Share News

ముగ్గురు సీఎంల కలయిక ఓ చరిత్ర

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:18 AM

తుంగభద్ర డ్యాం గేట్లు ప్రారంభించడానికి ముగ్గురు సీఎంలు కలవడం ఓ చరిత్ర అని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ముగ్గురు సీఎంల కలయిక ఓ చరిత్ర
కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తుంగభద్ర గేటు కొట్టుకపోగానే తక్షణమే స్పందించాం

కన్నయ్యనాయుడును పంపి స్టాప్‌లాగ్‌ గేట్‌ పెట్టి వరదను కాపాడాం

రాష్ర్టాలు వేరైనా దేశంగా మనమంతా ఒక్కటే

ఈ ప్రాంత ప్రయోజనాలపై ముగ్గురు ముఖ్యమంత్రులం చర్చించాం

రైతుల జల ప్రయోజనాలు కాపాడుదాం

తుంగభద్ర గేట్లు ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు

కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులతో కలసి తుంగభద్ర గేట్లు ప్రారంభం

కర్నూలు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం గేట్లు ప్రారంభించడానికి ముగ్గురు సీఎంలు కలవడం ఓ చరిత్ర అని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి తమిళనాడుకు ఐదు టీఎంసీలు కృష్ణా జలాలు మళ్లించడం కోసం 1983లో నాటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అప్పటి ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల సీఎంలు నలుగురు కలసి నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు జొన్నగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌ జిల్లా మునిరాబాద్‌ ఐఆర్‌బీలోని హెలిపాడ్‌కు చేరుకున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్‌, ఎ.రేవంతరెడ్డితో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.51కోట్లు ఏపీ నిధులతో నూతనంగా పునరుద్ధరించిన తుంగభద్ర గేట్లను ప్రారం భించారు. గేట్ల పునరుద్ధరణ పనుల్లో భాగంగా తొలి గేటు అమర్చి ట్రయల్‌ రన్‌ విజయ వంతంగా పూర్తి చేసిన 18వ నంబరు గేటు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత నలుగురు ముఖ్యఅతిథులు వరుసగా 16, 17, 18, 19 గేట్లను బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా గేట్లు పైకి లేచాయి. ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఆవిష్కరించడంతో రైతులు, టీబీపీ బోర్డు ఇంజనీర్లు, కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు సంతోషంతో కేరింతలు కొట్టారు. బోర్డు ఇంజనీర్లు, సిబ్బందితో పాటు ఏపీ నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లి గేట్ల పునరుద్ధరణ పనుల్లో ప్రత్యేక చొరవ తీసుకున్న ఎస్‌ఈ నారాయణనాయక్‌కు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్ర మం అనంతరం మునిరాబాద్‌లోని ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముందుగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ కన్నడంలో, తెలంగాణ సీఎం రేవంతరెడ్డి హిందీలో, ఏపీ సీఎం చంద్రబాబు తెలుగులో ప్రసంగించారు. చంద్రబాబు ప్రసగించినంతా సేపు తెలుగువారితో పాటు కన్నడిగులు, ఇరు రాష్ట్రాల రైతుల కేరింతలలో సభా ప్రాంగణం మార్మోగింది.

తుంగభద్ర జలాలు కడలిపాలు కాకుండా రక్షించాం

2024 ఆగస్టు 10 రాత్రి తుంగభద్ర డ్యాం 19వ నంబరు గేటు కొట్టుకు పోయిందని ఇంజనీర్లు తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే వందల టీఎంసీలు వరద జలాలు కడలిపాలు అవుతాయి. గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడును తుంగఽభద్ర డ్యాంకు పం పాను. అక్కడే ఉంటూ వరద ఆపాలని కోరారు. ఆనాడు కర్ణాటక జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నేటి సీఎం డీకే శివకుమార్‌తో సమన్వయం చేసుకొని స్టాప్‌లాగ్‌ గేట్‌ ఏర్పాటు చేయడంతో 80 టీఎంసీలు వరద నీరు సముద్రం పాలు కాకుండా ఆపగలి గామని సీఎం చంద్రబాబు వివరించారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులు లేకుండా కాపాడామని విరించారు. రాష్ట్రాలుగా మనమంతా వేరైనా దేశంగా మనమంతా ఒక్కటే.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ నేతృత్వంలో ఇవాళ్ల మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలసి ఈ ప్రాంత ప్రయోజనాలపై చర్చించాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమావేశం జరగడం ఓ చరిత్రగా నిలుస్తుంది. మన మంతా కలిసి రైతుల ప్రయోజనాలు కాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం చంద్ర బాబు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడం లేదు. ఈఏడాది నీటిని పొదుపుగా వాడుకోవాల్సి వస్తుం దని, నదులు అనునంధానం చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నీటి ప్రయోజనాలు కాపాడవచ్చని వివరించారు. గంగా కావేరి నదుల అనుసంధానం ఇండియాకు అన్‌ స్టాపబుల్‌ అవుతుంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేస్తే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నీటి ప్రయోజనాలు నెరవేరుతాయని చంద్రబాబు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

వింటే శాంతి..వినకుంటే దండయాత్ర!

