Share News

మహనీయుల త్యాగాలే స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:31 PM

దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అన్నారు.

మహనీయుల త్యాగాలే స్ఫూర్తిదాయకం

దేశభక్తితో రాష్ట్ర ప్రగతికి కృషి

అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి

ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

కర్నూలు కల్చరల్‌/ కర్నూలు న్యూసిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అన్నారు. కర్నూలు నగరంలో 77వ భారత గణతంత్ర వేడుకలు సోమవారం కన్నుల పండువగా సాగాయి. జిల్లా పోలీసు కవాతు మైదానంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, ఇన్‌చార్జి డీఆర్వో, హౌసింగ్‌ పీడీ చిరంజీవి పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ ఎ.సిరి పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురువేసి పతాక వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత పోలీసు సాయుధ దళాలను పరిశీలించారు. అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులను కలిసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మన దేశానికి నిజమైన పండుగ అని చెప్పారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్లు పూర్తయి, 77వ ఏడాదిలోకి అడుగిడుతున్న సందర్భంగా దేశమంతా ఈ వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నామని చెప్పారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేశారు. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్‌గా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, పలువురు కమిటీ సభ్యులు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. కర్నూలు జిల్లా వాస్తవ్యులు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ నాగప్ప కూడా రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కావడం జిల్లాకు గర్వకారణమని చెప్పారు. మహనీయుల త్యాగ స్ఫూర్తితో, వారి దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనిస్తూ ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషిచేద్దామని కోరారు. దేశభక్తి స్ఫూర్తితో ప్రజా సేవకు, రాష్ట్ర ప్రగతితోపాటూ, జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు సమష్టి కృషి చేద్దామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని కలెక్టర్‌ వివరించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

గణతంత్ర వేడుకల్లో చిన్నారుల నృత్య ప్రదర్శనలు దేశ భక్తిని ప్రతిబించాయి. విద్యానగర్‌ మాంటిస్సోరి విద్యార్థులు ప్రదర్శించిన ‘వందేమాతర గీతం’ నృత్య రూపకంలో సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బి.క్యాంపు ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు ఇది మన భారత దేశం అనే గీతంపై నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అథీనా పాఠశాల విద్యార్థులు ‘వందేమాతర గీతం’పై భిన్నత్వంలో ఏకత్వ భావనలు పెంపొందించేలా నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. చివరగా కృష్ణగిరి కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులు జానపద నృత్య రూపకం ‘రంగీలా రే’ అంటూ గిరిజన లంబాడీల వేషధారణలతో అలరిచారు. కరాటే స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన యుద్ధ క్రీడా విన్యాసాలు ప్రత్యేకంగా నిలిచాయి. వీరికి కలెక్టర్‌, ఎస్పీ, జేసీలు ప్రశంసాపత్రాలను అందజేశారు. నృత్య ప్రదర్శనల్లో ప్రథమ బహుమతి మాంటిస్సోరి విద్యార్థులు గెలుపొందగా, ద్వితీయ బహుమతిని కేజీబీవీ కృష్ణగిరి విద్యార్థులు, తృతీయ బహుమతిని అథీనా పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు.

ఆకట్టుకున్న శకటాలు

జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, శకటాలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ శకటానికి ప్రఽథమ బహుమతి రాగా, దేవదాయ శాఖ శకటానికి ద్వితీయ, జిల్లా విద్యాశాఖ అధికారి, సర్వశిక్ష అభియాన్‌-నగర పాలక సంస్థ శకటాలకు తృతీయ బహుమతి దక్కించింది. అదేవిధంగా ఐసీడీఎస్‌ శాఖకు మొదటి బహుమతి, ఉద్యాన శాఖకు రెండు, సమగ్ర శిక్ష, విద్యాశాఖ, ఏపీ సూక్ష్మ నీటి సాగు పథకం శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌కు మూడో బహుమతి దక్కింది.

Updated Date - Jan 26 , 2026 | 11:31 PM