Share News

రహదారులు రక్తసిక్తం

ABN , Publish Date - May 29 , 2026 | 11:44 PM

రహదారులు రక్తసిక్తం

రహదారులు రక్తసిక్తం
డివైడర్‌ను ఢీ కోన్న కారు

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు

ఐదుగురి దుర్మరణం

పలువురికి తీవ్ర గాయాలు

పేరాయిపల్లెమెట్ట సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు

గణేకల్లు వద్ద బైక్‌ను ఢీకొట్టిన ఆటో

మిన్నంటిన రోదనలు

హైవేపై స్తంభించిన రాకపోకలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారులు రక్తసిక్తం అయ్యాయి. శుక్రవారం వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఐదుగురు దుర్మరణం చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట వద్ద కొత్త కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా పేరాయిపల్లెమెట్ట వద్ద జరిగిన ప్రమాద ఘటనను చూస్తూ ఆటోలో వెళ్తున్న వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చి ఓ కారు ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆదోని మండలం గణేకల్లు గ్రామ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద బైక్‌ను ఆటో ఢీకొనగా ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు సైతం మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

రెప్పపాటులో మూడు ప్రాణాలు అనంత వాయువుల్లో..

ఆదోని/ ఆదోని రూరల్‌, మే 29(ఆంధ్రజ్యోతి): అప్పటివరకు కళ్లముందే తిరుగుతూ నవ్వుతూ సాగిపోయిన ఆప్రాణాలు క్షణాల వ్యవధిలో అనంత వాయువుల్లో కలిసిపోయాయి. విధి ఆడిన వింత నాటకానికి మూడు కుటుంబాల్లో ఎన్నటికీ పూడ్చలేని శోకం మిగిలింది. ఒకేఒక్క రోడ్డు ప్రమాదం.. అటు గణేకల్లు, ఇటు కౌతాళం గ్రామాల్లో పెను విషాదాన్ని నింపింది. బైక్‌, ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులతో పాటు ఓ వృద్ధుడు మృతిచెందారు. వివరాలు.. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన రామాంజనేయులు, పద్మ దంపతుల ప్రథమ సంతానం తలారి మహేంద్ర(17) అదే గ్రామానికి చెందిన పెద్ద బంగారయ్య, అయ్యమ్మల పెద్ద కుమారుడు వీరేష్‌(19) ప్రాణస్నేహితులు. శుక్రవారం రాత్రి పాండవగల్లులో భోజనం ముగించుకొని ఇద్దరు బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఆదోని మండలం గణేకల్లు గ్రామ సమీపంలోని సాయిబాబా గుడి వద్దకు రాగానే మృత్యువు ఆటో రూపంలో ముంచుకొచ్చింది. ఎదురె దురుగా వచ్చిన వాహనాలు బలంగా ఢీకొనడంతో మహేంద్ర, వీరేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కౌతాళం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త విశ్వనాథ్‌ (68) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన బ్యాంక్‌ లోన్‌ రెన్యూవల్‌ నిమిత్తం ఆదోని కెనరా బ్యాంకుకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఆటోలో కౌతాళానికి ప్రయాణమయ్యారు. ఆటోలో మరో పదిమంది ప్రయాణికులు సురక్షితం గా ఉన్నప్పటికీ డ్రైవర్‌ పక్కనే కూర్చొన్న విశ్వనాథ్‌ తీవ్రంగా గాయపడి మరణించారు.

మిన్నంటిన రోదనలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఇన్‌ చార్జి డీఎస్పీ భార్గవి, తాలూకా సీఐ నల్లప్ప, ఎస్‌ఐ విద్యశ్రీ ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబ సభ్యు ల ఆక్రందనలు ఇక్కడున్న వారిని సైతం కన్నీరు పెట్టించాయి. కళ్లముందే తిరిగిన బిడ్డలు ఇలా శవాలైపోయారా అం టూ ఆతల్లులు గుండెలు బాదుకుంటూ రోదించారు. ఈ ఘటనపై తాలూకా ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డివైడర్‌ను ఢీకొట్టి కారు

ఇద్దరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

ఆళ్లగడ్డ, మే 29(ఆంధ్రజ్యోతి): కొత్త కారు రిజిస్ర్టేషన్‌ చేయించుకొని వస్తూ డివైడర్‌ను ఢీకొట్టి ఓ వ్యక్తి మరణించాడు. ఇదే ప్రమాద ఘటనను చూస్తూ రోడ్డు దాటుతున్న మరో వ్యక్తిని కారు ఢీకొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లెమెట్ట వద్ద శుక్రవారం చోటుచేసుకున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. వివరాలు.. చాగలమర్రి మండలం చిన్నవంగలికి చెందిన టీడీపీ నాయకుడు నరేంద్రరెడ్డి(37) ఇటీవలే కారు కొన్నాడు. నంద్యాలలో కారు రిజిస్ర్టేషన్‌ చేయించుకొని చాగలమర్రికి తిరిగి వెళ్తుండగా పేరాయిపల్లెమెట్ట సమీపంలో కారు అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్రరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న నర్సిరెడ్డి, నాగేంద్రరెడ్డి, శేఖర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నం ద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నరేంద్రరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

రోడ్డు దాటుతుండగా..

పేరాయిపల్లెమెట్ట వద్ద జరిగిన ప్రమాద ఘటనను చూస్తూ రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఓ వ్యక్తిని ఢీకొనగా అతడు అక్కడికక్కడే మరణించినట్లు పోలీ సులు తెలిపారు. నంద్యాల మండలం అయ్యలూరుకి చెందిన కంబగిరి(38) చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లెలో జరుగుతున్న జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్తున్నాడు. పేరాయిపట్లె మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూస్తూ చిన్నగా రోడ్డు దాటుతుండగా వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొ ట్టింది. కంబగిరి అక్కడికక్కడే మృతిచెందగా భార్య ఇందిరమ్మ, కుమార్తె సుమలత కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదాలపై వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. హైవేపై నిమిషాల వ్యవధిలో రోడ్డు ప్రమాదాలు జరగడంతో గంట సేపు వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి.

Updated Date - May 29 , 2026 | 11:45 PM