సామ్రాజ్యవాద యుద్ధంపై ఆగ్రహమే ‘బిసాన ఓవ్ డా’ కవిత్వం
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:08 AM
అమెరికా సామ్రాజ్యవాదం మార్కెట్ దాహంతో చేస్తున్న ఆధిపత్య యుద్ధాల మీద అక్షరాగ్రహమే ప్రముఖ కవి చౌశా రాసిన ‘బిసాన ఓవ్‌డా’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. రాంభూపాల్ అన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. రాంభూపాల్
కర్నూలు కల్చరల్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): అమెరికా సామ్రాజ్యవాదం మార్కెట్ దాహంతో చేస్తున్న ఆధిపత్య యుద్ధాల మీద అక్షరాగ్రహమే ప్రముఖ కవి చౌశా రాసిన ‘బిసాన ఓవ్‌డా’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. రాంభూపాల్ అన్నారు. ఆదివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, పాతబస్టాండు సమీపంలోని బావర్చి ఫంక్షన హాలులో కర్నూలుకు చెందిన కవి చౌశా రాసిన బిసాన ఓవ్ డా కవిత్వానికి ఇంగ్లీషు అనువాద పుస్తకం ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి. రాంభూపాల్‌తోపాటు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, పుస్తక అనువాదకుడు జంధ్యాల రఘుబాబు, ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాహుల్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన, తెలుగు కళా స్రవంతి అధ్యక్షుడు ఇనాయతుల్లా, కవి ఆకెపోగు నాగరాజు, గజల్ గాయకుడు మహ్మద్ మియా తదితరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వి. రాంభూపల్ మాట్లాడుతూ ఒక సాధారణ జర్నలిస్టు బిసాన ఓవ్ డా ప్రాణాలను ఫణంగా పెట్టి గాజాలో జరుగుతున్న మారణకాండని ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నదని, ఆ జర్నలిస్టు పేరుతో ఈ పుస్తకం తీసుకురావడం స్ఫూర్తినిస్తోందని చెప్పారు. లక్షమంది గాజాలో మరణించడం, అందులో పసిపిల్లలు, మహిళలు ఉండడం దురదృష్టకరమైన పరిణామం అని చెప్పారు. ఈ తరణంలో కవులు అక్షరాలను ఆయుధాలుగా చేసుకొని రచనలు చేయడం సమాజాన్ని చైతన్యపరచడం గొప్ప సంకల్పమని కొనియాడారు. కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కవి చౌశా రాసిన ప్రతి పుస్తకం వర్తమాన ప్రపంచంలో ఉన్న సమస్యలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ ప్రపంచ మానవులకు ప్రమాదంగా తయారైన సామాజ్యవాద వైఖరిని ఈ కవిత్వం ఎండగట్టిందని అన్నారు. ఈ పుస్తక అనువాదం తనకు ఒక గొప్ప అనుభవమని అన్నారు. డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదం విషనాగై సమాజాన్ని కాటేస్తూ అమాయకులను బలితీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రచయిత ఇనాయతుల్లా, ఆకెపోగు నాగరాజు, గజల్ గాయకుడు మహ్మమద్ మియా మాట్లాడుతూ బాధితుల పక్షాన కవి చౌశా నిలబడి కవిత్వంతో యుద్ధం చేస్తున్నాడని చెప్పారు. గాజా మీదేగాక ప్రస్తుతం ఇరాన మీద ఇజ్రాయిల్-అమెరికా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ కూడా ఇందులో కవితలు ఉన్నాయని అన్నారు. కెంగార మోహన మాట్లాడుతూ అర్థవంతమైన వాక్య నిర్మాణం, భాషా నైపుణ్యం ఉన్నప్పుడే ఇలాంటి ప్రజా కవిత్వం రాయడం సాధ్యమని, అందులో కవి చౌశా విజయవంతమయ్యారని ప్రశంసించారు. ఇ. పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లాకు చెందిన పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు.