Share News

మంత్ర ముగ్గులై..!

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:32 AM

ఆకాశంలోని ఇంద్రధనుస్సులన్నీ భువిపై విరిసినట్లు... నింగిలోని చుక్కలన్నీ పుడమిని ముద్దాడినట్లు...

మంత్ర ముగ్గులై..!

అట్టహాసంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

భారీగా తరలివచ్చిన మహిళా లోకం

కర్నూలు, ఆదోనిలో స్ఫూర్తిదాయకంగా సాగిన పోటీలు

ఆకాశంలోని ఇంద్రధనుస్సులన్నీ భువిపై విరిసినట్లు... నింగిలోని చుక్కలన్నీ పుడమిని ముద్దాడినట్లు... విభిన్న వర్ణాలు, వినూత్న రూపాలుగా మారి... వేవేల శోభిత కాంతు ల్లో మెరిసిపోయాయి. మహిళల మునివేళ్ల మధ్య జారువాలిన ముగ్గుపిండి...ధవళ కాంతుల మెరుపుల్లో రంగవల్లికలుగా ఆవిష్కృతమయ్యాయి. చుక్కను చుక్కను కలుపుకుంటూ మహిళలు సృజనాత్మక భావాలతో తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గులన్నీ సప్తవర్ణ శోభితంగా ఒదిగిపోయాయి. వారిలోని కళాత్మక భావాలకు ముగ్గుల పోటీలు వేదికగా నిలిచాయి.

కర్నూలు కల్చరల్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహించిన సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై: సన్‌ ఫీస్ట్‌ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్ట్‌నర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌వాసి అగరబత్తీ సహకారంతో కర్నూలు నగరంలోని మాంటిస్సోరి పాఠశాల, ఆదోని పట్టణంలోని మిల్టన్‌ గ్రామర్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ మైదానంలో పోటీలు జరిగాయి. కర్నూలులో జరిగిన పోటీలకు స్థానిక స్పాన్సరర్స్‌గా టీజీవీ గ్రూప్‌ జూనియర్‌ చైర్మన్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ సౌజన్యం, మాంటిస్సోరి విద్యాసంస్థల సహకారంతో ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల క్రీడామైదానంలో పోటీలులు జరిగాయి. అలాగే ఆదోనిలో మిల్టన్‌ గ్రామర్‌ ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌, నారాయణ గుంత, రెడ్డీస్‌ హాస్టల్‌ పక్కన ఏర్పాటు చేసిన ఈ పోటీలకు స్థానిక స్పాన్సరర్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త బత్తిన లక్ష్మీనారాయణ సహకారం అందించారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. భారీ సంఖ్యలో మహిళాలోకం తరలివచ్చారు. కర్నూలులో నిర్వహించిన పోటీలకు 275 మంది, ఆదోనిలో 96 మంది మహిళలు హాజరయ్యారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజేతలకు కర్నూలులో టీజీవీ గ్రూప్‌ అఫ్‌ కంపెనీస్‌ జూనియర్‌ చైర్మన్‌ టీజీ భరత్‌ రూ.6000, రూ.4000, రూ.3000 నగదు బహుమతులు అందించారు. అలాగే పదిమందికి ప్రశంసాత్మక బహుమతులు అందజేశారు.

కర్నూలులో జరిగిన పోటీలను ముగ్గులను మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్‌ పరిశీలించారు. న్యాయ నిర్ణేతలుగా జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల డీన్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.దేవకీదేవి, తరిగొండ వెంగమాంబ ఆధ్మాత్మిక సేవా సంస్థ అధ్యక్షురాలు, ఉపాధ్యాయురాలు పసుపులేటి నీలిమ వ్యవహరించారు. ఈ ముగ్గుల పోటీల్లో కర్నూలు ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ ఆకుల లక్ష్మణ్‌, ఎడిషన్‌ ఇన్‌చార్జి చల్లా నవీన్‌ కుమార్‌ చౌదరి, బ్యూరో ఇన్‌చార్జి గోరంట్ల కొండప్ప, ఏబీఎన్‌ ఇన్‌చార్జి సుంకన్న, వక్ఫ్‌బోర్డు సభ్యుడు మన్సూర్‌ అలీఖాన్‌, కార్పొరేటర్‌ కురువ పరమేశ్‌, స్వస్థిక్‌ సంస్థ ప్రతినిధులు శ్రీరామ్‌, ఆచారి పాల్గొన్నారు.

