‘రాజీ’కీయం
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:03 AM
రాజకీయాల్లో పొత్తులు కొత్త కాదు. భావసారూప్యత, పరస్పర రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల అవసరాల ప్రాతిపదికన మిత్రపక్షాలు సీట్లు సర్దుబాటు చేసుకోవడం సాధారణమే.
బయట సమరం.. లోపల సర్దుబాటు..!
వైసీపీతో టీడీపీ నాయకుల తెరవెనుక ఒప్పందాలు
ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు, కౌన్సిల్ పదవుల పంపకాలు
ఉమ్మడి జిల్లాలో అనైతిక పొత్తులు
ఎక్కడ చూసినా ఇదే చర్చ
రాజకీయాల్లో పొత్తులు కొత్త కాదు. భావసారూప్యత, పరస్పర రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల అవసరాల ప్రాతిపదికన మిత్రపక్షాలు సీట్లు సర్దుబాటు చేసుకోవడం సాధారణమే. రాష్ట్రంలో అధికార కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్లు పంపకాలు చేసుకోవడం సహజం. అయితే.. రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య స్థానిక సంస్థల పదవుల పంపకాలు అంశం తెరపైకి రావడం భిన్నమైన చర్చకు దారితీస్తుంది. ‘నీకు ఆ పదవి.. నాకు ఈ స్థానం’ అన్న రీతిలో ఎంపీపీ పీఠాలు, ఎంపీటీసీ స్థానాలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిలర్ పదవులు టీడీపీ, వైసీపీ మధ్య పంపకాలు చేసుకున్నారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. ఈ అనైతిక వ్యవహారం కాస్తా ఇరు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటే.. గ్రామ, నియోజకవర్గం స్థాయిలో ప్రత్యుర్థులతో అవగాహన ఒప్పందం చేసుకోడంపై ఇదేమీ దోస్తీ..? అంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి మండలం ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ పదవులు పంపకాలు జరిగాయి. ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో కూడా చైర్మన్, కౌన్సిలర్ పదవుల పంపకాలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నంద్యాల జిల్లాలో జడ్పీటీసీ స్థానాల్లోనూ ఇదే సాగుతోంది. మిత్రులతో పొత్తు.. ప్రత్యర్థులతో పంపకమా..? అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
కర్నూలు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు, గూడూరు, బేతంచర్ల, నందికొట్కూరు నగర పంచాయతీల మేయర్, చైర్మన్ స్థానాలు, కార్పొరేటరు, కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు జిల్లాల్లో ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థల్లో 367 వార్డులకు 2,826 మంది అభ్యర్థులు పోటీకి సై అన్నారు. అదే క్రమంలో కర్నూలు జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలకు 185 నామినేషన్లు, 432 ఎంపీటీసీ స్థానాలకు 2,180 నామినేషన్లు వచ్చాయి. నంద్యాల జిల్లాలో 28 జడ్పీటీసీ స్థానాలకు 216 నామినేషన్లు, 377 ఎంపీటీసీ స్థానాలకు 1,640 నామినేషన్లు వచ్చాయి. శనివారం పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆయా పదవులకు వచ్చిన నామినేషన్లు చూస్తే పోటాపోటీగా బరిలో దిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అదే క్రమంలో అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ఎవరు ఏ స్థానంలో నిలవాలో కూడా పంపకాలు జరగలేదు. అయితే.. మిత్రపక్షాల మధ్య సీట్లు సర్దుబాటు మాట ఎలా ఉన్నా.. రాజకీయంగా బద్ద విరోధులైన టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య అంతర్గత సీట్ల సర్దుబాటు, పదవుల పంపకాలు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మండలాల్లో టీడీపీ, వైసీపీ మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాగా, మిగిలిన మండలాల్లో కూడా తెరవెనుక రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.
