అవస్థల ఆఖరి మజిలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:36 PM
ఆగ్రామంలో ఆఖరి మజిలికి కూడా అవస్థల తప్పడం లేదు. భూబకాసురుల దాహానికి ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయి.
ఆగ్రామంలో ఆఖరి మజిలికి కూడా అవస్థల తప్పడం లేదు. భూబకాసురుల దాహానికి ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయి. శ్మశాన స్థలాన్ని సైతం ఆక్రమించుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి దాపురిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని తోడెండ్లపల్లె గ్రామంలో దళితులకు కేటాయించిన శ్మశాన స్థలం ఆక్రమణకు గురైంది. దళిత కాలనీలో ఎవరైన మృతి చెందితే అంత్యక్రియలు, మృతదేహాన్ని పూడ్చేందుకు అవస్థలే. ఈ క్రమంలో శనివారం ఎస్సీ కాలనీకి చెందిన శ్రీరాముడు కుమార్తె మరియమ్మ(25) అనారోగ్యానికి గురై మృతి చెందింది. శవాన్ని పూడ్చేందుకు స్థలం లేక అవస్థలు పడ్డారు. శవ పేటికతో గ్రామ సమీపంలోని వంక వద్దకు తీసుకెళ్లి నీటిలో నుంచే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. శ్మశాన స్థలం వంక వెంబడి అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది. గతంలో 98 సర్వే నంబర్‌లో 45 సెంట్ల స్థలాన్ని శ్మశానం కోసం అధికారులు కేటాయించారు. కొలతలు వేసి వదిలేశారు. 6 ఏళ్లు గడుస్తున్నా స్థలాన్ని చూపలేదు. శ్మశాన స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకోవడంతో సమస్య తలెత్తిందని దళితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన స్థలాలను కాపాడాలని పలువురు వేడుకుంటున్నారు.
చాగలమర్రి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి)