Share News

మాదక ద్రవ్య రహితమే లక్ష్యం

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:40 PM

నషా ముక్త్‌ భారత్‌ ద్వారా యువతకు అవగాహన కల్పించి జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యమని కలెక్టర్‌ డా. ఏ. సిరి అన్నారు.

మాదక ద్రవ్య రహితమే లక్ష్యం
ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

యువతను కాపాడటం అందరి బాధ్యత

కలెక్టర్‌ డా. ఏ సిరి

కర్నూలు అర్బన్‌/ హాస్పిటల్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): నషా ముక్త్‌ భారత్‌ ద్వారా యువతకు అవగాహన కల్పించి జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యమని కలెక్టర్‌ డా. ఏ. సిరి అన్నారు. గురువారం నగరంలోని పోలీస్‌ శాఖ, ఈగల్‌ టీమ్‌ ఆధ్వర్యంలో రాజవిహర్‌ నుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు నిర్వహించిన వాకథాన్‌ లో కలెక్టర్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పీ. శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువకులు ఎక్కువగా ఆల్కహాల్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, దీని వల్ల వారి భవిష్యత్‌ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మత్తుపదార్థాల దుష్ప్రభావాలను వివరిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారికి పునరావాసం కల్పించేందుకు డి- అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, సైక్రియాట్రిస్టుల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ మత్తు పదార్ధాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికి కాకుండా కుటుంబం, సమాజానికి కూడా తీవ్రమైన హానీ కలిగిస్తుందని తెలిపారు. అవగాహనతోనే ఈ సమస్యకు సమర్ధవంతమైన పరిష్కారమని అన్నారు. నషా ముక్త భారత్‌ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ బాఽగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణారెడ్డి, ఈగల్‌ టీమ్‌ ఎస్‌ఐ సుజన్‌కుమార్‌, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 11:40 PM