వలస ఓటరే బంగారమాయె..!
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:26 PM
‘అన్నా.. యాడున్నారు.. అంతా బాగేనా? వదిన, పిల్లలు ఎట్లున్నారు? ఏందీ మామా ఎట్లా ఉన్నావ్..!
నాయకుల వల్లమాలిన ప్రేమ
ఖర్చులు ఇస్తామని భరోసా
ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన దుర్భిక్షం.. కరువు
పశ్చిమం నుంచి లక్ష మందికి పైగా సుగ్గిబాట
ఎన్నికల వేళ నాయకులకు గుర్తుకొచ్చారా?
ఓటేయడానికి తమవాళ్లు వస్తారని వృద్ధుల ఎదురు చూపులు
‘అన్నా.. యాడున్నారు.. అంతా బాగేనా? వదిన, పిల్లలు ఎట్లున్నారు? ఏందీ మామా ఎట్లా ఉన్నావ్..! అత్తా.. పిల్లలు బాగున్నారా?’ అంటూ ఆప్యాయమైన పలకరింపులు. ‘మనూళ్లో సర్పంచి ఎలక్షన్లు వచ్చాయి కదా.. అందరినీ పిలుచుకని ఊరికొచ్చి ఓటేసి పోండి.. వాహనం పంపిస్తాం.. రానుపోనూ ఖర్చులు మేమే చూసుకుంటాం..!’ అనే భరోసాలు, ఆహ్వానాలు. ఊళ్లో బతుకదెరువు లేక పక్క రాష్ర్టాలకు కూడా వలసెళ్లి నెలలైనా పట్టించుకోని వాళ్లూ, ఇన్నాళ్లలో ఒక్క రోజైనా ఫోన్ చేసి పలకరించిన పాపాన పోని నాయకులు ఇప్పుడు ప్రేమ ఒలకపోస్తున్నారు. ఇది జనం మీది ప్రేమా? లేక వాళ్ల ఓటు మీది ప్రేమా? ప్రజల బాగోగులు, ఊళ్ల అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించని నాయకులకు ఇప్పుడు ఓటర్లందరూ బంధువుల య్యారు. ఒక్కసారి ఊరికి వచ్చి ఓటేసి వెళ్లమని కాళ్లావేళ్లా పడుతున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపుగా లక్ష మందికిపైగా గ్రామీణ ఓటర్లు వలస వెళ్లినట్లు సమాచారం. విజయానికి ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి వలస జీవులను ఊళ్లకు రప్పించడానికి అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు.
కర్నూలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లో ఈ ఏడాది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నాయి. అసలే కరువు.. వలసలతో తల్లడిల్లుతున్న పశ్చిమ ప్రాంతం పల్లెలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. కష్టాలు తీరుతాయని తొలకరి వానలకు భూమిలో వేసిన విత్తనం మొలకెత్తలేదు. అరకొర వాన చినుకులకు మొలకెత్తినా వర్షాభావ పరిస్థితులకు పంటలు ఎండిపోయాయి. పెట్టబడులకు తెచ్చిన అప్పులు తీర్చే దారి రైతులకు కనిపించలేదు. రైతులను నమ్ముకున్న కూలీలకు ఊళ్లో పనులు కరువయ్యాయి. చేసేదిలేక రైతులు, వ్యవసాయ కూలీల పొట్టచేత పట్టుకొని పిల్లాజల్లాతో పత్తితీత, మిరప కోత, భవన నిర్మాణ పనులు వెతుక్కుంటూ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, గుంటూరు, బాపట్ల, బెంగళూరు.. వంటి ప్రాంతాలకు వలస బాట పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. పశ్చిమ పల్లెసీమల నుంచి దాదాపుగా లక్ష మందికిపైగా ఓటర్లు వలస వెళ్లినట్లు సమాచారం. కోసిగి, మంత్రాలయం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, నందవరం, ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ, కోడుమూరు, ఆదోని, ఆలూరు.. తదితర మండలాల్లో మెజార్టీ గ్రామాలకు వలస పోటు తప్పలేదు. ప్రతి గ్రామం నుంచి 50-100 కుటుంబాలకు పైగా వలస వెళ్లి ఉంటారని అంచనా. గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలు ఊళ్ల్లొదిలి వెళ్లిపోతుంటే ఏ నాయకుడూ మేమున్నామనే భరోసా ఇవ్వలేదు. తాజాగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కావడంతో పోటీ చేసిన అభ్యర్థుల చూపు వలస వెళ్లిన ఓటర్లపై పడింది. ఏఏ ప్రాంతాల్లో ఎందరు ఉన్నారో.. వారి కోసం ఊళ్లో నాయకులు ఆరా తీయడం మొదలు పెట్టారు.