గొడ్డలి పార్టీ రాజకీయాలు ఇక చెల్లవు

మంత్రాలయంలో రెండో వర్గం ఉండకూడదు

రాఘవేంద్రరెడ్డి, తిక్కారెడ్డి కలసి పని చేయాల్సిందే

నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు దూరమవుతారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే హవా

టీడీపీ కార్యకర్తల సమావేశంలో అధినేత, సీఎం చంద్రబాబు

మంత్రాలయం నియోజకర్గం కార్యకర్తలతో భేటీ

‘మంత్రాలయం మండలంలో ఏడు గ్రామాలకు టీడీపీ నేతలు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆ గ్రామాలేమైనా వారి జాగీరా..? ఏం తమాషాగా ఉందా..? గొడ్డలి పార్టీ భయపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే ఇక చెల్లదు.. ఆ రోజే వారికి ఆఖరు రోజు అవుతుంది. ముందు శాంతి యాత్ర.. కాదంటే దండయాత్ర, ఏ యాత్రకైనా సిద్ధమే..’

సీఎం నారా చంద్రబాబు నాయుడు

గుండ్రేవులపై తీపి కబురు

రాయలసీమ జీవనాడి గుండ్రేవుల జలాశయం నిర్మాణంపై సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. గుండ్రేవుల ఎలా చేపట్టాలో ఓ కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినప్పుడు రైతులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రాజెక్టును ఎలా చేయాలి..? ఉన్న అడ్డంకులు ఎలా అధిగమించాలి..? వంటి అంశాలపై కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులతో మాట్లాడాను. ఒక కమిటీ వేస్తాం. ఆ ప్రాజెక్టు కూడా తీసుకొస్తాం. ఈ ప్రాంతానికి కూడా న్యాయం చేస్తాం.

కర్నూలు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం హోస్పెట్‌ వద్ద తుంగభద్ర జలాశయం నూతన క్రస్ట్‌గేట్లను గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్‌, ఎ.రేవంత్‌రెడ్డిలతో కలసి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం మాధవరం వద్ద నిర్వహించిన మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ముఖ్య కార్యకర్తలు, బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జీలతో భేటీ అయ్యారు. నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. చాలా మందికి పాస్‌లు ఇవ్వకపోవడంతో హెలిప్యాడ్‌ వద్ద అధినేతను చూసుకుని మురిసిపోయారు. జై చంద్రబాబు, జై లోకేశ్‌, జైజై తెలుగుదేశం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. విక్టరీ చూపితూ కార్యకర్తలకు అభివాదం చేసిన చంద్రబాబు వారిలో ఉత్తేజం నింపారు. అనంతరం జరిగిన కార్యకర్తల భేటీలో మాట్లాడారు. ఓ వైపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ.. మరో వైపు గొడ్డలి పార్టీ భయపెట్టే రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్‌ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి క్లీన్‌ స్విప్‌ విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు.

బీవీ మోహన్‌రెడ్డి చెబితేనే టికెట్‌ ఇచ్చాను

మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు.. పేదలే అధికంగా ఉన్నారు. 2009లో నియోజకవర్గంగా ఏర్పడి జరిగిన ఎన్నికల్లో ఆయనకు (ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి) నేనైతే టికెట్‌ ఇచ్చేవాడిని కాదు. ఆ రోజు బీవీ మోహన్‌ రెడ్డి వచ్చి మనోడే.. మంచోడు అంటే టికెట్‌ ఇచ్చాను. గెలిచి మోసం చేసి వెళ్లిపోయాడు. బీవీ మోహన్‌రెడ్డి ఉన్నంత వరకు మనమే విజయం సాధించాం. 2029లో మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. మంత్రాలయం మండలంలోని ఏడు గ్రామాల్లో టీడీపీ నాయకులు కూడా వెళ్లకుండా కట్టడి చేస్తారా? తమాషాగా ఉందా? గొడ్డలి పార్టీ భయపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే ఆ రోజే అఖరి రోజు అవుతుందని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ నేరాలు.. ఘోరాలు చేయడంతో దిట్ట. ఇక్కడ ఒకాయన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారు. మీ రౌడీయిజం ఇక జరగనివ్వం. బీసీల్లో చైతన్యం వస్తే కొట్టుకుపోతారని అన్నారు. ఆయనకు మొన్న జరిగిన ఎన్నికలే ఆఖరి ఎన్నికలు అవుతాయని చంద్రబాబు అన్నారు.

