Share News

వంద శాతం చెత్త సేకరణే లక్ష్యం

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:28 PM

వందశాతం చెత్త సేకరణే లక్ష్యమని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు.

వంద శాతం చెత్త సేకరణే లక్ష్యం
విశాల్‌ మార్ట్‌ వద్ద జీటీఎస్‌ స్టేషన్‌ను పరిశీస్తున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌

రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): వందశాతం చెత్త సేకరణే లక్ష్యమని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని విశాల్‌ మార్ట్‌ వెనుక, జొహరాపురం రోడ్డులో ఉన్న జీటీఎస్‌ స్టేషన్‌లను మంగళవారం కమిషనర్‌ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించారు. పట్టాభిరామ్‌ మాట్లాడుతూ నగరంలో వంద శాతం ఇంటింటి చెత్తసేకరణే లక్ష్యంగా ప్రతిరోజూ ఇళ్ల వద్దకే చేరుకుని సుమారు 225 టన్నుల తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారని చెప్పారు. నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్‌ చేసేందుకు గార్గేయపురం డంప్‌యార్డులో 9.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.8 కోట వ్యయంతో ఇంటిగ్రేటేడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్‌ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్తసేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని, ఇంటింటి చెత్తసేకరఫై ప్రజాభిప్రాయ సేకరణలో 5.6 శాతం మెరుగుదల నమోదైందని తెలిపారు. అనంతరం జొహరాపురం డంప్‌యార్డులో బయో మైనింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. బయోమైనింగ్‌ పూర్తయిన స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకునేలా స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల ప్రకారం ప్రణాళికలు రూపొందించుకోవాలని, మిగిలిన 1.18 లక్షల మెట్రిక్‌ టన్నుల బయో మైనింగ్‌ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జె.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ ఎం.రఘు, పబ్లిక్‌ హెల్త్‌ ఎంఈ గుర్రప్ప యాదవ్‌, నగర పాలక ఎంఈ గిరిరాజు, డీఈఈ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఈ వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:28 PM