Share News

తెగ తాగేశారు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:32 PM

జిల్లాలో డిసెంబర్‌ 31న ఒక్క రోజే రూ. 12.50 కోట్ల మద్యం తాగారు.

తెగ తాగేశారు

ఒక్క రోజే రూ. 12.50 కోట్ల వ్యాపారం

మద్యం దుకాణాలు, బార్లు కిటకిట..

మద్యం మత్తులో ప్రవేశించిన నూతన సంవత్సరం

విందులు, వినోదాలతో చిందులు

బైక్‌ శబ్దాలు, బాణసంచా పేలుస్తూ సంబరాలు

కర్నూలు అర్బన్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో డిసెంబర్‌ 31న ఒక్క రోజే రూ. 12.50 కోట్ల మద్యం తాగారు. బుధవారం నూతన సంవత్సర వేడుకల కోసం మద్యం అమ్మకాలను అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు, బార్లకు ఒంటి గంట వరకు బార్లలను తె రిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంతో తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లే మందు బాబులు జిల్లాలోని మద్యం షాపులు, బార్లను ఆశ్రయించారు. ఫలితంగా మద్యం వ్యాపారులు మందు బాబులకు అవసరమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. నూతన సంవత్సర వేడుకలు దూమ్‌దామ్‌గా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి వరకు మద్యం ఏరులై పారింది. నూతన సంవత్సరం వేడుకలను యువత, ఉద్యోగులు, వ్యాపారులు, బడాబాబులు భారీ ఎత్తున విందు వినోదాలతో జరుపుకున్నారు. ఈ వేడుకల కోసం మధ్యాహ్నం నుంచే మద్యం దుకాణాల వద్ద క్యూలో నిలబడి మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తూ కనిపించారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది భారీగా మద్యం అమ్మకాలు జరిపినట్లు ఎక్సైజ్‌ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వం యువత ప్రాణాలతో చెలగాటం ఆడే తీరులో మద్యం దుకాణాల నిర్వహణపై విమర్శలున్నాయి.

అమ్మకాలతో దుకాణాలు.. కిటకిట..

జిల్లాలో 109 దుకాణాలు, 21 బార్ల ద్వారా రూ. 12.50 కోట్ల మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్‌ అఽధికారులు తెలిపారు. ఐఎంఎల్‌ డిపో నుంచి దుకాణాలు, బార్ల లైసెన్స్‌దారులు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా రూ. 16 కోట్ల మద్యం నిల్వలను తరలించారు. లైసెన్స్‌దారులకు ఈ ఏడాదీ మద్యం దుకాణాల వద్దే పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు మంజూరు చేయడంతో మద్యం దుకాణాలు బార్లను తలపించాయి. మద్యం దుకాణాల చుట్టు మాంసం, చేపలు తదితర తినుబండారాలను ముందస్తుగా స్టాల్స్‌ మందు బాబుల కోసం ఏర్పాటు చేసి ఉంచారు. వీటి ద్వారా కూడా ఎందరో వ్యాపారులు నూతన సంవత్సరం పురస్కరించుకుని వణికించే చలిని సైతం లెక్క చేయకుండా వ్యాపారాలు చేసుకుంటూ కనిపించారు.

మందుబాబుల హల్‌చల్‌.. చిందులేసి యువత..

జిల్లాలోని నగరం, ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కర్నూలు నగరంలో మందుబాబులు తప్పతాగి చిందులేశారు. రోడ్లపై బైక్‌లతో చక్కర్లు కొట్టారు. బైక్‌ల సైలెన్సర్లను తొలగించి రైజ్‌ చేస్తూ భారీ శబ్దాలతో ఈలలు, కేకలు వేస్తూ కనిపించారు. అర్ధరాత్రి రాజవిహర్‌ కూడలి, నంద్యాల చెక్‌పోస్టు, సీ. క్యాంప్‌ సెంటరు, వెంకటరమణ కాలనీ, చౌరస్తా, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో యువత బాణ సంచా పేలుస్తూ వేడుకలు నిర్వహించుకున్నారు. రోడ్డులో యువత చిందులేస్తూ, బైక్‌లపై విన్యాసాలు చేస్తూ కేరింతలు కోడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పోలీసుల అంక్షాలు అమలులో ఉన్నప్పటికి యువత మద్యం మత్తులో చిందులేసింది. పార్టీలు, విందులు, వినోదాలతో అర్దారాత్రి 12 గంటలకు నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించుకున్నారు. కేక్‌లు కట్‌చేసి ఒకరికి నోకరు తినిపించుకుంటూ కనిపించారు.

Updated Date - Jan 01 , 2026 | 11:32 PM