ఆహారం విషతుల్యం
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:08 AM
మానవ మనుగడకు కనీస అవసరమైన ఆహారం ఇప్పుడు స్వార్థపరుల చేతుల్లో పడి విషతుల్యంగా మారుతోంది. ఆహార కల్తీ ప్రజారోగ్యాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతగా మారింది.
నిషేధిత రసాయనాలతో తయారీ
తూతూ మంత్రంగా తనిఖీలు.. నామమాత్రం చర్యలు
ప్రశ్నార్థకమైన ప్రజారోగ్యం
కర్నూలు రాజ్విహార్ సర్కిల్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మానవ మనుగడకు కనీస అవసరమైన ఆహారం ఇప్పుడు స్వార్థపరుల చేతుల్లో పడి విషతుల్యంగా మారుతోంది. ఆహార కల్తీ ప్రజారోగ్యాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతగా మారింది. ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారులు సేకరించిన ఆహార నమూనాల్లో దాదాపు 17 శాతం వరకు కల్తీ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వ్యాపారుల స్వార్థ ప్రయోజనాలు, అధికారుల నిర్లక్ష్యం, కఠిన చట్టాలు లేకపోవటంతో ఆహార కల్తీ సమస్య ప్రజారోగ్యానికి పెను ముప్పుగా తయారైంది. ఉదయం తాగే టీ మొదలు, రాత్రి చేసే భోజనం వరకు మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాన్ని ఏదో ఒక విధంగా కల్తీ చేస్తున్నారు. దీని పట్ల ప్రజలు స్వీయ అప్రమత్తత లేకపోతే భవిష్యత్తులో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
కార్యాలయంలో ‘ఒకే ఒక్కడు’
ఆహార కల్తీ నియంత్రణ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యోగులను విభజిత జిల్లాలకు సర్దుబాటు చేశారే తప్ప, అదనపు సిబ్బందిని కేటాయించలేదు. దీంతో శాఖాపరమైన తనిఖీలు అనుకున్నంత చురుగ్గా జరగటం లేదు. దీంతో కొందరు సిబ్బంది తాము ఆడిందే ఆటగా పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇద్దరు ఆహార భద్రత అధికారులు ఉన్నారు. వీరిలో ఒకరు అనారోగ్య కారణాలతో కార్యాలయానికే పరిమితమయ్యారు. ఇదే అంశం మరో అధికారికి కలిసి వచ్చిందని చెప్పాలి. జిల్లావ్యాప్తంగా తనిఖీల పేరుతో ఆయన ఒక్కరే హడావుడి చేస్తూ తన స్వార్థ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారనే విమర్హలు మూటగట్టుకున్నారు. కీలక ప్రజాప్రతినిధులు తమ బంధువులని బెదిరింపు ధోరణితో చాకచక్యంగా పనులు చక్కబెడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఈ శాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. అప్పట్లో ఆ అధికారి అనారోగ్యాన్ని ఈ అధికారి తనకు అనుకూలంగా మార్చుకున్నారనే అపవాదు ఉంది.
విస్తుగొలిపే అంశాలు
పాలలో రసాయనాలు, పండ్లలో కాల్షియం కార్బైడ్, కారంపొడిలో రంపపు పొట్టు, నూనెల్లో చౌక నూనె, ఎముకల నుంచి తీసిన నూనె, పామాయిల్ వంటి మిళితం చేసి ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇక వీధి వ్యాపారాలు మొదలు, పెద్ద హోటళ్ల వరకు ఆహారం ఆకర్షణీయంగా కనిపించేందుకు కృత్రిమ రంగులు, నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారు. దీని వల్ల ఆహార పదార్థాలు కనులకు ఇంపుగా, నాలుకకు రుచికరంగా అనిపిస్తోంది. కానీ ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్యాఇ. ఇటీవల నగరంలోని రెడ్డి గారి విందు, కొండారెడ్డి బిర్యానీ, కుంభ హోటల్, తాళింపు రెస్టారెంట్, మదీనా డ్రైపూట్స్ తదితర ప్రాంతాల్లో ఆహార కల్తీ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించగా విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా వంటగదులు శుభ్రంగా లేకపోవటం, అక్కడే ఎలుకలు, బొద్దింకలు సంచరిస్తుండటం, సిబ్బంది వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం, కుళ్లిపోయిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసాన్ని వినియోగించటం, నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి వడ్డించటం, పురుగు పట్టిన జీడిపప్పును విక్రయించటం వంటి ఘోరమైన చర్యలకు పాల్పడుతున్నారు. గత పది నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా ఆహార కల్తీ నియంత్రణ అధికారులు 118 నమూనాలను సేకరించి, ప్రయోగశాలకు పంపారు. ఇందులో 8 నమూనాలు హానికరమైనవిగా నిర్ధారణ అయ్యాయి. మరో 5 నమూనాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. 19 కేసుల్లో బాధ్యులైన వ్యాపారుల నుంచి రూ.9,20,000 లక్షలు జరిమానా వసూలు చేశారు. వీటిలో డ్రైపూట్స్, టీ పొడి, బ్రెడ్, మసాలాలు, నిల్వఉంచిన ఆహారం విక్రయించిన కేసులు ఉన్నాయి.
నిరంతర తనిఖీలు చేస్తున్నాం
ఆహార కల్తీ నియంత్రణకు నిరంతరం తనిఖీలు చేస్తూ, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. నేరం తీవ్రమైనది అయితే జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా విధిస్తున్నాం. ప్రజలు ఆహార కల్తీ పట్ల అప్రమత్తంగా ఉంటూ వారి దృష్టికి వచ్చిన సమస్యలను మాకు తెలియజేస్తే ఫిర్యాదు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - సతీ్షకుమార్, సహాయ ఆహార కల్తీ నియంత్రణ అధికారి