Share News

తొలి ఘట్టం ప్రశాంతం

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:17 PM

పల్లె రాజకీయం వేడెక్కుతోంది. తొలి విడత నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సమరంలో మరో అంకానికి తెరలేచింది.

తొలి ఘట్టం ప్రశాంతం
మొలగవల్లిలో నామినేషన్‌ వేస్తున్న టీడీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి బంగారు సునందపటేల్‌ యాదవ్‌

తొలి విత 148 పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ పూర్తి

సర్పంచ్‌ స్థానాలకు 1,048

వార్డులకు 3,054 నామినేషన్లు

రెండో విడతలో 186 పంచాయతీలకు నేటి నుంచి నామినేషన్లు

కర్నూలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పల్లె రాజకీయం వేడెక్కుతోంది. తొలి విడత నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సమరంలో మరో అంకానికి తెరలేచింది. ఆశావాహుల పోటాపోటీతో చివరిరోజు నామినేషన్ల కేంద్రాలు కిటకిటలాడాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు వివిధ పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించారు. రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. సర్పంచ్‌ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు మద్దతుదారులను బరిలో నిలిపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే ఆదోని, ఆలూరు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆదోని-1, ఆదోని-2, ఆలూరు, హోళగుంద, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ, హాలహర్వి మండలాల్లో 148 గ్రామ పంచాయతీలకు ఈ నెల 15 నుంచి సర్పంచ్‌, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. మంగళవారంతో ఈ ప్రక్రియ ముగిసింది. సర్పంచ్‌ స్థానాలకు 1,048 నామినేషన్లు దాఖలు కాగా, 1,520 వార్డు స్థానాలకు 3,054 నామినేషన్లు వచ్చాయి. ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోకుండా నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తొలి విడత నామినేషన్ల చివరి రోజు ఆశావాహులు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపారు. నామినేషన్ల దాఖలకు చివరి అవకాశం కావడంతో పలు పంచాయతీల్లో పోటా పోటీ నెలకొంది. అభ్యర్థులు, వారి అనుచరులతో నామినేషన్‌ కేంద్రాలు సందడిగా మారాయి. రద్దీ కారణంగా పలు పంచాయతీల్లో రాత్రి 8 గంటల వరకు అధికారులు నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సిరి పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రెండో విడతకు సై

రెండో విడత ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల, మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో 186 గ్రామ పంచాయతీలకు బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం 75 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. తొలి విడత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండో వితలోనూ ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలకు జిల్లా కలెక్టర్‌ సిరి పలు సూచనలు చేశారు. అదే క్రమంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద నీడ కోసం షామియానాలు, కుర్చీలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీవో, తహసీల్దార్‌, స్థానిక అధికారులను ఆదేశించారు.

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా.. సర్పంచ్‌ బరిలో నిలిచే అభ్యర్థులకు రాజకీయ నేపథ్యం ఉంటుంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సహా వైసీపీ వంటి ప్రధాన పార్టీలు తమ పార్టీలకు చెందిన మద్దతుదారులను బరిలోకి దింపుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులు మినహా, అన్ని కూడా రాజకీయ నాయకుల మద్దతుతో ఆశావాహుల పోటీకి సై అంటున్నారు. దీంతో రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికలో ముఖ్య నేతలు బిజీ కావడంతో, గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వైసీపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు.

తొలి విడతలో మండలాల వారీగా వచ్చిన నామినేషన్లు

మండలం సర్పంచ్‌ వార్డులు

ఆదోని-1 152 433

ఆదోని-2 134 515

హోళగుంద 131 320

ఆలూరు 113 330

ఆస్పరి 166 402

చిప్పగిరి 95 218

దేవనకొండ 169 605

హాలహర్వి 88 234

మొత్తం 1048 3054

Updated Date - Nov 17 , 2026 | 11:17 PM