Share News

భృంగి వాహనంపై ఆదిదంపతులు

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:55 PM

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

భృంగి వాహనంపై ఆదిదంపతులు

భక్తుల రద్దీతో గ్రామోత్సవం నిలుపుదల

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

శ్రీశైలం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండోరోజు సోమవారం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉదయం ఉభయ దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లకు ఉదయం నుంచి ప్రత్యేక పూజాక్రతువులను నిర్వహించారు. చంఢీశ్వర పూజ, విశేష అర్చనలు శాస్ర్తోక్తంగా జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను భృంగివాహనంపై ఆశీనులనుజేసి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. కాగా శివదీక్షాపరులు వేల సంఖ్యలో తరలిరావడంతో, భక్తుల ఆందోళనలు గందరగోళం అధికంగా ఉండటంతో గ్రామోత్సవాన్ని నిలుపుదల చేశారు. గ్రామోత్సవం లేకపోయినప్పటికీ ఆలయం మాడవీధుల్లో కోలాటం, చెక్కభజన, వేషధారణలు, గురవయ్యలు, బుట్టబొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, నృత్యం, తప్పెట్లు, శంఖునాదాలు, మంగళవాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నల్లమల అటవీమార్గం మీదుగా కాలినడకన వచ్చే భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి శివస్వాములు తరలిరావడంతో శ్రీశైల క్షేత్రంలోని ప్రధాన వీధులన్నీ రద్దీగా దర్శనమిచ్చాయి.

నేడు హంసవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన మంగళవారం స్వామిఅమ్మవార్లు హంసవాహన సేవపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా విజయవాడ అమ్మవారి ఆలయం నుంచి అధికారులు, అర్చకులు శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 11:55 PM