Share News

కొలువైన కొత్త పాలకులు

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:43 PM

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక సోమవారం కోలాహలంగా సాగింది.

కొలువైన కొత్త పాలకులు
నంద్యాల మున్సిపల్‌ కార్యవర్గంతో మంత్రి ఫరూక్‌, ఎంపీ శబరి

నాలుగు మున్సిపాలిటీల్లో టీడీపీ.. రెండింటిలో వైసీపీ

నంద్యాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు టీడీపీకే

నినాదాలతో హోరెత్తిన ప్రాంగణాలు

ఆనందోత్సాహంలో కూటమి నేతలు

నంద్యాల, నవంబరు23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక సోమవారం కోలాహలంగా సాగింది. ఎక్కడికక్కడ మున్సిపాలిటీల వారిగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లతో పాటు వార్డు సభ్యులతో కలిపి కొత్త పాలకవర్గం కొలువుదీరింది. అనుహ్య పరిణామాల మధ్య నంద్యాల, డోన్‌ మున్సిపాలిటీల్లో ఊహించని అభ్యర్థులకు వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. దీంతో ఆశావహుల్లో నిరాశ కలిగింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నాలుగింటిలో టీడీపీ.. రెండింటిలో వైసీపీ చొప్పున చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు కైవసం చేసుకున్నాయి.

నంద్యాల మున్సిపాలిటీలో 52 వార్డుల్లో టీడీపీ-24, వైసీపీ-27, బీజేపీ-1 చొప్పున గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయితే సోమవారం ఈ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి ఆయా వార్డు సభ్యులతో చైర్మన్‌ డాక్టర్‌ బాబన్‌(టీడీపీ), మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ బైరెడ్డి శబరి, వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాతో హాజరయ్యారు. ఆయితే వైసీపీ తరఫున 32వార్డులో గెలుపొందిన వార్డు సభ్యురాలు ఎద్దు సరోజమ్మ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీకి- 28, వైసీపీ-27 చొప్పున ఓట్లు వచ్చినట్లైంది. టీడీపీ తరఫున వైస్‌ చైర్మన్‌గా 11వార్డు సభ్యులు ఉప్పర సుబ్రమణ్యం, వైసీపీ తరఫున 48 వార్డు సభ్యురాలు పున్నా రాజశ్వేరిలను ప్రతిపాదించి బలపర్చారు. ఆయితే టీడీపీ అభ్యర్థికి-28, వైసీపీ అభ్యర్థురాలికి-27 ఓట్లు లభించగా.. ఒక్క ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి ఉప్పర సుబ్రమణ్యం వైస్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి మున్సిపాలిటీలో 32 వార్డు సభ్యులతో పాటు చైర్మన్‌ షేక్‌ అనీషా(టీడీపీ), ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తదితర అధికార యంత్రాంగం హాజరయ్యారు. టీడీపీ తరపున గెలిచిన 22మంది, వైసీపీ తరుపున గెలిచిన 8మంది, జనసేన తరపున గెలిచిన ఇద్దరు, ఎమ్మెల్యే కూడా రావడంతో కూటమికి- 25, వైసీపీ-8 చోప్పున ఓట్లు వచ్చినట్లైంది. ఆయితే పూర్థిస్థాయి ఆధిక్యపు ఓట్లు కూటమికి ఉన్నప్పటికి కేవలం చైర్‌పర్సన్‌తో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి ముగించారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా ఉత్కంఠ రేపుతోంది.

ఆయితే వైసీపీ వచ్చిన 17 మంది వార్డు సభ్యులు సైతం కేవలం ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. దీంంతో కూటమి తరపున వైస్‌ చైర్‌పర్సన్‌గా 6వ వార్డులో టీడీపీ తరపున గెలుపొందిన తలారి శాంతిని ప్రతిపాదించి బలపర్చారు. దీంతో ఓటు శాతం ఎక్కువుగా ఉండటంతో ఆమెకు వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి వరించింది.

బేతంచెర్ల నగర పంచాయతీల్లో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం వార్డు సభ్యులు 28 మందితో పాటు చైర్మన్‌ దూదేకుల దస్తగిరి(వైసీపీ)హాజరయ్యారు. టీడీపీ తరపున గెలిచిన 10 మంది, వైసీపీ తరపున గెలిచిన 18 మంది వార్డు సభ్యులు రావడంతో టీడీపీకి-10ఓట్లు, వైసీపీకి 18 ఓట్లతో పాటు చైర్మన్‌తో కలిపి19 ఓట్లు వచ్చినట్లైంది. అనంతరం వీరందరూ ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ తరఫున ఓటు శాతం ఎక్కువుగా వైస్‌ చైర్మన్‌గా 3వ వార్డు నుంచి గెలుపొందిన చింతల నాగిరెడ్డిని ఎన్నుకున్నారు.

