నంది వాహనంపై ఆది దంపతులు
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:30 AM
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
మహాగౌరీ రూపంలో దర్శనమిచ్చిన భ్రామరి
నేడు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్ర మహోత్సోవాల్లో ఎనిమిదో రోజు అమ్మవారిని మహాగౌరి స్వరూపంలో భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి, అమ్మవార్లను నందివాహనసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు, శ్రీ చక్రచార్చన, నవవారణనార్చనలు, కుంకుమార్చనలు, కుమారీపూజలు, చతుర్వేద పారాయణలు, చండీహోమం, ఏకాదశ రుధ్రాభిషేకం, రుద్రహోమం, మధ్యాహ్న కాలార్చనలు, చండీ, కాళీ, సరస్వతీ, లక్ష్మి సహస్రనామార్చనలు నిర్వహించారు. రాత్రి కాళరాత్రి పూజ, మంత్రపుష్పం, నీరాజనాలు, ఆస్థాన సేవా, సువాసినీ పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి సింహమండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని మహాగౌరి స్వరూపంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. నవదుర్గల్లో ఎనిమిదో స్వరూపమైన ఈ దేవి తెల్లని వస్త్రాల్లో చతుర్బుజాలు కలిగి కుడిచేతుల్లో త్రిశూలం, అభయహస్తం ఎడమవైపున వరముద్ర, డమరుకం ధరించి శాంతమూర్తిగా కనువిందు చేస్తారు. అక్కమహాదేవి అలంకారమండపంలో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై నందివాహనంపై భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనుల చేసి షోడషోపచార పూజాధి క్రతువులు అర్చక వేదపండితులతో నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. వాహన పూజలనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్ నాయుడు, సభ్యులు కాశీనాథ్, ఏవీ రమణ, చిట్టిబొట్ల భరద్వాజశర్మ, మురళీధర్ శ్రీదేవి, ఆకుల శ్రీనివాసులు, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్ కుమార్, ఏఈవో స్వాములు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున రెడ్డి, ఉమేష్ పట్వారి అర్చక వేదపండితులు అధికారుల, సిబ్బందితో పాటు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.