వైభవంగా మహా నందీశ్వరుని కల్యాణం
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:38 PM
మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బహ్ర్మోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం ఆలయ వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు.
ఆశ్వ వాహనంపై ఊరేగిన దేవ దేవుడు
వైభవంగా పుష్ప పల్లకి సేవ
మహానంది, పిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బహ్ర్మోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం ఆలయ వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను తీసుకొచ్చారు. అనంతరం కల్యాణ వేదిక వద్దకు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, దాతలు పట్టు వస్త్రాలతో పాటు పూజా ద్రవ్యాలను మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చారు. అనంతరం కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు.
అశ్వవాహనంపై మహానందీశ్వరుడు: మహానంది శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అశ్వవాహనంపై మహానందీశ్వరుని గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం వైభవంగా పుష్ప పల్లకి సేవ చేశారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి చేత ముందుగా అర్చకులు పూజలు చేయించారు. కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, నీలకంఠరాజు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
నేడు రధోత్సవం: మహానందిలో మంగళవారం సాయంత్రం రఽథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.