అధినేత సవాల్ బేఖాతరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందని, ప్రత్యర్థులను టీడీపీ శ్రేణులు దీటుగా ఎదుర్కొంటారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. ఇందుకు విరుద్ధంగా కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు ప్రత్యర్థి వైసీపీ నేతలతో పదవుల పంపకాలకు సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. గ్రామాల్లో రాజకీయ ప్రత్యర్థుల మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు ఉండగా, నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు స్థానిక ఎన్నికల్లో పదవుల కోసం సయోధ్య కుదుర్చుకోవడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదని పార్టీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభావం పార్టీ భవిషత్తుపై పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇది ఏ పొత్తు ధర్మం..?
మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ అనైతిక సీట్ల సర్దుబాటు కారణంగా 12 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, 7 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు సింగిల్ నామినేషన్ వేశారు. టీడీపీ, వైసీపీ మధ్య సీట్ల సర్దుబాటు, తెర వెనుక ఒప్పందం మేరకే టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో వైసీపీ, వైసీపీ పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి దింపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రాలయం, కౌతాళం మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు పోటా పోటీగా నామినేషన్లు వేసినా, టీడీపీ, వైసీపీ నేతల మధ్య సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నాయని టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే మిగిలిన అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు అన్ని వార్డులకు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఇక్కడ పుర పోరు ఆసక్తికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే తెర వెనుక ఏ పెద్ద మనిషి చక్రం తిప్పారో తెలియదు... టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాజకీయ అనైతిక సీట్లు సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. టీడీపీకి 17 వార్డులు, వైసీపీకి 8, జనసేన, బీజేపీలకు చెరోఒకటి వార్డులు పంపకాలు జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఫలితంగా టీడీపీ కేటాయించిన వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, వైసీపీ కేటాయించిన వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ అంశం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చ జరుగుతోంది. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ వేసిన డాక్టర్ గోవిందరాజులకు ఏకగ్రీవమైనట్లు అధికారులు ఏకంగా డిక్లరేషన్ ఇచ్చేశారు. ఈ అనైతిక పొత్తుల వెనుక ఓ మంత్రి, కీలక నేత, పోలీసు అధికారి ఒకరు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 11, 23, 27, 29 వార్డులో మాత్రం ఎస్డీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్లు మాత్రం నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. వారిపై ఎంత ఒత్తిడి తెచ్చిన తగ్గలేదన్నది చర్చ. ఆత్మకూరు స్థానం నుంచి ఏకంగా వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవడం, ఆమె కోసం ఓ వార్డును ఖాళీగా ఉంచడం కూడా జరిగింది. ఒక్క నామినేషన్ కూడా పడని 20వ వార్డు రీ నోటిఫికేషన్లో ఆమె కోసం ఉంచారు.
ఆళ్లగడ్డలో ఎన్నికలు అంటే రాష్ట్ర స్థాయిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ హయాంలో స్థానిక ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండేది. ఆ స్థాయిలో ఉన్న రాజకీయం కాస్తా నేడు తారుమారైంది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. చివరి రోజు ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పుర సమరం ఏ స్థాయిలో ఉంటుందో..? అంటూ ప్రజలు చర్చించుకున్నారు. ఇంతలోనే రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయంగా బద్ధ శత్రువులైన టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. టీడీపీకి 22, వైసీపీకి 8, జనసేనకు 2 వార్డులు పంచుకున్నట్లు స్పష్టమైంది. అందుకు అనుగుణంగా టీడీపీకి కేటాయించిన వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, వైసీపీకి కేటాయించిన వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడం ఈ విమర్శలకు బలం చేకూర్చినట్లయింది. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా నిలిచిన షేక్ అనీషా ఎన్నిక ఏకగ్రీవమైంది.
