‘స్థానికం’లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:04 PM
వైసీపీ చేసిన ఐదేళ్ల ద్రోహానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, కర్నూల్ జిల్లా ఇన్‌చార్జి నిమ్మల రామానాయుడు అన్నారు.
80 టీఎంసీల నీటిని కాపాడిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదే
జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
రూ.67కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం : మంత్రి గొట్టిపాటి రవికుమార్
కార్యకర్తల సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
మంత్రాలయం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేసిన ఐదేళ్ల ద్రోహానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, కర్నూల్ జిల్లా ఇన్‌చార్జి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం మం త్రాలయం మండలం మాధవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి నివాస ఆవరణలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. రాయలసీమలో తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లు మరమ్మతులు చేయాలని నిపుణులు కమిటీ నివేదికలిచ్చినా వైసీపీ ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వకుండా సాగు, తాగునీటి డ్యాం గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం రూ.201కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. హంద్రీనీవా, తెలుగుగంగ, గోరుగల్లు వంటి ప్రాజెక్టులు దివంగత సీఎం ఎన్టీ ఆర్ ప్రారంభిస్తే సీఎం చంద్రబాబునాయుడు పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించారన్నారు. వైసీపీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద ధర్నా చేస్తామని మాట్లాడటం సిగ్గుచేటని, ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు ఏమిచేశారో చెప్పాలన్నారు. రాయలసీమలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులపై అడిగే నైతిక అర్హత వైసీపీకి లేదన్నారు. రెండేళ్లలో రాయలసీమకు రూ.12వేలు కోట్లు ఖర్చుచేస్తే ఐదేళ్ల వైసీపీ పాలనలో రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వాపోయారు. టీబీ డ్యాం గేట్లలో 19వ గేటు కొట్టుకుపోగా కర్ణాటక ప్రభుత్వం చేతులెత్తేస్తే పంటలు వేసుకోవద్దని రైతులకు సూచనలిచ్చినా కూటమి ప్రభుత్వ కన్హయ్యనాయుడుతో గేటును అమర్చి 80టీఎంసీల నీటిని కాపాడిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కందన్నారు. గేట్లు భద్రంగా ఉండాలని 33 గేట్లు కొత్తగా అమర్చామని తెలిపారు. గండికోట, గోరుకల్లు ప్రాజెక్టు మరమ్మతులకు రూ.60కోట్లతో పనులు చేపట్టామన్నారు. 30 ఏళ్ల ఫ్లోరైడ్ నివారణ కోసం ప్రకాశం జిఆ్లలో వెలకొండ ప్రాజెక్టును ఈనెల 31న ప్రారంభం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి బీసీలే అండ అని, వారికోసం 34 శాతం బీసీ రిజర్వేషన్ అమలుచేస్తుందని తెలిపారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులకురూ.11కోట్లు, రూ.6కోసం మెయిన్‌టెన్స్ కోసం రూ.17కోట్లు ఆర్థిక శాఖతో మాట్లాడి ఈఏడాదిలోనే పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామన్నారు. ఆర్డీఎస్, గుండ్రేవు ప్రాజెక్టుకు రెండు రాష్ట్రాల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని గాజులదిన్నె ప్రాజెక్టు అభివృద్ధికి అడుగులు వేస్తున్నామన్నారు. పులికనుమ ప్రాజెక్టుకు రెండుతూముల ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులను పంపి నివేదికలు సిద్ధం చేయిస్తానన్నారు.
వంద శాతం విజయం సాధిస్తే.. : గొట్టిపాటి రవికుమార్
మంత్రాలయం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు వంద శాతం విజయం సాధిస్తే రాఘవేంద్రరెడ్డి ఏకాగితంపైన సంతకం పెట్టమంటే పెట్టి మంత్రాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రూ.25 కోట్లతో 2వేల ఇళ్లకు సూర్యఘర్ సోలార్ అందిస్తున్నామన్నారు. రూ.67కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తే మనం చేసినపని చెప్పుకోవడం లేదు. వైసీపీ చేయకపోయినా చెడు ప్రచారం చేస్తుందని, దీన్ని కూటమి నాయకులు ముక్త కంఠంగా ఖండించాలన్నారు.
అభివృద్ధి చేయాలి : రాఘవేంద్రరెడ్డి
మంత్రాలయం నియోజకవర్గంలో తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిధులిచ్చి మంత్రాలయాన్ని అభివృద్ధి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 17,450 ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాలకు నిధలు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో163 గ్రామాల్లో తాగునీటి కోసం రూ.511కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మిస్తే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మరచిపోరని గుర్తుచేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో 500 అడుగుల బోరు వేసినా నీరు రావడం లేదని దీనికి వాటర్ షెడ్లు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. మంత్రాలయం రాఘవేంద్రపురంలో 5వేల మంది నివసించే కాలనీలో 33కేవీ విద్యుత్, ఉరుకుందలో 11కేవీ చిన్నకడబూరు, ఎరిగేర, చిన్నతుంబలం వంటి గ్రామాల్లో విద్యుత్ వైర్లు మార్చాలని, రాఘమాన్‌దొడ్డి, కందుకూరు ఐరన్‌గల్ విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరుచేయాలని మంత్రిని కోరారు.
తాగు, సాగునీటి ప్రాధాన్యత..
కర్నూల్ వెనుకబడిన ప్రాంతమని తాగు, సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ అన్నారు. కోసిగిలో ఎంపీ నిధులతో వాల్మీకి భవన్ నిర్మిస్తామని తెలిపారు. కోసిగి రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోకరెడ్డి, జనసేన, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు లక్ష్మన్న, విష్ణువర్దన్‌రెడ్డి, మంచాల సింగిల్‌విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు రఘునాథరెడ్డి, రాకే్‌షరెడ్డి, రాజారెడ్డి, జనసేన నాయకులు రామాంజనేయులు, చిన్నా, బజారప్ప, బీవీ రవిచంద్ర, వీరారెడ్డి, సుమిత్ర, టీబీ డ్యాం బోర్డు చైర్మెన్ టిప్పు సుల్తాన్, సురే్‌షనాయుడు, వరదరాజు, వెంకటపతిరాజు,అయ్యన్న, ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, ఈరన్న, అశోకరెడ్డి, మల్లికార్జున, అడివప్పగౌడు, నర్సరెడ్డి, అంజినేయులు, అడ్వకేట్ విజయ్‌కుమార్, చాపల నగేష్, డీసీ తిమ్మప్ప, పవన్, గోపాల్, భీమిరెడ్డి, జమీర్, రామకృష్ణ, కౌతాళం, కోసిగి, మంత్రాల యం, పెద్దకడబూరు మండలాల నుంచి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.