ఆత్మకూరు మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం 32 వార్డుల పరంగా 21 మంది వార్డు సభ్యులతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, చైర్మన్‌ డాక్టర్‌ గోవిందరాజులు(టీడీపీ) హాజరయ్యారు. వీరందరూ ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ-17, జనసేన-1, బీజేపీ-1, సీపీఎం-1, ఇండిపెంటెంట్‌-1 చొప్పున రావడంతో ఎమ్మెల్యే, చైర్మన్‌ హాజరు కావడంతో కూటమికి 19 ఓట్లు వచ్చినట్లైంది. దీంతో టీడీపీ తరపున 29వ వార్డులో గెలిచిన షేక్‌ ఖాజా వైస్‌ కర్ణిని వైస్‌ చైర్మన్‌గా ప్రతిపాదించి బలపరచారు. దీంతో ఆయనకు వైస్‌ చైర్మన్‌ పదవి వరించింది. ఆయితే వైసీపీ తరపున గెలిచిన 11మంది వార్డు సభ్యులు గైర్హాజరయ్యారు.

నందికొట్కూరు మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం 32 మంది వార్డు సభ్యులతో పాటు చైర్‌పర్సన్‌ షేక్‌ ఫాతీమాబీ( వైసీపీ)హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ తరపున-9, వైసీపీ తరపున-23 మందితో పాటు చైర్మన్‌ హాజరుకావడంతో టీడీపీకి- 9ఓట్లు, వైసీపీకి- 24 ఓట్లు వచ్చినట్లైంది. టీడీపీకి తక్కువ ఓట్లు ఉండటంతో వైసీపీ తరపున 8వ వార్డులో గెలిచిన ఎం. స్వాములు వైస్‌ చైర్మన్‌ పదవికి ఎన్నికయ్యారు.

డోన్‌ మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం 36 మంది వార్డు సభ్యులతో చైర్‌ పర్సన్‌ కోట్ల సుజాతమ్మ (టీడీపీ), ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. కూటమి-19, వైసీపీ-15, సీపీఐ - ఇద్దరితో పాటు ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌ హాజరు కావడంతో కూటమికి- 21 ఓట్లు, వైసీపీకి సీపీఐ ఇద్దరు అభ్యర్థులు మద్దతూ తెలపడంతో వైసీపీకి -17 ఓట్లు వచ్చినట్లైంది.

నాలుగు టీడీపీ.. రెండు వైసీపీ...

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో జరిగిన పురపోరు పరంగా నంద్యాల, డోన్‌, ఆళ్లగడ్డ( వైస్‌ చైర్మన్‌ వాయిదా), ఆత్మకూరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ స్థానాలు టీడీపీ కైవసమయ్యాయి. ఇదే క్రమంలో నందికొట్కూరు, బేతంచెర్ల(నగర పంచాయతీ)లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు వైసీపీకి దక్కాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపాలిటీల్లో కొత్తపాలక వర్గం ప్రమాణ స్వీకారం, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగాయి. ఆత్మకూరులో 11మంది వార్డు సభ్యులు గైర్హాజరయ్యారు. డోన్‌లో వైసీపీకి వచ్చిన 17 ఓట్ల వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బయటకు వెళ్లిపోయారు.

నంద్యాలలో ఆ రెండు టీడీపీవే...

నంద్యాల మున్సిపాలిటీలో వైసీపీ ఎక్కువ వార్డుల్లో గెలిచింది. టీడీపీ గెలిచిన వార్డులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్‌ ఓట్లు కలిసి రావడంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు వైసీపీ తరపున గెలిచిన ఓ వార్డు సభ్యులు గైర్హాజరు కావడంతో వైస్‌ చైర్మన్‌ పదవి టీడీపీకి వరించినట్లైంది. ఈ లెక్కన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు రెండూ కూడా టీడీపీని వరించినట్లైంది. ఆయితే ఇక్కడ మొదట నుంచి వైస్‌ చైర్మన్‌ పదవి ఆశించిన ఖండే శ్యాంసుందర్‌లాల్‌, పబ్బతి వేణులకు సైతం చుక్కెదురైంది. టీడీపీ అధీష్టానం ఊహించని విధంగా నంద్యాల, డోన్‌, ఆత్మకూరు వైస్‌ చైర్మన్‌ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.

నంద్యాల టీడీపీ అడ్డా.. : ఎంపీ బైరెడ్డి శబరి

నంద్యాల గడ్డ టీడీపీ అడ్డా అని నిరూపితమైంది. కొత్త పాలక వర్గం సభ్యులందరూ కూడా నంద్యాల పట్టణ అభివృద్ధితో పాటు పట్టణ ప్రజల సమస్యలను పరిష్కారించే దిశగా కృషి చేయాలి.

నంద్యాల అభివృద్ధికి కృషి..: మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

కొత్త పాలక వర్గ సభ్యులు నిత్యం నంద్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి. అధిష్టానం మేరకు వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రతిపాదించాం. అందరూ సమన్వయంతో ముందుకుసాగాలి.

అత్యధిక మెజారిటీతో గెలిపించాం : గడుపూటి నారాయణస్వామి, నియోజకవర్గ పరిశీలకుడు

ంద్యాల పురపోరులో పట్టుబట్టి అత్యధిక మెజార్టీతో చైర్మన్‌గా డాక్టర్‌ బాబన్‌ను గెలిపించాం. వైస్‌ చైర్మన్‌గా ఉప్పర సుబ్రమణ్యంకు టీడీపీ అధీష్టానం అవకాశం కల్పించడంతో మెజార్టీ ఓట్లతో ఎన్నికయ్యారు.

Updated Date - Nov 23 , 2026 | 11:43 PM