కక్షిదారులకు సత్వర న్యాయం అందాలి
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:42 PM
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికే నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్
కర్నూలులో నూతన రెండు కోర్టులను ప్రారంభించిన న్యాయమూర్తులు
కర్నూలు లీగల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికే నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక మున్సిఫ్ కోర్టు ఆవరణలో ఆయన తన సహచర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఏ.హరిహర నాథ శర్మలతో కలిసి 5వ, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ప్రారంభించారు. జస్టిస్ బి.కృష్ణమోహన్ మాట్లాడుతూ నూతన కోర్టులు ప్రారంభం కావడం యువ న్యాయవాదులకు మంచి అవకాశం అని అన్నారు. జూనియర్ లాయర్లు తమ సీనియర్ న్యాయవాదుల అనుభవాలను ఉపయో గించుకుని న్యాయవాద వృత్తిలో రాణించాలని కోరారు. జూనియర్ న్యాయవాదులు అనునిత్యం చదువుతూ సీనియర్ న్యాయవాదుల సూచనలతో వృత్తి నైపుణ్యం సాధించాలన్నారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కర్నూలుతో తనకున్న అనుబంధం వల్లే తనకు వేరే అత్యవసర పనులున్నా కూడా నూతన కోర్టులు ప్రారంభించడానికి కర్నూలు వచ్చానని తెలిపారు. జస్టిస్ ఏ.హరిహరనాథ శర్మ మాట్లాడుతూ తాను కర్నూలులో న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు కర్నూలు న్యాయవాదుల సహకారం మరువలేనిదని తెలిపారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాకు మంజూరైన కోర్టులలో ప్రస్తుతం కొన్నింటికి మాత్రమే ప్రారంభిస్తున్నారని, మిగతా వాటిని అతి త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టి.మహేశ్వరరెడ్డి, జిల్లాలోని అదనపు జిల్లా, జూనియర్, సీనియర్ న్యాయాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంటు ప్లీడర్లతో పాటు పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.