Share News

దగా పడుతున్న వాము రైతు

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:22 PM

రైతు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ నుంచి వామును అమ్మేందుకు కర్నూలు మార్కెట్‌ యార్డుకు తెచ్చాడు.

దగా పడుతున్న వాము రైతు

ఎలక్ర్టానిక్‌ కాటాలో మాయాజాలం

చిలుకు పేరుతో మరింత దోపిడీ

రైతు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ నుంచి వామును అమ్మేందుకు కర్నూలు మార్కెట్‌ యార్డుకు తెచ్చాడు. ఎలక్ర్టానిక్‌ కాటాలో మాయాజాలం గురించి తెలుసుకొని నష్టపోతామని ఆందోళన చెందాడు. అక్రమాలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకొని గిట్టుబాటు ధర అందించాలని కోరాడు.

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 19 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు వామును కర్నూలు మార్కెట్‌ యార్డుకు అమ్మ కానికి తీసుకొస్తున్నారు. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వాము విక్రయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డు మారింది. కర్నూలు మార్కెట్‌ యార్డులోకు లభించే సెస్సులో ఎక్కువ వాము అమ్మకాల ద్వారానే వస్తోంది. అయితే వాము కొనుగోళ్లలో కొంతమంది కమిషన్‌ ఏజెంట్లు చేతి వాటాన్ని చూపుతూ నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం క్వింటం వాము ధర రూ.18 వేల నుంచి రూ.22వేల వరకు ధర పలుకుతోంది. ఎలక్ర్టానిక్‌ కాటాలో తేడా.. చిలుకు పేరుతో కొంత ఒక క్వింటం వాములో 5 కిలోలకు పైగానే స్వాహా చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. క్వింటం వాము ధర రూ.18వేల ప్రకారం అంచనా వేసినా 300 క్వింటాళ్లకు రూ.54లక్షలకు పైగానే కొంత మంది కమిషన్‌ ఏజెంట్ల జేబుల్లో చేరుతోందని రైతులు అంచనా వేస్తున్నారు.

కర్నూలు యార్డులో ఏటా 40 వేల నుంచి 50 వేల క్వింటాళ్ల వాము విక్రయాలు

కర్నూలు మార్కెట్‌ యార్డులోకి ఏపీ నుంచే కాకుండా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వామును కర్నూలు యార్డుకు తెస్తున్నారు. కర్నూలు యార్డులో మిర్చి తర్వాత వామే ప్రధానం. వ్యాపారులు వాము ఇక్కడ కొనుగోలు చేసి గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీలకు సప్లయ్‌ చేస్తున్నారు.

ఎలక్ర్టానిక్‌ కాటాతో అక్రమాలు

ఎలక్ర్టానిక్‌ కాటాలో క్వింటానికి 5 నుంచి 6 కేజీలు తక్కువ చూపుతూ దగా చేస్తున్నారని వాము రైతులు వాపోతున్నారు. తూనికలు కొలతల శాఖ అధికారులు కాటా సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించి సీలు వేస్తున్నారు. వారు అటు తిరగ్గానే కమిషన్‌ ఏజెంట్లు సీటును తీసి కాటాలో టెక్నాలజీని తమకనుకూలంగా మార్చి సీలును తగిలిస్తున్నారు. రైతులు ఎంతగా జాగ్రత్తగా గమనించినా ఎలక్ర్టానిక్‌ కాటాలో అక్రమాలను కనిపెట్టలేరు. కానీ తాము ఎలక్ర్టానిక్‌ కాటాతో భారీగా నష్టపోతున్నామని గ్రహించిన రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి తోడు క్వింటానికి రెండు కిలోల దాకా చిలుకు పేరుతో పక్కకు తీసేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూకాల వద్ద కనిపించని అధికారులు

రైతులు తెచ్చిన వామును ఎలక్ర్టానిక్‌ కాటాపై తూకం వేసే సమయంలో ఖచ్చితంగా మార్కెట్‌ కమిటీకి చెందిన పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సెక్యూరిటీ గార్డు వరకు ఎలక్ర్టానిక్‌ కాటా వద్దనే నిఘా వేయాలి. అయితే.. ఏదో వచ్చాము.. చూశాము.. పోతున్నాము అన్నట్లుగా వీరి డ్యూటీలు నిర్వహిస్తున్నారు.

గ్రామాల్లో భారీ జీరోపై వ్యాపారం

కర్నూలు మార్కెట్‌ యార్డుకు రైతులు తెస్తున్న వాము కంటే కర్నాటక వ్యాపారులు జీరోపై ఎక్కువ తరలించుకుపోతున్నారు. కర్నూలు మార్కెట్‌ యార్డుకు విక్రయానికి రాకముందే వ్యాపారులు ముందే ఒప్పందాలు చేసుకొని వారికి అడ్వాన్సులు చెల్లించి కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకెళ్లవద్దని చెబుతు న్నారు. రైతులు కూడా రవాణా ఖర్చులు తగ్గిపోతాయనే ఉద్దేశం తో గ్రామాల్లోకే వచ్చిన వ్యాపారులకు వామును కట్టబెడుతున్నారు.

రింగవుతున్న వ్యాపారులు..

వ్యాపారులందరూ ఒక్కటై ముందే కుదుర్చుకున్న మాట ప్రకారం ధరను నిర్ణయించుకొని టెండరు ఫారం దాఖలు చేస్తున్నారు. ఒకే నాణ్యత ఉన్న వామును వ్యాపారులు వివిధ ధరలను నిర్ణయించడంపై అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు తప్ప నాణ్యత పరిశీలించి రైతులకు న్యాయం చేసేందుకు ఎటువంటి శ్రద్ద చూపడం లేదు.

గిట్టుబాటు ధర అందిస్తాం

వాము విక్రయంలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటాం. చిలుకు పేరుతో జీరో వ్యాపారాన్ని కొనసాగించే కమిషన్‌ ఏజెంట్లపై నిఘా పెడుతున్నాం. వాము రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం.

- జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ

Updated Date - Jan 27 , 2026 | 11:22 PM