రెండో వర్గం ఉండకూడదు

ఇక్కడే తిక్కారెడ్డి ఉన్నాడు.. ఆయన సేవలు రాష్ట్ర స్థాయిలో వాడుకుంటాం. తిక్కారెడ్డి, రాఘవేంద్రరెడ్డిలు కలసి ముందుకు వెళ్లాలి. నియోజకవర్గంలో రెండో వర్గం ఉండకూడదు. ఒకేవర్గంగా ముందుకు తీసుకువెళ్లాలి. జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అందరినీ సమన్వయం చేయాలి. మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అన్నింటా మనమే గెలవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎవరైనా ఓడిపోతే వారిని దూరం పెడతామని హెచ్చరించారు. ప్రతీ వారం, నెలనెల సర్వేలు చేయిస్తున్నా.. ఎవరు ఎలా పని చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి మెరుగుపడ్డాడు. మైనస్‌ నుంచి ప్లస్‌ అయ్యాడు. అన్ని సర్వేలు బాగున్నాయి. అవినీతి లేదు.. అదే నీకు ప్లస్‌ పాయింట్‌ అంటూ రాఘవేంద్ర రెడ్డికి కితాబు ఇచ్చారు. కమిటీ అప్రూవల్‌ రేట్‌ 75 శాతమే ఉంది. స్వచ్ఛాంధ్రను, అర్జీలు తీసుకొని పరిష్కారం చేయడంలో ఇంకా మెరుగు పడాలి. జూన్‌లో రాఘవేంద్రరెడ్డి జూన్‌ నెలలో సరిగా తిరగలేదు. అది మెరుగుపర్చుకోవాలి. నిన్నటి వరకు ఆయన ఒక సాధారణ నాయకుడు. ఈ రోజు నియోజకవర్గ ఇన్‌చార్జి హోదా వచ్చింది. హోదా వచ్చిందని కారు అద్దాలు వేసుకుని తిరిగితే ప్రజలకు దూరమవుతారు. ఇది అందరూ గుర్తుంచుకోవాలని అని చురకలు అంటిచారు. బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌, మండల స్థాయిలో పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లి తొలి పది స్థానాల్లో ఉన్నవారిని అధినేత చంద్రబాబు అభినందించారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు వచ్చిన వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యకదర్శి తిక్కారెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు రమాకాంతరెడ్డి, శ్రీనివాస రెడ్డి, ఉలిగయ్య, ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, బాబురావు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన సాగిందిలా..

మధ్యాహ్నం 3:40 గంటలకు మాధవరం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో సీఎం చంద్ర బాబు హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యింది.

మధ్యాహ్నం 3:41-3:50 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి కారులో బయలుదేరి కేడర్‌ మీటింగ్‌ సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అభివాదం చేశారు.

మధ్యాహ్నం 3:51 సాయంత్రం 4:09 గంటలకు మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి ప్రసంగించారు. నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులు, కార్యకర్తల సంక్షేమం గురించి అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

సాయంత్ర 4:10- 4:14 గంటలకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మంత్రాలయం నియోజకవర్గ ప్రగతిపై ప్రసంగించారు.

సాయంత్రం 4:15- 5:16 గంటలకు సీఎం చంద్రబాబు సుమారు గంట పాటు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ, ప్రగతి పనులను వివరించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ప్రభుత్వంలో, పార్టీలో పెద్దపీట వేస్తామని భరోసానిచ్చారు.

సాయంత్రం 5:17- 5:30 గంటలకు కేడర్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు ఫొటోలు దిగారు.

సాయంత్రం 5:39- 5:43 గంటలకు సభా ప్రాంగణం నుంచి కారులో తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

సాయంత్రం 5:44-5:49 గంటలకు హెలిప్యాడ్‌ వద్ద స్థానిక టీడీపీ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నేతలు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు.

సాయంత్రం 5: 50 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి తిరుగు పయనమయ్యారు.

