Share News

మా ఊరి రాజకుమారి

ABN , Publish Date - May 11 , 2026 | 11:42 PM

సాధారణంగా కలెక్టర్లు ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇస్తారు. కానీ నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి మాత్రం సమస్య ఉందంటే చాలు గ్రామానికి నేరుగా వెళ్లిపోతారు.

మా ఊరి రాజకుమారి
కలెక్టర్‌ను గజమాలతో సత్కరిస్తున్న గ్రామస్థులు

కలెక్టర్‌పై భూపనపాడు గ్రామస్థుల ఆత్మీయత

సమస్యలు పరిష్కరించినందుకు సారె

నంద్యాల నూనెపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా కలెక్టర్లు ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇస్తారు. కానీ నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి మాత్రం సమస్య ఉందంటే చాలు గ్రామానికి నేరుగా వెళ్లిపోతారు. ఇలా పాణ్యం మండలంలోని భూపనపాడు గ్రామానికి ఆరు నెలల క్రితం వెళ్లిన కలెక్టర్‌ రాజకుమారి సమస్యలను కళ్లారా చూశారు. సమస్యలపై ప్రజలందరూ కలెక్టర్‌ ఎదుట ఏకరువు పెట్టారు. పల్లె సమస్యలను చూసి చలించిపోయిన కలెక్టర్‌ ప్రతీ సమస్యను పరిష్కరించారు. గ్రామంలోని బీసీ కాలనీలో 30 ఏళ్లుగా సరైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ లేక అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్‌ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను చేయించి కష్టాలను తొలగించారు. తాగునీటి పైప్‌లైన్లు వేయించారు. కలెక్టర్లు రావడం, వెళ్లడమే తప్పా చేసేదేమీ లేదని అనుకున్న గ్రామస్థులకు ఆరు నెలల్లో ఇచ్చిన మాటను కలెక్టర్‌ రాజకుమారి నెరవేర్చారు. దీంతో బీసీ కాలనీలోని ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు భూపనపాడు గ్రామానికి కలెక్టర్‌ రాజకుమారి ఆడపడుచుగా మారారు. కాలనీలోని ప్రతి ఒక్కరూ కలెక్టరమ్మను ఇంటి మనిషిగా భావించారు. అందుకే సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన భూపనపాడు గ్రామస్థులు కలెక్టర్‌ను గజమాలతో సత్కరించారు. మహిళలు చీర, సారె, పసుపు, కుంకుమ, పండ్లను తీసుకొచ్చి కలెక్టర్‌కు సమర్పించారు. గ్రామస్థుల ప్రేమానురాగాలు, మహిళల ఆప్యాయతను చూసిన కలెక్టర్‌ చలించిపోయారు. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడమే అధికారుల విధి అన్నారు. భూపనపాడు ప్రజల అనురాగాన్ని ఎన్నటికీ మర్చిపోలేనన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:42 PM