Share News

నామినేషన్ల జోరు

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:03 PM

పరిషత్‌ పోరులో భాగంగా గురువారం జడ్పీ టీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.

నామినేషన్ల జోరు
ఎస్పీ సునీల్‌ షెరాన్‌కు పరిస్థితులు వివరిస్తున్న ఏఎస్పీ సుస్మిత

జడ్పీటీసీ స్థానాలకు 85, ఎంపీటీసీలకు 744 నామినేషన్లు

కొన్ని చోట ఘర్షణలు

నేటితో ముగియనున్న గడువు

నంద్యాల/నంద్యాల హాస్పిటల్‌ ఆక్టోబరు22 (ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పోరులో భాగంగా గురువారం జడ్పీ టీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఆయా స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు సైతం నామినేషన్ల దాఖలు చేయడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రెండో రోజు జడ్పీటీసీల పరంగా..76, ఎంపీటీసీలు 573 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తంగా జడ్పీటీసీలకు 85, ఎంపీటీసీలకు 744 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. డోన్‌, శిరివెళ్ల, రుద్రవరం ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తతకు దారితీసింది. జడ్పీటీసీ నామినేషన్ల పరంగా గోస్పాడు, ఆళ్లగడ్డ, డోన్‌ మండలాల నుంచి అత్యధికంగా దాఖల య్యా యి. ఎంపీటీసీల పరంగా అత్యధికంగా పాణ్యం, బండిఆత్మకూరు, నంద్యాల, గడివేముల మండలాల్లో ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి.

జడ్పీటీసీల్లో వైసీపీ.. ఎంపీటీసీల్లో టీడీపీ...

జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పరంగా దాఖలైన నామినేషన్లను పరిశీలించగా.. జడ్పీటీసీల పరంగా వైసీపీ.. ఎంపీటీసీల పరంగా టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. జడ్పీటీసీల పరంగా.. టీడీపీ- 25, వైసీపీ -31, కాంగ్రెస్‌-12, సీపీఐ, సీపీఎం- 5, జనసేన-5, బీజేపీ-4, ఇండిపెంటెంట్‌లు- 3, ఇతరులు -1చొప్పున దాఖలయ్యాయి.

ఎంపీటీసీల పరంగా.. టీడీపీ-390, వైసీపీ-295, బీజేపీ-13, జనసేన-10, సీపీఐ, సీపీ ఎం- 5, కాంగ్రెస్‌-3, బీఎస్పీ-1, స్వతంత్ర19, ఇతరులు-8 చొప్పున దాఖ లయ్యాయి.

మరింత ఎక్కువగా..

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు శుక్రవారంతో ముగియ నుంది. టీడీపీ, వైసీపీల నుంచి మరింత ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రేసులో ఉండే అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. జిల్లా పోలీసు యంత్రాంగం సైతం ఎక్కడిక్కడ నిఘాతో పాటు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

Updated Date - Oct 22 , 2026 | 11:03 PM