీరామనవమి వేడుకల సందడి బాగా కానవచ్చింది. వడపప్పు, పానకం నైవేద్యాలుగా సమర్పించుకున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.