స్కాన్.. పరేషాన్..!
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:50 PM
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని ప్రవేశపెట్టాయి.
ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్
బియ్యం పంపిణీలో స్కానింగ్ తప్పనిసరి
నూతన విధానంతో మందకొడిగా సరఫరా
రేషన్ డీలర్లకు కొరవడిన అవగాహన
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. రేషన్ బియ్యం రవాణా, పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్‌ను ప్రభుత్వం ముద్రించింది. దీన్ని రెండుసార్లు స్కాన్ చేయడం ద్వారా ఏ బస్తా ఏ రేషన్ దుకాణానికి చేరింది?, లబ్థిదారులకు పంపిణీ చేశారా? లేదా? అనే విషయాలు స్పష్టమవుతాయి. ఈ నూతన విధానంపై డీలర్లకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో వారికి అవగాహన కొరవడింది. సరైన ప్రణాళిక, శిక్షణ లేకుండానే కొత్త విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంతో పని భారం పెరగడంతోపాటు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ మందకొడిగా సాగుతోంది.
-శిరివెళ్ల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి)
21 వేల మెట్రిక్ టన్నుల బియ్యం
నంద్యాల జిల్లాలోని 1,204 రేషన్ దుకాణాల పరిధిలో 5,49,122 రేషన్ కార్డులున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలోని 1,233 రేషన్ దుకాణాల పరిధిలో 6,97,474 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 17 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి మొత్తం 2,437 రేషన్ దుకాణాలకు ప్రతి నెల దాదాపు 21 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి మద్ధతు ధరకు ధాన్యాన్ని సేకరించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కింద రైస్ మిల్లులకు పంపుతుంది. అక్కడ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలతో ప్యాక్ చేసి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోదాములకు చేరుస్తారు. అక్కడి నుంచి మండలస్థాయి గోదాములకు(ఎంఎల్‌ఎస్).. తర్వాత రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తారు. డీలర్లు స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక యాప్ ద్వారా బియ్యం బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. దీంతో ధాన్యం వివరాలు వెల్లడవుతాయి. ధాన్యం ఏ సీజన్‌లో కొనుగోలు చేశారు.. ఏ మిల్లు నుంచి సీఎంఆర్‌కు వచ్చిందనే వివరాలు తెలుస్తాయి. అనంతరం బియ్యం బస్తాలకు ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఈ-పోస్ యంత్రం ద్వారా స్కాన్ చేసి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది.
డీలర్లకు శిక్షణ ఏదీ?
రేషన్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేసి బియ్యం పంపిణీ చేసే విధానంపై డీలర్లకు పౌరసరఫరాల శాఖ అధికారులు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్మార్ట్ ఫోన్‌లోని యాప్‌లో బియ్యం బస్తాలను స్కాన్ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండడంపై చాలా మంది డీలర్లకు అవగాహన కరువైంది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఈ-పోస్ యంత్రాల్లో సర్వర్ సమస్యలు, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ఇబ్బందులు తలెత్తడంతో కార్డుదారులకు బియ్యం పంపిణీ మందకొడిగా సాగింది. రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత నెలలో ఈ విధానం అమలుకు తాత్కాలిక బ్రేకులు వేశారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, డీలర్ల ఆందోళనను పట్టించుకోకుండానే అక్టోబరు నెలకుగాను అన్ని రేషన్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను తప్పనినిసరిగా అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం, పౌరసరఫరాలశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మండలస్థాయి గోదాములే కీలకం
ప్రజాపంపిణీ వ్యవస్థలో మండలస్థాయి గోదాములే (ఎంఎల్‌ఎస్) కీలకం. ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యం బస్తాలను ఇక్కడే నిల్వ చేస్తారు. ప్రస్తుతం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లలోనే అమలు చేయాలని డీలర్లు పట్టుబడుతున్నారు. దుకాణానికి వచ్చే బస్తాలను ఒక్కొక్కటిగా ఫోన్‌లోని యాప్‌లో స్కాన్ చేసేందుకు అధిక సమయం పడుతున్నందున జాప్యాన్ని నివారించేందుకు, డీలర్లకు పనిభారం తగ్గించేందుకు ఎంఎల్‌ఎస్ గోదాముల వద్దనే స్కాన్ చేసి రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలన్న డిమాండ్లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్‌లోనే ప్రతి బస్తా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ బస్తా తూకాన్ని సైతం పరిగణలోకి తీసుకుని రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేయడం ద్వారా డీలర్లకు వచ్చే కేటాయింపుల్లో తేడాలు లేకుండా ఉంటాయని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజాపపంపిణీ మరింత సవ్యంగా సాగే అవకాశం ఉంది.
అక్రమాలకు అడ్డుకట్ట సాధ్యమేనా?
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కొదువేలేదు. పేదల బియ్యం యథేచ్ఛగా పక్కదారి పట్టడం, తూకాల్లో మోసం సర్వసాధారణంగా మారింది. రేషన్ బియ్యం గ్రామం నుంచి ఎళ్లలు దాటి ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిపోయేస్థాయికి చేరిందన్న విమర్శలు అడుగడుగునా వినిపిస్తున్నాయి. బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా పక్కదారికి మళ్లించడం, తూకాల్లో తేడాను నిలువరించేందుకు నూతనంగా ఈ క్యూర్ కోడ్ స్కాన్ విధానాన్ని తీసుకొచ్చారు. గతంలో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు కేటాయించిన బియ్యానికి, సరఫరా చేసిన బియ్యానికి ప్రతి డీలర్‌కు కొంతమేర వ్యత్యాసం ఉండేది. ప్రభుత్వం, పౌరసరఫరాశాఖ అధికారులు ఎన్ని నూతన విధానాలు తెచ్చినా క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
పెరిగిన పనిభారం.. పెరగని కమీషన్!
ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెడు తూనే వస్తోంది. తద్వారా డీలర్లకు పని భారం పెరుగుతున్నప్పటికీ.. వారికి ఇచ్చే కమీషన్ మాత్రం పెరగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారంభం నుంచి చూస్తే మొదట కిలో బియ్యా నికి 30 పైసలు, 40 పైసలు ఉన్న కమీషన్‌ను 70 పైసలకు, ఆ తర్వాత రూ.1కి పెంచారు. దక్షిణాది రాష్ట్రాలతో పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ డీలర్లకు మాత్రమే ప్రభుత్వం అత్యల్ప కమీషన్ అందుతోంది. రోజురోజు కూ పెరుగుతున్న ఖర్చులు, దుకాణాల బాడుగలను దృష్టిలో ఉంచుకుని కమీషన్‌ను రూ.3కు పెంచాలని డీలర్లు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్లలోనే స్కాన్ చేయాలి
రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాలకు ఉన్న క్యూఆర్ కోడ్‌లను ఎంఎల్‌ఎస్ పాయింట్లలోనే స్కాన్ చేసి పంపాలి. దుకాణాల వద్ద స్కాన్ చేసేందుకు గంటలకొద్దీ సమయం పడుతోంది. కార్డుదారులకు బియ్యం పంపిణీ సమయంలోనూ సమయం వృథా అవుతోంది. డీలర్లకు ప్రస్తుతం ఇస్తున్న కమీషన్ ఏమాత్రం సరిపోవడం లేదు.
- కరీముల్లా, డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల
పారదర్శకంగా పంపిణీ
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకత కోసమే క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంపై డీలర్లకు అవగాహన కల్పించాం. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి కొత్త విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తాం.
- రవిబాబు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, నంద్యాల