ఏవియేషన్ హబ్ చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:59 PM
ఏపీని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
జిల్లాను ఏవియేషన్ డ్రోన్ రంగాల కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
ఇక్కడి వాతావరణం పైలట్ శిక్షణకు అనుకూలం
దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగం
166కు చేరిన విమానాశ్రయాల సంఖ్య
రానున్న పదేళ్లలో 30వేల పైలట్లు అవసరం
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు
ఓరియంట్ ప్లైట్ ఏవియేషన్ అకాడమీ శిక్షణ కేంద్రం ప్రారంభం
ఓర్వకల్లు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఓర్వకల్లు విమనాశ్రయంలో కేంద్రమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఓరియంట్ ప్లయిట్ ఏవియేషన్ అకాడమి శిక్షణా కేంద్రాన్ని కేంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాను ఏవియేషన్ డ్రోన్ పారిశ్రామిక రంగాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తా మన్నారు. విమానాశ్రయాల అభివృద్ధితో పాటు పైలట్ శిక్షణ, విమానాల నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, ఎయిర్‌పోర్టు మేనేజ్‌మెంట్ రోడ్ టెక్నాలజీ వంటి అనుబంధ రంగాలను అనుసంధానం చేస్తూ సమగ్ర ఏవియేషన్ ఎయిర్‌పోర్టు సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కర్నూలులో ఎఫ్‌టీవో ఏర్పాటు రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్‌గా ప్రత్యేకత సంతరించుకుందన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సమీపంలో ఉండటం ఇప్పటికే విమానాశ్రయ కార్యకలాపాలు కొనసాగుతుండటం, అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటం పైలట్ శిక్షణకు అనుకూలమన్నారు. ప్రస్తుతం మూడు శిక్షణా విమాన కేంద్రాలు ఉన్నాయనీ, వాటిని త్వరలో పదికి పెంచి కర్నూలును ప్రధాన ఏవియేషన్ కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆకాంక్షించారు. దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తుందన్నారు. 2014లో 74 ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం సుమారు 166కు చేరిందన్నారు. దేశంలో విమానాల ఆర్డర్లు సుమారు 1600కు చేరుకున్న నేపథ్యంలో రానున్న 10-15 ఏళ్లలో 25వేల నుంచి 30వేల మంది పైలట్లు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. కర్నూలులో ఏర్పాటైన ఎఫ్‌టీవోలు కూడా ప్రారంభం నుంచే ఉన్నత ప్రమాణాలతో పని చేయాలని సూచించారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో మరిన్ని విమాన సర్వీసులు, మెరుగైన కనెక్టివిటి కోసం విమానయాన సంస్థలతో చర్చిస్తామన్నారు. నైట్ ల్యాండింగ్ సదుపాయం కల్పించేం దుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా చర్యలు చేపడుతామన్నారు. నైట్ ల్యాండింగ్ అందుబాటులోకి వస్తే విమానాశ్రయ కార్యకలాపాల సమయం పెరిగి అదనపు విమాన సర్వీసులకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మధుసూదనశర్మ, ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమి చైర్మన్ డా.ఆనంద్ జాకబ్ వర్గీస్, డైరెక్టర్ డా.అశోక్ వర్గీస్, కర్నూలు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యాసాగర్, సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల ప్రతినిధులు అనురాగ్ స్వామినాథన్, అనూఫ్ సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ఐశ్వర్య, ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
విమానయాన అభివృద్ధికి నాంది : ఎంపీ బస్తిపాటి నాగరాజు
రాయలసీమ యువతకు పైలట్ శిక్షణలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఓర్వకల్లు విమానాశ్ర యంలో ప్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ప్రారంభం విమానయాన అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు.
యువతకు కొత్తబాట :పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లులో పైలట్ శిక్షణ యువతకు కొత్తబాట వేయనుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఓరియంట్ ప్లైట్స్ ఏవియేషన్ అకాడమి ద్వారా స్థానిక యువతకు విమానయాన రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం అకాడమిలో సుమారు 50 మంది శిక్షణ పొందుతున్నారని, పైలట్లతో పాటు సాంకేతిక సిబ్బంది, మేనేజ్‌మెంట్ విభాగాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.
ఏవియేషన్ అకాడమి ఏర్పాటు అభినందనీయం : కలెక్టర్ ఏ.సిరి
ఓర్వకల్లు విమానాశ్రయంలో ఓరియంట్ ప్లైట్స్ ఏవియేషన్ అకాడమి ఏర్పాటు కావడం అభినందనీయమని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి అన్నారు. బీజీసీఏ నుంచి అనుమతులు పొందిన తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీవో)గా అకాడమి ఏర్పాటు కావడం ప్రత్యేకమన్నారు. అకాడమి డైరెక్టర్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
కర్నూలును అభివృద్ధి చేసేందుకు చర్యలు : మంత్రి టీజీ భరత్
కర్నూలులో విమానయాన రంగంతో పాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఓరియంట్ ప్లైట్ ఏవియేషన్ అకాడమి ఏర్పాటు కావడం అభినందనీయమని, ఆంద్రప్రదేశ్‌లో తొలిసారిగా ఇలాంటి శిక్షణా కేంద్రం ఏర్పాటు కావడం ప్రత్యేకమన్నారు. కర్నూలు, విజయవాడ మధ్య విమాన సర్వీసుల ప్రీక్వెన్సీ పెంచి ఉదయం, సాయంత్రం రోజువారి సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.
యువతకు సంతోషకర విషయం : మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
కర్నూలు విమానాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం జిల్లా ప్రజలకు, రాష్ట్ర యువతకు సంతోషకర విషయమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నామని, తొలి దశలో 180ఎకరాలు, రెండో దశలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2017లో శంకుస్థాపన చేసిన విమానాశ్రయాన్ని తక్కువ వ్యవధిలోనే ప్రారంభించామని, ప్రస్తుతం అదే విమానాశ్రయంలో ఏవియేషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కావడం అభివనందనీయమన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించాలని ఓరియంట్ ఏవియేషన్ సంస్థ ప్రతినిధులను ఆయన కోరారు.