వాహనం పంపిస్తా.. రానుపోనూ ఖర్చులు భరిస్తా..!
కోసిగి మండలం పల్లెపాడు నుంచి 150 కుటుంబాలు, చింతకుంట గ్రామం నుంచి 200, మండల కేంద్రం కోసిగి నుంచి వెయ్యి, అర్లబండ నుంచి 250, చిన్న భూంపల్లె గ్రామం నుంచి 300 కుటుంబాలకు పైగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మిరప కోత పనులు, తిరుపతి, రాజంపేట, బెంగళూరు ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులకు వలస వెళ్లారు. మండల కేంద్రం కోసిగిలో 21 వేల ఓట్లు ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 10 వేల ఓట్లే పోలయ్యాయి. పోలింగ్ శాతం తగ్గడానికి వలసలే కారణం. ఈ గ్రామాలే కాదు.. పశ్చిమ పల్లెల్లో మెజార్టీ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి గ్రామంలో పట్టు ఉండే సర్పంచి పదవి దక్కించుకోవాలంటే ప్రతి ఓటు ఎంతో కీలకం. ఎంపీటీసీ ఎన్నికల్లో హొళగుంద-1 ఎంపీటీసీ సభ్యురాలు కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు. వివిధ గ్రామాల్లో సర్పంచి పదవికి పోటీ చేసిన అభ్యర్థులు వలస ఓటర్లను గ్రామానికి రప్పించే ఎత్తులు వేస్తున్నారు. ఓటర్ల జాబితాను మందేసుకొని ఎవరెవరు వలస వెళ్లారు..? ప్రస్తుతం వారెక్కడ ఉన్నారు..? అడ్రసులు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ‘బావా బాగున్నారా..! అక్కా పిల్లలెట్లున్నారు? మీరెల్లినకాడ పనులున్నాయా?’ అంటూ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ‘ఏదో ఇట్లున్నాం.. మా బతుకులు బాగోలేకే కాదా సుగ్గికొచ్చాం..! చాన్నాళ్లకు గుర్చొచ్చినట్లున్నాం..! ఏందీ కత?‘ అని అవతలి నుంచి ప్రశ్న. ఏంలేదు మనూళ్లో సర్పంచి ఎలక్షన్లు వచ్చినాయి కదా. నేను పోటీ చేస్తున్నాను.. ఆడున్న మనోళ్లందరు ఊరొచ్చి ఓటేసి వెళ్లాలి. అందరిని తీసుకొచ్చే పూచి నీదే? వాహనం పంపిస్తా.. రానుపోనూ ఖర్చులు కూడా చూసుకుంటా..!’ అంటూ హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన కుటుంబాల్లో రెండు మూడు ఓట్లున్నా.. అవి తమకు అనుకూలంగా పడితే గెలుపు లెక్కలు మారుతాయని అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు.
