ఉపాధి కోసం పరుగులు
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:36 PM
ఖరీఫ్‌లో సాగు చేసిన ఏ పంట కూడా రైతు చేతికి పూర్తి స్థాయిలో అందని పరిస్థితి నెలకొంది.
వీబీ-జీరామ్‌జీ పనులకు పెరుగుతున్న కూలీలు
ఆదుకుంటున్న ‘జలసిరి’
జాబ్‌కార్డు ఉంటే కూలీ- నరసింహారెడ్డి, డ్వామా పీడీ
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో సాగు చేసిన ఏ పంట కూడా రైతు చేతికి పూర్తి స్థాయిలో అందని పరిస్థితి నెలకొంది. గత ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 2.41 లక్షల హెక్టార్లలో పంట సాగైతే.. నంద్యాల జిల్లాలో 10వేల హెక్టార్లలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. గత సంవత్సరం పత్తిని తీయడానికి పక్క రాష్ట్రాల నుంచి రైతులు వ్యయ ప్రయాసలకోర్చి కూలీలను తీసుకువచ్చారు. వారికి తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించి పొలాల్లో పత్తి తీయించారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి అందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొంత మంది రైతులు కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో పొలాల్లోనే పత్తి పంటను వదిలేశారు. కల్లూరు, కోడుమూరు, బెళగల్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ తదితర మండలాల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. పత్తితో పాటు మొక్కజొన్న, కంది, టమోటా, ఆముదం తదితర పంటలన్నీ మండుటెండలకు నేలరాలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పొలం పనులు కరువయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి పనుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో వీబీ-జీరామ్‌జీ కార్యక్రమం కింద ఉపాధి పనులు చేపట్టేందుకు రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు నీటి యాజమాన్య సంస్థ యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. ఎల్‌నినో తెచ్చిన కరువు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏటా డిసెంబరు వరకు పంట ఉత్పత్తులన్నీ ఇంటికి చేరాక వ్యవసాయ కూలీలకు పొలం పనులు తగ్గుతాయి. వేసవి పంటలు తక్కువగా ఉంటే.. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు జోరుగా ఉపాధి పనులు జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పొలం పనులు పూర్తిగా మందగించడంతో అక్టోబరులోనే గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, ఉపాధి పనుల కోసం క్యూ కడుతున్నారు.
జలసిరితో ఉపాధి పనులు
ప్రభుత్వం భూగర్భ జలసంరక్షణకు జలసిరి పనులను విస్తృతంగా ప్రారంభించాలని, ఆయా పనుల్లో కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని నీటి యాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించింది. గ్రామానికి 100-150 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. సాధారణంగా వేసవిలో కూలీల సంఖ్య 50వేలకు పైగా నమోదవుతుంది. గత ఏడాది అక్టోబరు మాసంలో పోలిస్తే ఈ నెలలో భారీగా కూలీల సంఖ్య పెరిగిందని, నీటి యాజమాన్య సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 60వేల మంది దాకా ఉపాధి పనుల కోసం వ్యవసాయ కూలీలు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే మరింత కూలీలను పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సిరి ప్రతి వారం వీబీ-జీరామ్‌జీ పథకంపై నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశిస్తున్నారు. జిల్లాలో ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగిన కూలీల కుటుంబాలు 1.60 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం వీరిలో జలధార-జలహారతి కార్యక్రమంలో 70 శాతం దాకా పాల్గొంటున్నారు. ఈసారి వ్యవసాయం, మార్కెట్ అనుబంధ రంగాలకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. గతంలో యాక్టివ్‌గా లేని జాబ్‌కార్డులు, కార్మికులు ఈసారి క్రియాశీలమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోనెల గడిస్తే వ్యవసాయ పనులు పూర్తిగా ముగిసిపోతాయని, విద్యుత్ కొరత, కరువు కారణంగా పంటలు ప్రస్తుత రబీలో రైతులు సాగు చేసే పరిస్థితి ఉండకపోవడం వల్ల రానున్న రోజుల్లో వీబీజీ రామ్‌జీ పనుల కోసం మరింతగా వ్యవసాయ కూలీలు క్యూ కట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
జాబ్‌కార్డు కలిగిన కూలీలందరికీ ఉపాధి కల్పిస్తాం
ప్రస్తుతం గ్రామాల్లో గతంలో కంటే ముందే వ్యవసాయ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ కూలీలు, రైతులు జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులను నివారించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల్లో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో జలధార-జలహారతి కార్యక్రమంతో పాటు మిగిలిన పనులను గుర్తించి జాబ్‌కార్డు కలిగిన ప్రతి వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తాం.
- నరసింహారెడ్డి, డ్వామా పీడీ