సీమ ‘గుండె’రేవుల..!
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:28 PM
గుండ్రేవుల జలాశయం రాయలసీమ కరువు రైతుల ఆకాంక్ష. ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కర్నూలు-కడప కాలువ(కేసీ కెనాల్) ఆయకట్టు రైతుల కన్నీళ్లు తుడుస్తుంది.
20 టీఎంసీల సామర్థ్యంతో ‘గుండ్రేవుల’
కర్నూలు నగరం తాగునీటికి శాశ్వత పరిష్కారం
కేసీ రైతుల కన్నీళ్లు తుడిచే జలాశయం
పదేళ్లకు పైగా ఎదురు చూపు
నేడు కోడుమూరులో ‘జల సమర దీక్ష’
గుండ్రేవుల జలాశయం రాయలసీమ కరువు రైతుల ఆకాంక్ష. ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కర్నూలు-కడప కాలువ(కేసీ కెనాల్) ఆయకట్టు రైతుల కన్నీళ్లు తుడుస్తుంది. కర్నూలు నగరం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎత్తిపోతల పథకాలు ద్వారా పశ్చిమ ప్రాంతం పల్లెసీమలకు తాగు, సాగునీరు అందుతుంది. కరువులకు ఈ ప్రాజెక్టు గుండె లాంటింది. ప్రభుత్వాలు స్పందించకపోతాయా.. పాలకులకు కనువిప్పు కలగకపోతుందా.. గుండ్రేవుల జలాశయం నిర్మాణం జరగకపోతుందా..! అంటూ కష్జజీవులు దశాబ్దకాలానికి ఎదురు చూస్తున్నారు. ఏలికల్లో చిత్తశుద్ధి లోపమో.. కరువుసీమ రైతులంటే నిర్లక్ష్యమో.. వారికే ఎరుక. నాడు వైసీపీ.. నేడు కూటమి.. ప్రభుత్వం ఏదైనాసరే అంతర్‌రాష్ట్ర సమస్య అంటూ ప్రాజెక్టు ప్రాతిపాదన ఫైల్‌ను అటకెక్కిస్తున్నారు. ఏళ్ల తరబడి వేచి చూసిన రైతులు గుండ్రేవుల జలాశయం సాధన కోసం కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో గురువారం కోడుమూరులో ‘జలసమర దీక్ష’కు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో సీమ సెంటిమెంట్‌గా మారుతున్న ఈ ప్రాజెక్టుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నది ఆధారంగా కర్నూలు-కడప కాలువ (కేసీ కెనాల్) నిర్మాణం చేశారు. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కేడబ్ల్యూడీటీ-1 అవార్డు ప్రకారం తుంగభద్ర నది నుంచి 31.90 టీఎంసీలు నికర జలాలు వాటా ఉంది. ఆ నీటిని నిల్వ చేసుకునే జలాశయం లేదు. సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కాలువకు నీటిని మళ్లిస్తారు. ఈ బ్యారేజీ సామర్థ్యం 1.20 టీఎంసీలే. వరద సమయంలో నదీ ప్రవాహం ద్వారానే వాటా జలాలు తీసుకోవాల్సి వస్తుంది. తుంగభద్ర డ్యాంలో కేసీ వాటా 10 టీఎంసీలు నిల్వ చేసినా.. నది ద్వారానే తీసుకోవాల్సి ఉండడంతో డ్యాం నుంచి సుంకేసుల బ్యారేజీకి 40-50 శాతం వాటా జలాలు కూడా చేరువు. దీంతో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు ప్రతియేటా సాగునీటి కోసం సమరం చేయాల్సి వస్తుంది. కీలక సమయంలో సాగునీరు అందక పెట్టుబడులు, దిగుబడుల రూపంలో రూ.వందల కోట్లు రైతులు నష్టపోతున్నారు. అలాగే.. కర్నూలు నగర జనాభా ఏటేటా పెరుగుతూ 8 లక్షలకు చేరింది. ఈ క్రమంలో తాగునీటి సమస్య నగరవాసులను వేధిస్తోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం గుండ్రేవుల జలాశయం నిర్మాణం ఒక్కటే. నాడైనా.. నేడైనా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇది తెలుసు. అయితే.. ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ప్రాజెక్టు సాధించడంలో ఘోరంగా విఫలమవు తున్నారు.
