ఫోన్లు కూడా ఎమ్మెల్యే తీయడం లేదు!
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:28 PM
‘పార్టీ కోసం 15 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాం. అయినా గుర్తింపు లేదు. ఎమ్మెల్యే ఫోన్లు కూడా ఎత్తడం లేదు. కనీసం పీఏ కూడా ఫోన్లు తీయడం లేదు.
వైసీపీ నుంచి వచ్చినోళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు
ఎమ్మిగనూరులో టీడీపీ నాయకుల ఆవేదన
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ‘పార్టీ కోసం 15 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాం. అయినా గుర్తింపు లేదు. ఎమ్మెల్యే ఫోన్లు కూడా ఎత్తడం లేదు. కనీసం పీఏ కూడా ఫోన్లు తీయడం లేదు. వైసీపీ నుంచి వచ్చిన నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు..’ అంటూ ఎమ్మిగనూరుకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ దౌలత్‌బీ, జహంగీర్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు టీడీపీలోని గందరగోళంపై ఆ పార్టీ నాయకులు ప్రెస్‌మీట్‌లో వెల్లడించడం చర్చనీయాంశమైంది. కలుగోట్ల రోడ్డులోని తాజా మాజీ కౌన్సిలర్ దౌలత్‌బీ, టీడీపీ సీనియర్ నాయకుడు జహంగీర్ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పట్లో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి పిలిచి కౌన్సిలర్ సీటు ఇచ్చారని, ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయామన్నారు. 2019లో ఎమ్మెల్యేగా బీవీ ఓడిపోయినప్పటికీ ఆయన వెంటే నడిచామన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేశామన్నారు. పార్టీ అధికారం చేపట్టాక వైసీపీ నుంచి వచ్చిన నాయకులకే ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని, ఫోన్లు చేస్తే కూడా ఎత్తడం లేదన్నారు. పీఏను కూడా ఫోన్లో సంప్రదిస్తే ఆయన ఎమ్మెల్యే కన్నా బిజీ అయ్యారన్నారు. ఇంటి దగ్గరకు వెళ్తే రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కబేళాలు, మటన్ మార్కెట్‌ల వేలాలు మసీదు తరుపున తీసుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే మసీదు నుంచి తాను తీసుకోవడం జరిగిందన్నారు. ఓ నాయకుడు వైసీపీకి చెందిన వారిని ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి వేలం పాట రుసుం రూ.45 నుంచి రూ.25కి తగ్గించేలా చేశారన్నారు. మిగితా మార్కెట్లకు సంబంధించి గెజిట్‌లో ఉన్నదానికన్నా అధిక రుసుం వసూలు చేస్తున్నారని, మరి వాటిని ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.