కర్నూలులో విజేతలు వీరే...

కర్నూలులో జరిగిన ముగ్గుల పోటీల్లో వసంత అనే మహిళ ప్రథమస్థానంలో నిలిచి రూ.6వేలు నగదు ప్రోత్సాహకం, బహుమతులను అందుకున్నారు. ఆలూరు దాక్షాయణి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.4వేలు, ఎం.రేణుక తృతీయస్థానంలో నిలిచి రూ.3వేలు నగదు ప్రోత్సాహకం, బహుమతులను అందుకున్నారు..

మహిళల్లో సృజనాత్మకతకు మంచి వేదిక

మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, టీజీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ జూనియర్‌ చైర్మన్‌ టీజీ భరత్‌ అన్నారు. హిందూ సంస్కృతిలో సంక్రాంతి విశిష్టమైన పండుగని, ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో సృజనాత్మకత దాగి ఉంటుందని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’వారు ప్రతి ఏటా ముగ్గులపోటీలు విజయవంతంగా నిర్వహిస్తూ మహిళలల్లో సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తి కలిగేలా కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. తెలుగువారు ఎక్కడున్నా సంస్కృతికి, సంప్రదాయాలకు పట్టం కడతారని, ఆ స్ఫూర్తిని ఈ పోటీల్లోనూ మహిళలు చాటుకున్నారని ప్రశంసించారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ సంస్థతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే దాని వెనుక ఎంతో కృషి, శ్రమ ఉంటుందని, ఈ ముగ్గుల పోటీల నిర్వహణ వెనుక ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సంస్థ వారు చేసిన కృషి స్పష్టంగా వ్యక్తమవుతోందని నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రజల పక్షాన ఉంటూ నిత్యం వారి పురోభివృద్ధికి, కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు.

- రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, టీజీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ జూనియర్‌ చైర్మన్‌ టీజీ భరత్‌

ఆదోనిలో అంబరాన్నంటిన ముగ్గుల పోటీలు

ఆదోని, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుగా... హరివిల్లు నేలపై విరిసినట్టుగా అక్కడ ముగ్గులు పూశాయి. మహిళల ప్రతిభకు అద్దం పట్టాయి. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహించిన సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై: సన్‌ ఫీస్ట్‌ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్ట్‌నర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌వాసి అగరబత్తీ సహకారంతో ఆదోని పట్టణంలోని మిల్టన్‌ గ్రామర్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ మైదానంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలకు స్థానిక స్పాన్సర్లుగా బత్తిన లక్ష్మీనారాయణ, బత్తిన హనుమంతమ్మ, ఆమె కుమార్తె పూజారి శ్రావణి వ్యవహరించారు. ఈ పోటీల్లో 96 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదోని టూటౌన్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి సంస్కృతి సంప్రదాయాలను ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కాపాడుతోందన్నారు. పండగ విశిష్టతతో పాటు సంస్కృతిపై మహిళలకు ఉన్న గౌరవాన్ని ప్రోత్సహించేలా పోటీలు ఉన్నాయన్నారు. ఇటువంటి పోటీలకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఎన్‌డీబీఎల్‌ పత్తి పరిశ్రమ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త బత్తిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మైదానంలో వేసిన ముగ్గులను చూస్తుంటే సంక్రాంతి పండగ ఉట్టి పడిందన్నారు. ఇటువంటి పోటీలను పండగ సమయంలో నిర్వహించడం వల్ల యువతులు, మహిళల్లోనూ ఉత్సాహం కనిపిస్తోందన్నారు.

ఆదోనిలో విజేతలు వీరే...

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముగ్గుల పోటీలో ఎస్‌.శృతికి ప్రథమ స్థానం సాధించారు. ఆమెకు రూ.6 వేల నగదు బహుమతిని అందజేశారు. ద్వితీయ బహుమతిగా జి.శశికళ రూ.4 వేలు నగదును అందుకున్నారు. తృతీయ బహుమతి సి.లక్ష్మీ గెలుచుకున్నారు. ఆమె రూ.3 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 12:32 AM