బంద్ విజయవంతం
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:33 PM
ఆదోని జిల్లా సాధన జేఏసీ పిలుపుతో ఐదు నియోజకవర్గాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది.
ఐదు నియోజకవర్గాలో బంద్ సంపూర్ణం
రహదారులపై ఆందోళన
స్వచ్ఛందంగా దుకాణాల బంద్
మంత్రాలయం, ఆలూరులో పాల్గొన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, విరూపాక్షి
జనసేన, బీజేపీ నేతల మద్దతు
ఎక్కడా పాల్గొనని టీడీపీ
ఆదోని అగ్రికల్చర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లా సాధన జేఏసీ పిలుపుతో ఐదు నియోజకవర్గాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆదోనితో పాటు ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ పట్టణాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉదయం 5గంటలకు జేఏసీ నాయకులతో పాటు బీజేపీ జనసేన, వైసీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆర్‌టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించారు. కర్నూలు, అనంతపురం, సిరుగుప్ప, బళ్లారి, రాయచూరు వంటి నలు దిక్కుల నుంచి వాహన రాకపోకలు నిలిచిపో యాయి. ముందుగానే జేఏసీ ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాలు శనివారం బంద్ అంటూ ప్రకటించడంతో కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. ఆర్‌టీసీ బస్టాండ్, ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మంత్రాలయం పట్టణంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించి మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలూరులో ఎమ్మెల్యే విరూపాక్షి నిరసనలో పాల్గొని మద్దతు ఇచ్చారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో జనసే, బీజేపీ నాయకులు ఆందోళనలో పాల్గొనగా.. టీడీపీ నాయకులు ఎక్కడా కూడా నిరసనలు వ్యక్తం చేయలేదు. ఆదోని పట్టణంలో ఉదయం 10 గంటలకు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ డిపో నుంచి బస్సులను బయటికి రప్పించేందుకు ప్రయత్నించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వీరేష్, సృజనమ్మ, రామలింగ, విద్యార్థి సంఘ నాయకులు షాబీర్‌బాష, తిరుమలేష్, రమేష్, దస్తగిరి బీజేపీ నాయకులు ఉపేంద్ర, చంద్ర, వైసీపీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, దేవా కౌన్సిలర్లు ఫయాజ్, రఘునాథరెడ్డి, అశోక్, జనసేన నాయకులు రేణువర్మ, పులిరాజు తోపాటు జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. కొంతమందిని పోలీసు జీపులో పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. వాగ్వాదాల మఽధ్య సీపీఐ పట్టణ కార్యదర్శి వీరేష్ స్పృహ తప్పిపడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఉద్యమకారులంతా అడ్డుకొని జీపు కదలకుండా రోడ్డుపై అడ్డుకున్నారు. జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య అశోక్ నంది రెడ్డి, లలిత, కృష్ణమూర్తి గౌడ్ కోదండ, దస్తగిరి విద్యార్థి సంఘ నాయకులు పురవీధులలో ర్యాలీ చేపట్టారు.