వానొచ్చి.. ఊరటనిచ్చి
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:28 PM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. వేసవిని తలపించాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ప్రస్తుత వర్షాలతో పంటలకు ప్రాణం
చల్లబడిన వాతావరణం
రైతుల్లో కొత్త ఆశలు
తీరని లోటు వర్షపాతం
ఊపందుకున్న వ్యవసాయ పనులు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. వేసవిని తలపించాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు ఇక్కట్లు పడ్డారు. నదులు, వాగులు, వంకలు ఎండిపోయి రాళ్లు రప్పలతో కళా విహీనంగా తయారయ్యాయి. ‘సీమ’ను కరువు కాటేస్తున్న పరిస్థితులు దాపురించాయి. రెండు నెలలు గడిచాయి. వరుణదేవా కరుణించవయ్యా అంటూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఒక్కసారిగా వానలు కురిశాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు ఊరటనిచ్చాయి. రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వాతావరణం చల్లబడింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. రైతుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది. ముందస్తుగా రబీ పంటలపైనే రైతన్నలు దృష్టిసారించాలని అధికారులు సూచిసు ్తన్నారు. నంద్యాల జిల్లాలో సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,50,575ఎకరాలు కాగా ప్రస్తుతం 3,16,325 ఎకరాల్లో వివిధ పంటలు సాగులో ఉన్నాయి. నేడు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నేల తడిసి పంటలకు తేమ అందడం, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం, భూగర్భ జలాల రీఛార్జ్‌కు అవకాశం ఏర్పడింది. వర్షపాతం లోటును పూర్తిగా పూడ్చి.. భూగర్భ జలాలు, నేల తేమలో స్థిరమైన మెరుగుదల రావాలంటే మరికొంత కాలం వర్షాలు కురవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మూడు రోజులతోనే..
మూడు రోజుల వర్షాలతోనే ఇంతకాలం ఉన్న లోటు పూర్తిగా తీరిపోయిందని చెప్పే పరిస్థితి లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికీ వర్షపాతం లోటు గణనీయంగానే ఉంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నంద్యాల జిల్లాలో 265.ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. సాధారణ వర్షపాతం 459.6ఎంఎంగా ఉంది. అంటే 42.2 శాతం లోటు ఉంది. కొత్తపల్లె మండలంలో సాధారణ వర్షపాతం 528.80ఎంఎం కాగా కేవలం 173.20ఎంఎం వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 67.25శాతం లోటుతో అత్యల్ప వర్షపాతం కేటగిరీలో ఉంది. పాటు నంద్యాల మండలం 56.74శాతం, పాణ్యం 56.09శాతం, శ్రీశైలం 56.04 శాతం, సంజామల 51.91 శాతం లోటు నమోదైంది.
ఈ నెలలో ఇప్పటి వరకు 112.50ఎంఎం..
జిల్లా వ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 98.46ఎంఎం కాగా 112.51ఎంఎం వర్షం కురిసింది. ఆళ్లగడ్డ, బేతంచర్ల, గడివేముల, జూపాడుబంగ్లా, కొలిమిగుండ్ల, నందికొట్కూరు, మహానంది, పగిడ్యాల, పాములపాడు, శ్రీశైలం, వెలుగోడు మండలాల్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఆళ్లగడ్డ మండలంలో సాధారణ వర్షపాతం 76.90 ఎంఎం కాగా 135.10ఎంఎం వర్షం కురిసింది. బేతంచర్లలో 79.90ఎంఎంకు గాను 97.80ఎంఎం, జూ పాడుబంగ్లా మండలంలో 97.50ఎంఎంకు గాను 90.60ఎంఎం, పగిడ్యాల మండలంలో 75.10 ఎంఎంకు గాను 90.60ఎంఎం, పాములపాడు మండలంలో 100ఎంఎంకు గాను 159.80 ఎంఎం వర్షపాతం నమోదైంది.
ఈనెలలో కురిసిన వర్షాలు మూడు నెలల లోటును పూర్తిగా పూడ్చలేక పోయాయి. ఫలితంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన మొత్తం వర్షపాతంలో చాలా మండలాలు ఇప్పటికే డెఫిషియెంట్(లోటు వర్షపాతం) కేటగిరీలో ఉన్నాయి.
భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో..