విమర్శలకు బలం
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల విత్‌డ్రాకు 27వ తేది వరకు గడువు ఉంది. మండలాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల పంపకాలపై చర్చ జరగుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. చర్చలు కొలిక్కి వస్తే.. ఒప్పందం మేరకు తమకే కేటాయించని స్థానాల్లో తమ అభ్యర్థులను విత్‌డ్రా చేయించడానికి కూడా రాజకీయంగా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. పోత్తు ధర్మం పేరుతో మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకోవడం సహజం. రాజకీయ ప్రత్యర్థులతో పదవులు పంపకాలు చేసుకోవడం ఏ పొత్తు ధర్మం అంటారు..? అధిష్టానం దీనిని ఏ కోణంలో తీసుకుంటుంది..? టీడీపీ శ్రేణులను వెంటాడుతున్న ప్రశ్నలివి.
నంద్యాల జడ్పీ పీఠం చాలా ఖరీదు గురూ..!
కొత్తగా జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికల కావడం..మరోకవైపు జనరల్ రిజర్వు కావడంతో సదరు చైర్మన్ పీఠంపై అందరి కన్ను పడింది. పైగా జిల్లాలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో సదరు పీఠం కోసం పోటీ పెరిగింది. విశ్వసనీయ సమాచరం మేరకు.. సదరు చైర్మన్ పీఠం ఖరీదు.. రూ.20 కోట్లు? అన్నట్టుగా జిల్లాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో కొందరు బరిలో నుంచి తప్పుకోగా.. చివరికి ఇద్దరి మద్య తీవ్ర పోటీ నెలకొంది. వారిద్దరూ కూడా రిజర్వేషన్లు తారుమారు కారణంగా ఇతర మండలాల నుంచి పోటీ చేస్తున్నారు. కడప జిల్లాకు సరిహద్దున ఉన్న నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న ఓ కీలక నాయకుడు పక్క మండలం నుంచి పోటీ చేసి జడ్పీ చైర్మన్ స్థానాన్ని అధిరోహించాలని ఆశించారు. అయితే ఆయనకు సొంతవాళ్ల నుంచి అభ్యంతరాలు ఎదురుకావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఓటర్లకు ఎందుకివ్వాలి?
నంద్యాల జిల్లాలోని పుర, పరిషత్ పోరు వ్యవహారంలో డబ్బు ప్రవాహం కొనసాగింది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లకు కాకుండా రెండు కీలక పార్టీలే పంచుకోవడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేసి ఓటర్లకు డబ్బు పంచి పోగొట్టుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో.. నేతలే పంచుకున్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో రూ.5 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ జడ్పీటీసీ ఏకగ్రీవం కోసం రూ.70 లక్షలు, మరో చోట వైసీపీకి మూడు జడ్పీటీసీలతో ఎర వేసినట్లు తెలుస్తోంది. ఏకగ్రీవమైన మున్సిపాలిటీల్లోనూ ఇదే వ్యవహారం సాగిందని సమాచారం
25 జడ్పీటీసీలు.. 28 ఎంపీపీలు కూటమికే..!
ఇరుపార్టీల ఒప్పందం నేపథ్యంలో జిల్లాలోని 28 జడ్పీ స్థానాల్లో 25 స్థానాలు, 28 ఎంపీపీ స్థానాలు టీడీపీకి, మూడు జడ్పీటీసీలు, 28 వైస్ ఎంపీపీలు వైసీపీకి అన్నట్లుగా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. వైపీపీకి మూడు జడ్పీటీసీలు ఇవ్వడంతో ఆ ప్రాంతంలోని వైసీపీ వర్గం అంతా మున్సిపాలిటీలోని కూటమి చైర్పర్సన్ అభ్యర్థులకు మద్దతు తెలిపినట్లు సమాచారం. రెండు మున్సిపల్ స్థానాల్లో వైస్ చైర్మన్ పదవిని వైసీపీకి కేటాయిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నంద్యాల జిల్లాలోని 377 ఎంపీటీసీల స్థానాల్లో కూటమి, వైసీపీ 60-40 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాకు ఆనుకున్ని ఉన్న ఓ మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీటీసీ బరిలో ఉన్న ఓ వ్యక్తిపై పోలీసులే ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఆ నాయకుడిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.