Share News

ఘాట్‌ మెరిసె... లోకేశ్‌ మురిసె..!

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:53 PM

కర్నూలు నగరంలో కేసీ కెనాల్‌లో వినాయక నిమజ్జన ఘాట్‌ను అందంగా తీర్చిదిద్దడంపట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసులను ప్రశంసించారు.

ఘాట్‌ మెరిసె... లోకేశ్‌ మురిసె..!
సుందరీకరణ తర్వాత కేసీ కెనాల్‌ అందాలు

కేసీ కెనాల్‌ సుందరీకరణపై మంత్రి నారా లోకేశ్‌ ప్రశంసలు

సోషల్‌ మీడియాలో పోస్టులు

పాత, కొత్త ఫొటోలు షేర్‌ చేసిన మంత్రి

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో కేసీ కెనాల్‌లో వినాయక నిమజ్జన ఘాట్‌ను అందంగా తీర్చిదిద్దడంపట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసులను ప్రశంసించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి ప్రవాహాం లేక కేసీ కెనాల్‌ చెత్తా చెదారంతో నిండిపోయింది. దుర్గంధంగా మారింది. వినాయక నిమజ్జనం కోసం కమిషనర్‌ ఓబులేసు దగ్గరుండి పారిశుధ్యం, ఘాట్‌ అభివృద్ధి పనులు చేపట్టారు. మంత్రి టీజీ భరత్‌, జిల్లా కలెక్టర్‌ సిరిలో కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. మొత్తంగా భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అందంగా తీర్చిదిద్దారు. ‘మార్పు కనిపిస్తోంది.. ఘాట్‌ మెరిసిపోతోంది..!’ శీర్షికతో నగరపాలక అధికారులు ఒక వీడియోను శుక్రవారం సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. యువనేత, మంత్రి నారా లోకేశ్‌ ఆ వీడియోను శనివారం వీక్షించారు. ఎక్స్‌ సహా వివిధ సోషల్‌ మీడియా వేదికల్లో రీ-పోస్టు చేసి మంత్రి టీజీ భరత్‌, జిల్లా కలెక్టర్‌ సిరి, కమిషనర్‌ చల్లా ఓబులేసును అభినందించారు. చెత్తతో నిండిన ప్రాంతం (కేసీ కెనాల్‌)ను పరిశుభ్రంగా వినాయక ఘాట్‌ను తీర్చిదిద్దారని మంత్రి లోకేశ్‌ కొనియాడారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయం, సహకారంతో పని చేస్తే అద్భుతమైన మార్పులు సాధ్యం అవుతాయి. కేంద్రీకృత పాలన, ప్రాథమిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఎలాంటి మార్పు సాధ్యమవుతుందో.. అందుకు కర్నూలు వినాయక ఘాట్‌ ప్రత్యేక నిదర్శనమని మంత్రి లోకేశ్‌ వివరించారు.

రెట్టింపు ఉత్సాహం ఇచ్చింది

భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీ కాలువ, హంద్రీనీవా కాలువలో నిమజ్జన ఏర్పాటు చేశాం. ఎల్‌నినో ప్రభావం వల్ల కేసీ కాలువలో నీటి ప్రవాహాం లేకపోయినా గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కోరిక మేరకు ఘాట్‌లో 600 మీటర్లు పొడవు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. చెత్తా చెదారంతో నిండిన కేసీ కాలువను అందంగా తీర్చిదిద్దాం. మా యువనేత, మంత్రి నారా లోకేశ్‌ ఆ వీడియోలు చూసి అభినందించడమే కాకుండా సోషల్‌ మీడియాలో రీ-పోస్టు చేయడం చాలా సంతోషంగా ఉంది. చేసిన మంచి పనులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు గుర్తించి ప్రశంసిస్తే మాలో రెట్టింపు ఉత్సాహాం వస్తుంది.

- టీజీ భరత్‌, పరిశ్రమల శాఖ మంత్రి

సమష్టి కృషికి లభించిన గుర్తింపు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణం, అందమైన ప్రదేశంలో నిమజ్జనం చేసేందుకు వీలుగా కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ను తీర్చిదిద్దాం. మంత్రి టీజీ భరత్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆదేశాలు, సూచనలు మేరకు కార్పొరేషన్‌ సిబ్బంది శ్రమించి చెత్తతో నిండిపోయిన కాలువను అందంగా తీర్చిదిద్దాం. మంత్రి నారా లోకేశ్‌ అభినందిస్తూ, ఎక్స్‌ సహా వివిధ సోషల్‌ మీడియాలో రీ-పోస్టు చేయడం మరవలేని సంతోషంగా ఉంది. ఇది సమష్టి కృషికి లభించిన గుర్తింపు.

- చల్లా ఓబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్‌, కర్నూలు

Updated Date - Sep 19 , 2026 | 11:53 PM