వేసవికాలం నుంచి కొనసాగుతున్న నీటి వినియోగం, తక్కువ వర్షపాతం కారణాలతో భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం మొత్తం భూగర్భంలో చేరదు. నేలస్వభావం, వర్షం తీవ్రత, వర్షపు నీటి ప్రవాహం, చెరువులు, కుంటల్లో నీటి నిల్వ, తది తర అంశాలపై భూగర్భజలాలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 9.30 మీటర్ల లోతులో ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 5.07 మీటర్ల వద్ద ఉండగా నేడు 4.23 మీటర్ల లోతుకు వెళ్లింది. బేతంచర్ల, ప్యాపిలి, డోన్, కొలిమిగుండ్ల, నందికొట్కూరు మండలాల్లో వరుసగా 29.25, 27.87, 22.86, 20.41, 16.13మీటర్ల లోతులో నీటిమట్టం నమోదైంది. అన్ని మండలాల్లో ఒకే పరిస్థితి లేదు. బండిఆత్మకూరు మం డలంలో గత ఏడాదితో పోలిస్తే 0.91మీటర్లు ఉండగా, గత ఏడాదితో పోలిస్తే స్పల్పంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. శిరువెళ్ల, మహానంది మండలాల్లో భూగర్భజలాలు పెరిగాయి.
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు
శ్రీశైలంలో అత్యధికంగా 88.2ఎంఎం వర్షపాతం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కర్నూలు, నం ద్యాల జిల్లాలో వరుసగా నాలుగో రోజు భారీవర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలంలో అత్యధికంగా 88.2 ఎంఎం వర్షపాతం నమోదు కాగా కొండచరియలు రోడ్డుపై పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జూపాడుబంగ్లా, పగిడ్యాల, ఆత్మకూరు, మహానంది, నందికొట్కూరు, అవుకు, రుద్రవరం, ఆళ్లగడ్డ, ప్యాపిలి, నంద్యాల, డోన్, దొర్నిపాడు, కోవెలకుంట్ల, బనగానపల్లె మండలాల్లో వరుసగా 56.8, 56.4, 44.2, 22.7, 22.6, 22.6, 19, 18.6, 17.8, 13.4, 18.8, 12, 11.2, 7.2ఎంఎం వర్షపాతం నమోదైంది.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో 40.4ఎంఎం, ఆలూరు 35.8 ఎంఎం, సి.బెళగల్ 25.2, ఓర్వకల్ 25.2, గూడూరు 15, కర్నూలు 14.8, గోనెగుండ్ల 14.6, ఎమ్మిగనూరు 12.8, ఆస్పరి 9.2, పత్తికొండ 7.2ఎంఎం వర్షపాతం నమోదైంది.
రైతులు అప్రమత్తం కావాలి
అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలను నమ్ముకొని దీర్ఘకాల పంటలు వేసుకుంటే మరింత నష్టపోయే అవకాశముంది. రైతులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన పంటలను మాత్రమే వేసుకోవాలి. అనేక మండలాల్లో ఇంకా భూగర్భజలాలు సాధారణ స్థాయికి రాలేలు. రాబోయే రోజుల్లో ఎలినినో ప్రభావం ఫిబ్రవరి వరకు ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కురిసిన వర్షాలు జొన్న పంట వేసుకోవ డానికి అనుకూలం. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటి కేవలం చెరువులు, కుంటలను నింపుకుని బోర్ల రీఛార్జికి మాత్రమే వాడుకోవాలి.
అశోక్‌కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త, ఆర్‌ఏఆర్‌ఎస్, నంద్యాల
మోస్తరు వర్షం
ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ
చాగలమర్రి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది. ముత్యాలపాడు, గొడిగనూరు, డి.వనిపెంట, చాగలమర్రి గ్రామాల్లో రహదారుల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న ధాన్యం తడిసి దెబ్బతినింది. కొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. మినుము, పసుపు, వరి, జూట్, కంది పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. మల్లేవేముల, రాజోలి ఆనకట్ట సమీపంలో వరద ప్రభావంతో కుందూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాడుముఖం పట్టిన పంటలకు జీవం పోసిందని రైతులు చెబుతున్నారు. విత్తనాలు వేయకుండా వదిలేసిన పొలాలను తిరిగి విత్తనం వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.