Share News

ఆదేశాలు సరే.. అమలేదీ..?

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:39 PM

జిల్లాలో పెట్రోల్‌, డీజల్‌ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని కలెక్టర్‌ రాజకుమారి ఇటీవల స్పష్టం చేశారు.

ఆదేశాలు సరే.. అమలేదీ..?
కొలిమిగుండ్ల పెట్రోల్‌ బంక్‌ వద్ద డీజిల్‌ కోసం వేచిచూస్తున్న వినియోగదారులు

ఇంధనం లేకున్నా తెరిచి ఉన్న బంకులు

నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పెట్రోల్‌, డీజల్‌ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని కలెక్టర్‌ రాజకుమారి ఇటీవల స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తరచూ చెబుతున్నారు. అన్ని బంకులకు సరిపడా ఇంధనం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని 223 బంకుల్లో సరిపడా పెట్రోల్‌, డీజల్‌ నిల్వలున్నాయన్నారు. కానీ ఆచరణలో అది కనిపించడం లేదు. జిల్లాలోని పలు ఇంధన బంకులకు నో స్టాక్‌ బోర్డులు తీయనేలేదు. జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని బంకులను తెరిచినప్పటికీ కొన్ని బంకుల్లో ఇంధనం లేదు. ఇందులో భాగంగానే ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం పలు పెట్రోలు బంకులను పరిశీలించింది. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండులోని నయరా పెట్రోలు బంకు తెరిచి ఉన్నప్పటికీ వాహనదారులు పెట్రోలు, డీజల్‌ కోసమని వెళ్లగా ఇంధనం లేదని చెబుతున్నారు. వారు వెనుతిరిగి వెళ్తున్నారు. ఇంధనం లేనప్పుడు నోస్టాక్‌ బోర్డు పెట్టవచ్చు కదా.. బంకులోకి వచ్చి వెనక్కి వెళ్లాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు పెట్రోలు బంకులకు ఇంకా నోస్టాక్‌ బోర్డులు తీయలేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పెట్రోలు, డీజిల్‌ కొరతతో హార్వెస్టింగ్‌ ఆగిపోయిందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ను సైతం అరికట్టాలని కోరారు.

Updated Date - Apr 28 , 2026 | 11:39 PM