ఓటేయడానికికొస్తారని.. ఇంటి దగ్గర వృద్ధుల ఎదురు చూపులు
పొట్టచేత పట్టుకొని పరాయి ప్రాంతాలకు వలసెళ్లి కష్టపడుతున్న తమవాళ్లు ఓటేయడానికి ఊరొస్తారేమోనని కుటుంబాల్లోని వృద్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు ఇట్లయినా వస్తారని ఎదురు చూస్తున్నారు. ఓటేయడానికైనా మావోడు వస్తాడు.. ఉన్న రెన్నాళ్లు కళ్లారా చూసుకోవచ్చు..! అంటూ గడప దగ్గర చూపులు నిలిపిన తల్లులు ఉన్నారు. కొందరైతే సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి దగ్గరికి వెళ్లి, నాయనా..! మావోడు ఓటేయడానికి వస్తాడు కాదా.. రమ్మని ఏమైనా ఫోన్ చేసినవా? వాడేమన్నాడు..! అంటూ ఆరా తీస్తున్నారు. ఇది ఆ వృద్ధుల నిరీక్షణ ఏనాటితో తెలియజేస్తోంది. నాయకుల లెక్కలు ఓట్ల కావొచ్చు.. కానీ ఆ కుటుంబాల్లోని వాళ్లకు మాత్రం తమవారిని చూసుకునే అవకాశం లభిస్తుంది.
ఓట్ల పిలుపు వెనుక.. బతుకుల వెతలు
ఎన్నికలప్పుడు వలస ఓటర్లకు వాహనాలు పంపించడం, రానుపోనూ ఖర్చులకు ఇవ్వడం తప్ప వాళ్లు ఊరు వదిలి, ముసలి వాళ్లను వదిలి ఎందుకు వలస పోతున్నదీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల రాజకీయాల్లో ప్రజల అసలు సమస్యలు తప్ప మిగతా అన్నీ చర్చనీయాంశమవుతున్నాయి. వలసలకు శాశ్వత పరిష్కారం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అలాంటి మాటలేమీ లేకుండా ఓటర్లను వలలో వేసుకొని వాళ్ల ఓట్లు వేయించుకోవచ్చని తెలియడంతో సమస్యలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఊళ్లో ఉపాధి లేక, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించక, అప్పుల ఊబిలో చిక్కుకొని కన్నతల్లి లాంటి పల్లెను వీడుతున్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఫోన్లు చేసి పలకరించే నాయకులు.. ఎన్నికల ముగిశాక కూడా వారి ఉపాధి, అప్పులు, కుటుంబాల పరిస్థితుల గురించి అదే శ్రద్ధ చూపితే వలస జీవులకు నిజమైన భరోసా దొరకుతుంది.
వలసలు ఆగాలంటే..
పశ్చిమ ప్రాంతంలో వలసలు ఆగాలంటే మెట్ట చేలకు సాగునీరు ఇవ్వాలి. గొంతెండుతున్న గ్రామాలకు తాగునీరు అందించాలి. అది జరగాలంటే.. జిల్లాను దాటుకొని ఏటేటా వందలు, వేల టీఎంసీల తుంగభద్ర, కృష్ణా వరద జలాలు నిలుపుకునే ప్రాజెక్టులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రాధాన్యత జాబితాలనూ, ప్రతిపాదనల్లోనూ ఉన్న వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల జలాశయం, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు నిర్మాణాలు తక్షణమే చేపట్టాలి. అసంపూర్తిగా వదిలేసిన హంద్రీ నీవా ప్రాజెక్టు పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయాలి. గురురాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలి. పులికనుమ, గాజులదిన్నె జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచే పనులు చేపట్టాలి. అప్పుడే కరువు.. వలసలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీమ సాగునీటి నిపుణులు అంటున్నారు. జడ్పీ, మండల పరిషత్ సహా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు పల్లెబాగు కోసం గళమెత్తాలి..ఈ పనులు చేస్తారో లేదోగాని పోలింగ్ జరుగుతుంది. ఎవరో ఒక అభ్యర్థి గెలుస్తారు. ఎప్పటిలాగే ప్రజలు మాత్రం ఓడిపోతారు.