బీసీ బిడ్డను ప్రోత్సహించారు

2029లో ఎమ్మెల్యేగా గెలిచి తీరుతా

మాధవరానికి సీఎం రావడం మా అదృష్టం

మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి

మంత్రాలయం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీలను గుర్తించి బీసీ బిడ్డకు ధైర్యం చెప్పి చంద్రబాబు నాయుడు టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అన్నారు. గురువారం మాధవరంలో ఏర్పాటుచేసిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు మాధవరానికి మొదటిసారి రావడంవరంగా భావిస్తున్నానన్నారు. రాయలసీమను రాళ్ల సీమగా మార్చిన గొడ్డలి పార్టీకి 11 సీట్లిచ్చి బుద్ధి చెప్పారని, రాబోయే ఎన్నికల్లో అవి కూడా రావని అన్నారు. ఎండనక, వాననక అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం చంద్రబాబు రాయలసీమను రతనాలసీమగా మార్చారని కొనియాడారు. రాఘవేంద్రస్వామి సాక్షిగా టీడీపీలోనే కొనసాగుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ వారి ఆశీస్సులతో 2029లో ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో వలసల నివారణ కోసం ఆర్డీఎస్‌ కుడి కాలువ, పులికనుమ వాటర్‌ గ్రిడ్‌ పనులకు, మంత్రాలయంలో 100 పడకల ఆస్పత్రి, సాగుచేసుకుని పండిస్తున్న పంటల నిల్వలకు గోడాన్‌లు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటుచేయాలని సీఎంను కోరారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేశారని, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి ఎస్టీ జాబితాలో చేర్పిస్తే చంద్రబాబు నాయుడును కలియుగ వాల్మీకి మహర్షిగా పూజిస్తామన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తన ఇంటికి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చదువు కోసం బాలికలు కష్టాలు పడుతున్నారని చెప్పగానే ముఖ్యమంత్రి వెంటనే గురుకుల పాఠశాల ప్రారంభించామని, ఈరోజు నుంచే అడ్మిషన్లు పొందవచ్చని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో యువత వలసలు వెళ్లకుండా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబునాయుడు, నారా లోకే్‌షల ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గ అభివృద్దికి కోట్ల నిధులు మంజూరుచేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

వలసల నివారణకు అభివృద్ధే ముఖ్యం

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

మంత్రాలయం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): కర్నూల్‌ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసలు అధికంగా వెళ్తున్నారని, నివారణ కోసం సాగునీటి ప్రాజెక్టులతో అభివృద్ధి చేయడం ముఖ్యమని కర్నూల్‌ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. గురువారం మాధవరంలో ఏర్పాటుచేసిన మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కర్నూల్‌ జిల్లాలో బీసీలు అధికంగా ఉన్నారని వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతుల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. జిల్లాలో అధికంగా ఉండే వాల్మీకులను ఎస్టీ జాబితాలో, కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ బీసీల పార్టీగా ఎంతో మంది నాయకులను తయారుచేసి ఉన్నత స్థాయిలో నిలిపిందన్నారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

మంత్రాలయం / కోసిగి జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాధవరం గ్రా మంలో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ టీడీపీ శ్రేణుల సమావేశానికి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హాజరయ్యారు. ఆయనకు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి, టీడీపీ, జనసేన నియోజకవర్గ ఇన్‌ చార్జిలు రాఘవేంద్రరెడ్డి, బి లక్ష్మన్న, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్‌రెడ్డి, నరవ శశిరేఖ, డీఐజీ కోన ప్రవీణ్‌, కలెక్టర్‌ సిరి, కర్నూల్‌, నంద్యాల ఎస్పీలు విక్రాంత్‌ పాటిల్‌, సునీల్‌ షెరాన్‌, పన్నగ వెంకటేష్‌, ఉలిగయ్య, శివ మోహన్‌రెడ్డి, దూదేకుల సంఘం రాష్ట్ర సలహా దారుడు సాయిబాబ, బీజేపీ రాష్ట్ర నాయ కులు పురుషోత్తంరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, బ్రాహ్మణ సం క్షేమ సంఘం డైరెక్టర్‌ అడ్వకేట్‌ బాబురావు, టీడీపీ జిల్లా అధ్యక్షు రాలు గుడిసె కృష్ణమ్మ, సింగిల్‌విండో అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచు రఘునాథ రెడ్డి, రాకేష్‌రెడ్డి, రాజారెడ్డి, యశోదమ్మ, చంద్రిక, భారతి, ప్రియాంక, దీపక్‌, విష్ణువర్దన్‌ ఘనంగా స్వాగతం పలికారు.

Updated Date - Jun 26 , 2026 | 12:18 AM