పులకరించిన తుంగాతీరం
ABN , Publish Date - May 25 , 2026 | 12:26 AM
తుంగాతీరాన కొలువై ఉన్న ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి శ్రీమఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది.
లక్షలాది మంది భక్తులతో మార్మోగిన మంత్రాలయం
దర్శనానికి ఆరు గంటల సమయం
మంత్రాలయం, మే 24(ఆంధ్రజ్యోతి): తుంగాతీరాన కొలువై ఉన్న ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి శ్రీమఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో క్షేత్ర వీధులన్నీ రద్దీగా కనిపించాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహా రాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అశేష భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇసుకేస్తే రాలనంత భక్తులతో మంత్రాలయం పురవీధులు భక్తసాగరంలా నిండిపోయాయి. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్,తుంగభద్ర, వేదపాఠశాల కారిడార్లు, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సీఐ దస్తగిరిబాబు, ఎ్‌సఐ మల్లికార్జున, పోలీసులు, శ్రీమఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో శ్రీమఠం మధ్వమార్గ్ ప్రాంగణంలో క్యూలైన్లు అదనంగా ఏర్పాటు చేశారు. ప్రసాదాల కొరత రాకుండా మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతిఆచార్, ఐపీ నరసింహామూర్తి, అనంతపురాణిక్ తదితరులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి ఆరుగంటల సమయం పట్టింది. ఊహించని రీతిలో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ అస్తవ్యస్థంగా మారింది.