Share News

పర్యావరణహితంగా పాదయాత్ర సాగాలి

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:46 PM

పర్యావరణహితంగా శ్రీశైల పాదయాత్రికులు తమ ప్రయాణం సాగించాలని ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నే్‌షఅప్పావ్‌ అన్నారు.

పర్యావరణహితంగా పాదయాత్ర సాగాలి

నడక మార్గంలో పలుచోట్ల తనిఖీలు ఆత్మకూరు ప్రాజెక్ట్‌

టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నే్‌ష అప్పావ్‌

ఆత్మకూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): పర్యావరణహితంగా శ్రీశైల పాదయాత్రికులు తమ ప్రయాణం సాగించాలని ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నే్‌షఅప్పావ్‌ అన్నారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. అఖిల భారత పులుల గణన- 2026 నేపథ్యంలో మహా శివరాత్రి ఉత్సవాలకు తరలివెళ్లే భక్తులకు తొలుత 8నుంచి 15వ తేదీ వరకు మాత్రమే అనుమతించామన్నారు ముందు నుంచే నడిచి వెళ్లే భక్తుల తాకిడి ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 6 నుంచి 15వ తేదీ వరకు అటవీమార్గం గుండా నడిచి వెళ్లేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, సిగరేట్లు, బీడీలు, అగ్గిపెట్టెలు, ఇతర నిప్పురగిల్చే వాటిని వెంట తీసుకురాకూడదన్నారు. మద్యం బాటిళ్లు చిక్కినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం దారి పొడవునా వెంకటాపురం, పల్లెకట్ట, పాతపెంట, నాగలూటి వీరభద్రాలయం, పంగిడి, దామర్లకుంట, పెచ్చెర్వు, వీరభద్రస్వామి తాపల రస్తా, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం, హఠకేశ్వరం ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమాన విధిస్తామని హెచ్చరించారు. భక్తులు తమ వద్ద వ్యర్థాలను చెత్తకుండీల్లోనే వేయాలని కోరారు. జంక్‌ ఫుడ్‌ను వెంట తీసుకురావద్దని, బిస్కెట్‌ ప్యాకెట్లు తదితర వాటిని ప్లాస్టిక్‌ కవర్లను తొలగించి కాగితాల్లో మాత్రమే తెచ్చుకోవాలని సూచించారు. 2, 5 లీటర్ల వాటర్‌ బాటిళ్లను వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. అన్నదాన కేంద్రాల నిర్వాహకులు కూడా అటవీశాఖ నిబంధనలు పాటించాలన్నారు. నడక మార్గంలో సుమారు 500 మంది అటవీ సిబ్బంది, వలంటీర్లు 24గంటల పాటు విఽధుల్లో ఉంటూ భక్తులకు సేవలందిస్తారన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 11:46 PM