కుంగిపోయిన జీడీపీ మట్టి కట్ట
ABN , Publish Date - May 14 , 2026 | 11:12 PM
గత ఏడాది కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టులో కొత్తగా నిర్మించిన మట్ట కట్ట కోతకు గురై కుంగిపోతుంది.
ఏడాదైనా పట్టించుకోని అధికారులు
వర్షాకాలం వస్తే మరింత ప్రమాదం
కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చిన జీడీపీ అధికారులు
గోనెగండ్ల, మే 14(ఆంధ్రజ్యోతి): గత ఏడాది కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టులో కొత్తగా నిర్మించిన మట్ట కట్ట కోతకు గురై కుంగిపోతుంది. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా ఇంత కాలం మరమ్మతు చేయలేదు. రుతువులు మారి అధిక వర్షాలు కురిస్తే కట్ట మరింత కోతకు గురై ప్రమాదకరంగా మారుతుంది. గత ఆరు నెలల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మట్టి కట్ట పక్కనే ఉన్న క్రస్ట్‌గేట్ల దగ్గర నీళ్లలోజారి మృతి చెందారు. అలాగే గత కొన్ని రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు మట్టి కట్ట ఎక్కుతూ జారి కింద పడ్డారు. ఇలా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అఽధికారులు, కాంట్రాక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్మించిన మట్టి కట్ట నాణ్యతపై ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వర్షానికి ప్రాజ్టెకు మొదలు నుంచి పిల్లిగుండ్ల సమీపం వరకు మట్టి కట్ట పగుళ్లు రావడమే గాక కోతకు గురైంది. వర్షానికి అనేక చోట్ల మట్టి కోతకు గురైంది. దీంతో నాణ్యతా ప్రమాణాలు ప్రశ్నార్ధకంగా మారాయి. ప్రాజెక్టుకు వరద ఎక్కువగా వస్తే గేట్లు ఎత్తేందుకు కూడా అవకాశం లేదు. ఆరు గేట్లులో నాలుగు గేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. కట్ట నిర్మాణంలో గ్రౌండ్ లెవెల్‌లో 8 నుంచి 18 మీటర్లు, టాప్ లెవెల్‌లో 6 మీటర్ల వె డల్పు 4.313 కిమీ పొడువున మట్టి కట్ట నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కోతకు గురైన ప్రాంతంలో మరోసారి నాణ్యతతో కూడిన పనులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఎత్తు పెంచడంలో జరుగుతున్న పనులలో కమీషన్ల కోసం గతంలో వైసీపీ నాయకులు, అధికారులు చేయి చాచడం వల్ల ఇలాంటి నాణ్యత లేని పనులు జరిగాయనే ఆరోపణలున్నాయి. చాలా చోట్ల మట్టి కట్ట కోతకు గురైంది. ఇప్పటికై జీడీపీ ఇరిగేషన్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని పగుళ్లు బారిన చోట నూతనంగా పనులు చేయించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం
మట్టి కట్ట కోతకు గురికావడంతో పనులు చేసిన కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. ప్రాజెక్టు మట్టి కట్టకు లూజ్ మట్టిని వేయడం, సరైన పద్ధతిలో రోల్ చేయక పోవడం వల్ల వర్షం నీటి కోతకు గరై కట్ట బీటలువారింది. కాంట్రాక్టర్‌తో మాట్లాడి లూజ్ మట్టిని అంతా తీయించి కొత్తగా మట్టిని వేసి రోలర్‌లో గట్టి పడేవరకు మట్టి కట్టపై తిప్పి పనులు నాఽణ్యంగా చేయిస్తాం
-మహుమ్మద్ ఆలీ, జీడీపీ ఏఈ