బక్రీద్ పరమార్థం త్యాగమే
ABN , Publish Date - May 29 , 2026 | 12:12 AM
బక్రీద్ వేడుకలోని పరమార్థం త్యాగమేనని, ఈ సందేశాన్ని భావితరాలకు చాటి చెప్పాలని ముస్లిం మత పెద్దలు పిలుపు నిచ్చారు.
ప్రార్థనల్లో మత పెద్దల ఉద్బోధన
ఉమ్మడి జిల్లాలో ఘనంగా వేడుకలు
కర్నూలు కల్చరల్, మే 28 (ఆంధ్రజ్యోతి): బక్రీద్ వేడుకలోని పరమార్థం త్యాగమేనని, ఈ సందేశాన్ని భావితరాలకు చాటి చెప్పాలని ముస్లిం మత పెద్దలు పిలుపు నిచ్చారు. సమాజంలో పరస్పర సేవాగుణం, సహకార భావాలను అన్ని వేళలా అనుసరించాలని ఉద్బోధించారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదుల వద్ద మత పెద్దలు ఈద్ నమాజ్‌లు చేయించి, దైవ సందేశాన్ని అందించారు. బక్రీద్ వేడుక దైవం కోసం చేసిన త్యాగ గుణాన్ని తెలియజేస్తుందని, చిత్తశుద్ధితో జీవించినప్పుడే త్యాగానికి సార్థకత చేకూరుతుందని చెప్పారు. త్యాగమయమైన జీవితం అత్యుత్తమ విలువలతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరూ అంతర్గతంగా, బాహ్యంగానూ ఈ విలువలను పాటించాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ శాంతియుతంగా జీవించాలని బోధించారు. మానవాళి దైవం బోధించిన మార్గంలో పయనించి శాంతి, సౌభ్రాతృత్వాలతో జీవించాలని చెప్పారు. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఈద్ నమాజ్‌ల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబాకర్’ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈద్గాలు, మసీదుల బయట కలిసిన ఇతర మతాలకు చెందిన మిత్రులకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
వేకువజాము నుంచే సందడి
బక్రీద్ వేడుకల సందడి గురువారం ఉదయం నుంచి కనిపించింది. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ముస్లింలు ఉదయాన్నే ఈద్గాలకు తరలి వెళ్లారు. కర్నూలు నగరంలో నాలుగు ఈద్గాలు, వందకు పైగా మసీదుల్లో ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. కొత్త బస్టాండు సమీపంలోని పాత ఈద్గాలో ప్రభుత్వ ఖ్వాజీ సయ్యద్ సలీం బాషా, సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలో ముఫ్తీ మన్సూర్ ఖ్వాస్మి, గడ్డ వీధిలో రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ హాఫిజ్ మంజూర్ అహ్మద్, జోహరాపురం ఈద్గాలో హాఫిజ్ అతీక్ ఉమ్రి ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పాత ఈద్గాలో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.