కళ్ల ముందే తుంగభద్ర జలాలు కడలిపాలు
కృష్ణా బేసిన్ ఉప నది తుంగభద్ర. 20 ఏళ్ల వరద లెక్కలు పరిశీలిస్తే.. సుంకేసుల బ్యారేజీ దాటి దాదాపుగా 180 టీఎంసీల తుంగభద్ర వరద జలాలు కృష్ణా నదిలో కలుస్తున్నాయి. శ్రీశైలం డ్యాం దాటి ఏటేటా వందలు, వేల టీఎంసీలు కడలిపాలు అవుతున్నాయి. 2025-26 నీటి సంవత్సరంలో రికార్డు స్థాయిలో తుంగభద్ర నుంచి 407.27 టీఎంసీల వరద శ్రీశైలంకు చేరింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-1 ప్రకారం తుంగభద్ర నుంచి శ్రీశైలం డ్యాంకు కేవలం 32.75 టీఎంసీలు ఇవ్వాలని, ఆపై వరద జలాలు ఎగువున వాడుకునేందుకు హక్కు ఉందని రాయలసీమ సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. నికర జలాలు వాటా ఉన్నా, కళ్ల ముందే వరద జలాలు కడలిపాలు అవుతున్నా కేసీ ఆయకట్టు, పశ్చిమ ప్రాంత కరువు రైతుల కన్నీళ్లు తుడవలేని పరిస్థితి నెలకొంది. అయితే.. సుంకేసుల బ్యారేజీ ఎగువున 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మాణం చేస్తే కేసీ ఆయకట్టు, పశ్చిమ పల్లెలను సశ్యశామలం చేయవచ్చని, కర్నూలు నగరానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని దివంగత రిటైర్డ్ ఈఈ సుబ్బరాయుడు ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టు సర్వే, అధ్యయనం, డీపీఆర్ కోసం రూ.54.95 లక్షలు మంజూరు చేస్తూ 2013 నవంబరు 1న జీవో ఎంఎస్ నం.100 జారీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ సంస్థ సర్వే చేసి రూ.2,890 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2015 అక్టోబరు 13న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కర్నూలు సీఈ నుంచి ప్రతిపాదనలు పంపారు.
గుండ్రేవుల నిర్మాణం చేస్తే సీమ నీటి కష్టాలు తీరుతాయని ఆశించారు. రాష్ట్ర విభజన తరువాత ఐదేళ్లు నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి గుండ్రేవుల ప్రాజెక్టు ఇస్తేనే పార్టీలో చేరుతానని షరతు పెట్టడంతో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. 2019 ఫిబ్రవరి 21న రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్‌టీ నం.154 జారీ చేశారు. గుండ్రేవుల మంజూరు చేసినందుకు మార్చి 2న కృతజ్ఞత శిలాఫలకం ఆవిష్కరించారు. అయితే.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. పాదయాత్ర సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చిన జగన్ కనీసం పక్క రాష్ట్రంతో చర్చించకుండానే అంతర్‌రాష్ట్ర సమస్య అంటూ గుండ్రేవుల ప్రాజెక్టును పట్టించుకోలేదు. 2024 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజాగళం గూడూరు సభలో, టీడీపీ యువనేత, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి రేపటితో రెండేళ్లు అవుతున్నా, గుండ్రేవుల నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. సరిహద్దు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తే ప్రాజెక్టు నిర్మాణానికి పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు వల్ల ఆ రాష్ట్ర నదితీర గ్రామాలకు కూడా ఎంతో ప్రయోజనం ఉంది. తెలంగాణ రైతులు సైతం కావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.6,500 కోట్లకు పైగా చేరాయి.
గుండ్రేవుల వల్ల ప్రయోజనాలు ఎన్నో:
కేసీ వాటా జలాలు 31.95 టీఎంసీల్లో 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మిస్తే, ఒక నీటి సంవత్సరం (టూ ఫిల్లింగ్)లో దాదాపు 35-40 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. తద్వారా కేసీ ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు ఇవ్వవచ్చు.
కర్నూలు నగర జనాభాకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చు.
ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్‌కు గ్రావిటీ ద్వారా నీటి మళ్లించే అవకాశం ఉంది.
జలాశయం ఎగువన గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు సహా వివిధ పథకాలు ద్వారా కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సాగు, తాగునీరు పుష్కలంగా నీటిని ఇవ్వవచ్చు.
తుంగభద్ర నుంచి హంద్రీనీవా కాలువకు కూడా రెండు మూడు లిఫ్ట్‌లతో కావాల్సిన వరద జలాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో వేదవతి ప్రాజెక్టుకు కూడా నీటిని ఇవ్వవచ్చు. అదే జరిగితే పత్తికొండ, ఆలూరు, ఆదోని నియోజకవర్గాలకు కూడా నీటి ప్రయోజనాలు అందుతాయి.
నేడు జలసమర దీక్ష
గుండ్రేవుల సాధన కోసం కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకుడు ఎం.హర్ష ఆధ్వర్యంలో నేడు కోడుమూరులో రైతులు జలసమర దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ దీక్షతోపైనా కూటమి ప్రభుత్వంలో కనువిప్పు కలగాలని, ప్రాజెక్టు నిర్మాణం దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం..!