నిలిచిపోయిన ఎల్లెల్సీ
ABN , Publish Date - May 06 , 2026 | 11:45 PM
మనరాష్ట్రం వాటా కింద ఇండెంట్ పూర్తి కావడంతో తుంగభద్ర దిగువ కాలువ నీటి విడుదలను డ్యామ్ అధికారులు బుధవారం నిలిపివేశారు.
నీటిలో మన ఇండెంట్ కంప్లీట్
ఐదురోజుల పాటు ఇండెంట్ పెంచి నిలిపివేసిన అధికారులు
గోనెగండ్ల, మే 6(ఆంధ్రజ్యోతి): మనరాష్ట్రం వాటా కింద ఇండెంట్ పూర్తి కావడంతో తుంగభద్ర దిగువ కాలువ నీటి విడుదలను డ్యామ్ అధికారులు బుధవారం నిలిపివేశారు. ప్రస్తుతం దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్‌కు బుధవారం ఉదయం కేవలం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరింది. అయితే సాయంత్రానికి నీటి విడుదల నిలిపో నున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ఏడాది ఎల్లెల్సీ కింద తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు ఇరిగేషన్ అఽధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే నెల చివరి వరకు నీటి విడుదల సాగింది. అయితే నాయకుల, గ్రామ ప్రజల వినతి మేరకు (మే నెల 5వ తేది వరకు) మరో ఐదు రోజులు అదనంగా నీటి విడుదలను పెంచారు. దీంతో దిగువ ప్రాంత గ్రామాలకు వేసవిలో తాగునీటి సమస్య చాలా వరకు తీరింది. చాల గ్రామాలలో చెరువులు, కుంటలు, ఎస్‌ఎస్ ట్యాంకులను ఆయా గ్రామాల పంచాయతీ అధికారులు ఎల్లెల్సీ నీటితో నింపుకున్నారు. ఇక బుధవారం నీటి విడుదల పూర్తిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం విడుదల అవుతున్న 10 క్యూసెక్కుల నీరు గోనెగండ్ల కోడుమూరు, కాలువ వెంట వెళుతూ భూమిలో ఇంకిపోతూ బావులు, బోర్లకు ఎంతో ఉపయోగపడుతోంది. మొదట్లో 30 రోజులు నీరు విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే ఎండలు తీవ్రంగా ఉండటంతో దిగువ ప్రాంతాలలో తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు ఎల్లెల్సీ అధికారులు మే 5 వ తేది వరకు నీటి విడుదలను పెంచారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల లోని ఎస్‌ఎస్ ట్యాంక్‌లు చెరువులు, నీటి కుంటలను అధికారులు నింపేశారు. గోనెగండ్ల మండలంలోని పలుగ్రామాలలో ఉన్న కుంటలు, చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను ఎల్లెల్సీ నీటితో ఇరిగేషన్ అధికా రులు నింపారు. మండలంలోని పలు కుంటలు, చెరువులు ఎల్లెల్సీ నీటితో కళకళలాడుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు మే నెల 5వ తేది వరకు నీరు విడుదల చేయడం పట్ల దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.