కార్తీక పౌర్ణమి వెలుగులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:46 PM
కార్తీక పౌర్ణమి దీప కాంతులు ఉమ్మడి జిల్లాను ఆధ్యాత్మిక శోభితంగా మార్చాయి.
శివ కేశవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
భక్తిశ్రద్ధలతో దీపోత్సవాలు... జ్వాలా తోరణాలు
పున్నమి కాంతుల మధ్య పులకించిన భక్తజనం
నంద్యాల కల్చరల్/శ్రీశైలం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి దీప కాంతులు ఉమ్మడి జిల్లాను ఆధ్యాత్మిక శోభితంగా మార్చాయి. పున్నమి వెలుగుల్లో నింగిలోని తారలన్నీ నేలపై వెలిగినట్లుగా.. కార్తీక పౌర్ణమి దీపోత్సవ శోభ పసిడి కాంతులతో నింపింది. చిరుదివ్వెల కిరణాలన్నీ వేవేల వెలుగుల్ని విరజింప జేశాయి. వేలాదిగా మహిళా భక్తులు తరలి వచ్చి కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలైన శ్రీశైలం, అహోబిలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, నందవరం తదితర దివ్య క్షేత్రాలతోపాటూ ఉమ్మడి జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు, జ్వాలా తోరణాలు, ఆకాశ దీపాలు వెలిగించి సం తోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని వివిధ ఆలయాలు, ధార్మిక క్షేత్రాలు, కేసీ కెనాల్ ఒడ్డున కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువ చేశాయి.