పరిషత్ లెక్క తేలింది
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:38 PM
జిల్లాలో జరిగిన పరిషత్ పోరులో కూటమి హవా కొనసాగింది. ఇదే క్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల పరంగా కూడా పక్కా లెక్క తేలినట్లైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కడ చూసిన కూటమి సత్తా చాటినట్లైంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో సైకిల్ జోరు
28 జడ్పీటీసీల్లో టీడీపీ : 23, వైసీపీ : 5
376 ఎంపీటీసీల్లో కూటమికి: 232, వైసీపీ :141, ఇతరులు: 3
పోస్టల్ బ్యాలెట్లోను టీడీపీదే హవా
జడ్పీటీసీల్లో 5,06,137 ఓట్లలో కూటమికి 3,01,245, వైసీపీకి 1,72,317 ఓట్లు
జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
నంద్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరిగిన పరిషత్ పోరులో కూటమి హవా కొనసాగింది. ఇదే క్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల పరంగా కూడా పక్కా లెక్క తేలినట్లైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కడ చూసిన కూటమి సత్తా చాటినట్లైంది. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లా పరిషత్ పోరులో సైకిల్ జోరు కొనసాగినట్లైంది. జిల్లాలోని 28 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ-23, వైసీపీ-5 చొప్పున, 376 ఎంపీటీసీల్లో టీడీపీ- 223, జనసేన-7, బీజేపీ-2, వైసీపీ-141 స్థానాల్లో విజయం సాధించాయి. ఒక్క నంద్యాలలోనే అత్యధికంగా వైసీపీ స్థానాలు గెలుపొందింది. మిగతా చోట్ల వైసీపీ అరకొర స్థానాలు సరిపెట్టుకుంది. మొత్తంగా జిల్లా పరిషత్ పోరు పరంగా జిల్లాలోని ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కూటమి నేతలతో పాటు అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది.
జిల్లాలోని 28 జడ్పీటీసీ స్థానాల్లో 8 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.(7ఏకగ్రీవం, వైసీపీ-1) మిగిలిన 20 స్థానాలకు ఎన్నికలు జరగ్గా పొత్తులో భాగంగా టీడీపీ 18 స్థానాల్లో పోటీ చేసి 15 స్థానాల్లో గెలుపొందింది. జనసేనకు కేటాయించిన రెండు (గోస్పాడు, గడివేముల) స్థానాల్లో ఓడిపోయింది. గడివేముల మండలంలో టీడీపీ రెబల్ అభ్యర్థి గెలిచారు. ఈ లెక్కన ఏకగ్రీవంలో టీడీపీ 7, పోలింగ్ పరంగా.. 16 గెలువగా.. మొత్తంగా 23 స్థానాలు టీడీపీ గెలిచినట్లైంది. వైసీపీ 5 జడ్పీటీసీ స్థానాలతో సరిపెట్టుకుంది. అదేవిధంగా 376 ఎంపీటీసీ స్థానాల్లో 152 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. (టీడీపీ-94, వైసీపీ-52, జనసేన-3, బీజేపీ-2, ఇతరులు-1). మిగిలిన 224 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. టీడీపీ-207 స్థానాల్లో పోటీ చేయగా.. 129 స్థానాల్లో, జనసేన 6స్థానాల్లో పోటీ చేయగా.. 5 స్థానాల్లోను విజయం సాధించారు. బీజేపీ పోటీ చేసిన 11 స్థానాల్లో టీడీపీ రెబల్‌గా పోటీ చేయడంతో గెలవలేకపోయింది. పోలింగ్ పరంగా వైసీపీ-89 స్థానాల్లో, ఇతరులు -2 స్థానాల్లో గెలుపొందారు. ఏకగ్రీవమైన టీడీపీ- 94, పోలింగ్ పరంగా 128 స్థానాల్లో గెలిచి మొత్తంగా టీడీపీ 223 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ ఏకగ్రీవమైన 52తో పాటు 89 స్థానాలతో కలిపి 141 స్థానాలతో సరిపెట్టుకుంది.
పోస్టల్ బ్యాలెట్‌లోనూ సైకిల్‌దే హవా..
జిల్లా పరిషత్ పోరులో పోస్టల్ బ్యాలెట్లో జడ్పీటీసీల పరంగా.. 436 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 222, వైసీపీకి 192, సీపీఐ, సీపీఎం-2, కాంగ్రెస్-4, జనసేన-8, ఇండిపెండెంట్-1, నోటా-3, చెల్లనివి 4 ఓట్లు చొప్పున నమోదయ్యాయి. అదే విధంగా ఎంపీటీసీ అభ్యర్థులకు 432 ఓట్లు నమోదు కాగా.. ఇందులో టీడీపీ-212, వైసీపీ-178, జనసేన-9, బీజేపీ-5 చొప్పున వచ్చాయి.
జడ్పీటీసీల్లో ఓటర్ల లెక్క
జిల్లాలో జరిగిన 20 జడ్పీటీసీ స్థానాల పరంగా టీడీపీ, వైసీపీ పరంగా ఓటర్ల పోలింగ్ పరంగా పరిశీలిస్తే.. జడ్పీటీసీల పరంగా మొత్తంగా 5,06,137 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 3,01,245 మంది, వైసీపికి 1,72,317 మంది ప్రజలు ఓట్లు వేశారు. టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం 1,28,928 ఉండటం గమనార్హం. ఎంపీటీసీల పరంగా పరిశీలిస్తే.. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు 2,35,520, వైసీపీకి 1,91,125 మంది ఓట్లు వేశారు. ఈ ఓట్ల వ్యత్యాసం 44,395.
జడ్పీటీచైర్మన్ పీఠంపై ఉత్కంఠ
పరిషత్ పోరు ఫలితాలతో జడ్పీ చైర్మన్ పీఠంపై అనుహ్య పరిణామాలు మొదలయ్యాయి. మొదటి నుంచి చైర్మన్ పీఠం మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసీరెడ్డినే వరిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆయన జడ్పీటీసీగా ఓటమి చెందడంతో సీన్ రివర్స్ అయింది. వెలుగోడు జడ్పీటీసీ స్ధానంలో ఏకగ్రీవమైన గుండం రమణారెడ్డి, శిరివెళ్ల జడ్పీటీసీ స్థానం నుంచి 24,487 ఓట్లతో గెలుపొందిన కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్లగడ్డలో 15,745 ఓట్లతో గెలుపొందిన పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డిలు చైర్మన్ రేసులో నిలిచారు. ఈ ముగ్గురు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.